🌹 *సాధనలోన సత్య అవగాహన* 🌹
✍ *మాస్టర్ ఇ.కె*
*శ్రీమద్భాగవతము*
🌻 *ఏకాంతి అనగా ఒంటరితనమును అనుభవించువాడని అర్థము. తన్నాశ్రయించిన వారిని విడిచి, ఎప్పుడును తన గదిలోగాని, కొండగుహలలోగాని చేరి సాధన చేయుమని దీని ఉద్ధేశ్యము కాదు.*
*ఏకాంతమనగా అందరిలో ఒక్కనినే చూచుట అభ్యసించి, ఎందరిలో ఉన్నను తానొక్కడే యుండగలుగుట లేనిచో భారతభాగవతాది గ్రంథముల యందు నారదాది సత్పురుషులను ఏకాంతముఖ్యులుగా వర్ణించుట ఎట్లు పొసగును?*
*మననశీలుడు అనగా ధ్యానము తన స్వభావముగా ఏర్పడినవాడు. దేనిని చూచుచున్నను, ఎవరితో వ్యవహరించుచున్నను వారిలోని భగవంతునితో ధ్యానమున వ్యవహరించుట మననశీలము.*
*మత్సరమనగా ఒకరికున్నదానిని చూచి బాధపడుట. దీని వలన నిరంతర దుఃఖము కలుగును. విలువైన, అందమైన వ్యక్తులను, వస్తువులను, దుస్తులను, భూషణాలంకారములను చూచినపుడు వాని యందు దైవత్వము గమనించినచో మత్సరము పుట్టదు.*
*ఎవరితోనైనను మిత్రభావమును అభ్యసింపవలెను. తన్ను ద్వేషించి నిందించువాని ఎడల ఇది ఎట్లు సాధ్యమనరాదు. వాని హితముగోరి సంభాషించుట, పనిచేయుట మిత్రత్వమే అగును.*
*దయాగుణమును అభ్యసింపవలెను. ఆత్మజ్ఞానమును అలవరచుకొనవలెను.*
*శరీరము ఆత్మ కాదనియు, అందు అంతర్యామి ఆత్మయనియు, అతడే పరమాత్మ అనియు తెలిసి చరించుట.*
*తన శరీరమునందును, తనపై ఆదారపడినవారి యందును ఆత్రబుద్ధి తగదు. అది బంధమునకు కారణమగును. (తన శరీరమును అలంకరించు కొనుటలో ఎక్కువ కాలము వ్యర్థము చేయరాదు.*
*శరీరమునకు వ్యాధి కలిగినచో నియమము పాటించి ఔషధ సేవనము చేయవలెనుగాని వ్యాధిని గూర్చి దిగులు పడరాదు.*
*ముసలితనము కలిగినపుడు దాని లక్షణములను కప్పిపుచ్చుకొనుటకు కంగారుపడరాదు.*
*దేహము విడువవలసివచ్చినపుడు ఉత్కంఠ పడినచో తెలివి తప్పును కనుక మృత్యువు కలుగును. ప్రశాంతి లభించినచో తెలివి తప్పదు కనుక మృత్యువు కలుగక, దేహము తొలగును.......*
🌹🌹🌹🌹🌹🌹🌹
🙏 *ప్రసాద్*
No comments:
Post a Comment