🌸🌸 భగవంతుని తత్వం🌸🌸
భగవంతుని తత్త్వాన్ని ఎరుక పర్చుకోవడం చాలా కష్టం. భగవంతుని గూర్చి పూర్తిగా తెలుసుకొన్నవారు అరుదే. భగవంతుడు ఎవరు? ఎక్కడ ఉంటాడు? అసలు ఉన్నాడా? లేడా? అన్న సందేహం మాత్రం అందరికీ ఉంటుంది. కొందరు అప్పుడప్పుడు బయటకు వ్యక్తం కూడా చేస్తుంటారు. కాని భగవంతునికి ఆకారం లేదు. నామం లేదు. సృష్టికి కారణకారుడు మాత్రం పరాత్పరుడే అంటారు. జ్ఞానులంతా ధ్యానం చేసి ఏకాగ్రతతో భగవంతుడిని మెప్పించి తమ చర్మచక్షువులతో చూసినవారున్నట్లు పురాణాలు చెబుతాయి.భగవంతుడిని చూడాలనుకొంటే మంచి మార్గము, సులభమైనది భక్తి ఒక్కటే. తపో,జ్ఞాన మార్గాలున్నప్పటికీ ఇవి చాలా కష్టంతో కూడుకొన్నవి. ఎన్నో వేల యేండ్లు అనే్వషించినా ఫలితం దొరుకుతుందన్న నమ్మకం లేనివి. భక్తిమార్గంలో మాత్రం తప్పక భగవంతుడు మనకు వ్యక్తమవుతాడు. పైగా కోరుకున్న రూపాన్ని కూడా అపాదించుకుని మరీ భగవంతుడు కనిపిస్తాడు అన్న నమ్మకమున్న మార్గమిది. భక్తి సామ్రాజ్యంలోకి అడుగుపెట్టిన ప్రతివారు సమత్వబుద్ధిని అలవర్చుకుంటారు. ప్రతివారిలోను భగవంతుని అంశను చూస్తారు. వారికి జగత్తు జగన్నాథుడు ఒక్కటే గానే కనిపిస్తుంది. కనుక వారికి భగవంతుడు కాని వస్తువంటూ ఏదీ ఉండదు. దాని వల్లనూ భగవంతుని తత్వాన్ని తెలుసుకొనగలుగుతారు. అట్లాకాకపోయినా ఏ మూర్తిని భావించి వారు తమ భక్తిని వెల్లడిస్తారో ఆ ఆర్చామూర్తే వారి యెడల భగవంతుడుగా కనిపిస్తాడు.
భక్తిసామ్రాజ్యంలో భగవంతుడిని చూచినట్లు చెప్పడానికి భగవంతుని తమ అనుభవంలోకి తెచ్చుకున్నవారు ఎందరో కనిపిస్తారు. బెజ్జమహాదేవి త్రినేత్రుడిని తన బిడ్డడుగా భావించింది. ఆమె ముల్లోకాలను ఏలే ముక్కంటిని తన చంటిపాపగా ఎంచి తలారా స్నానపానాదులు చేయించి పక్షులు పారాడు వేళ బిడ్డడికి కీడుకలుగుతుందని అటువంటిది కలుగకుండా ఉండాలంటూ జాగ్రత్తలు తీసుకొంది.
రామకృష్ణ పరమహంస తన జీవితాన్ని కాళికామాతకే అర్పించాడు. తన భార్యను సైతం ఆది పరాశక్తిగానే భావించాడు. ఆ పరాశక్తి రామకృష్ణ పరమహంసకు కనిపించింది. అతని చేత ఎన్నో ఉపచారాలను పొందింది. అట్లానే యోగానంద, యుక్తేశ్వరస్వామి, బాబాజీ ఇలా ఎందరో మహాత్ములు భగవంతుని తాము కళ్లారా చూచినట్లు పురాణాలు ఇతిహాసాలు చెబుతున్నాయి
మట్టిని పిసికి కుండలు చేసి జీవనోపాధిని పొందే ఓ భక్తుడు భగవంతుని దర్శనానికి నేను వెళ్లలేను కదా అనుకొని తాను అనుకొన్న భగవంతుని రూపాన్ని మట్టితో చేసి ఆ మట్టినే పుష్పాలుగా రూపుదిద్ది భగవంతునికి అర్పించేవాడు. ఆ భక్తుని దగ్గరికే భగవంతుడే నడిచి వచ్చినట్లుగా వేంకటేశ్వరమహాత్మ్యం చెబుతుంది.
అట్లాంటిదే పుండరీకుని భక్తి. మొదట అంతా గాలి తిరుగుళ్లు తిరిగినా సత్యాన్ని తెలుసుకొన్న మీద తల్లి దండ్రుల సేవలో మునిగిపోయాడు. వారినే పరమాత్మ రూపాలుగా ఎంచాడు. వారిసేవలో మునిగిన పుండరీకుని కోసం పాండురంగడే పరుగెట్టి వచ్చి తనభక్తుని కోసం వేచి చూసాడని పాండురంగమహాత్మ్యం చెబుతుంది.
భగవంతుని తత్వాన్ని తెలుసుకోవడానికి భాగవతుల సేవ కూడా ముఖ్యమే. భాగవతులసేవను భగవంతుడు మెచ్చుతాడు. త్రిలోక సంచారి నారదుడు కూడా భాగవతుల సేవ చేసి నారాయణ మంత్రాన్ని పొంది నిత్యమూ నారాయణ జపంతో త్రిలోకాలు తిరిగే శక్తిని సంపాదించుకున్నాడు. పరమేశ్వరుడైనా, వైకుంఠుడైనా, బ్రహ్మ అయినా త్రిమూర్తులు ఆదిపరాశక్తి స్వరూపాలే సర్వానికి కారణం ఆ ఆదిపరాశక్తి నే అని తెలుసుకొన్నాడు. అందుకే భక్తాగ్రగణ్యుడయ్యాడు. భగవంతునికి ప్రీతి పాత్రుడయ్యాడు.
ఇలా ఎందరి భక్తుల కథల్లోమనకు పురాణాల్లో కనిపిస్తాయి. . అటువంటి భగవంతుడిని చూడాలనుకొంటే ముందుగా సమత్వబుద్ధిని, విశాల భావాన్ని పెంపొందించుకోవాలి. భగవంతుని తత్వాన్ని ఎరుకపర్చుకోవాలి. సర్వం పరాత్పరుని రూపంగా భావించాలి. అపుడు భక్తునికి భగవంతునికి తేడా ఉండదు. భగవంతుని తత్వాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా గురుమహాత్మ్యాన్ని తెలుసు కోవాలి. త్రిమూర్తుల కన్నా శక్తిమంతుడైన గురుఅనుగ్రహం పొందితే చాలు అనుకొన్నది సాధించగలుగుతారు.🌹
No comments:
Post a Comment