✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. ఆత్మ విచారణ పద్ధతి - 24 🌻
వివేకం ఎన్ని విధాలుగా వుంది?
నిత్యానిత్యవస్తు వివేకం
ఆత్మానాత్మ వివేకం
కార్యకారణ వివేకం
సదసద్ వివేకం
దృక్‌దృశ్య వివేకం
ఇందులో వరుసక్రమంలో రావాలన్నమాట. ముందుగా నిత్యానిత్యం, తరువాత ఆత్మానాత్మ, ఆ తరువాత కార్యకారణ. కార్యకారణ - కారణమేదో, కార్యమేదో నీకు స్పష్టంగా బోధపడేటటువంటి లక్షణం నీలో, పరిణామ ఫలితంగా నీకు రాకపోయినట్లయితే, అంటే కార్యకారణ వివేకాన్ని నీవు సముపార్జింక పోయినట్లయితే నువ్వు బ్రహ్మనిష్ఠుడవు అయ్యే అవకాశం లేదు. అట్టి కార్యకారణములకు సాక్షీభూతమేదైతే వున్నదో, అదియే బ్రహ్మము.
ఇంకేమిటట? కాలత్రయాబాధితము కాదు. అట్టి బ్రహ్మము ఎటువంటిదట? భూత భవిష్యత్ వర్తమానములనే త్రిపుటి చేత బాధించబడటం లేదు.
భూత భవిష్యత్ వర్తమానములందు ఎల్లకాలము ఎప్పుడూ వుండేది ఏదైతే వున్నదో, అదే బ్రహ్మము. కాబట్టి అపరిచ్ఛిన్నము. దాని లక్షణాలన్నీ నచికేతుడు చెబుతున్నాడు. బ్రహ్మము యొక్క లక్షణాలన్నిటినీ కూడా. ‘అపరిచ్ఛిన్నము’ - ఛిన్నము అంటే అనేకత్వము పొందినది.
అపరిచ్ఛిన్నము అనంటే ఏకము. ఎప్పుడూ ఎల్లకాలములందు ఏకమై వున్నదో, సత్యమై వున్నదో అటువంటి దానిని పరమాత్మ తత్వమును నీవెరిగి యున్నావు. ఆచార్యవర్యా! నీవెరిగియున్నావు. అటువంటి పరమాత్మ తత్త్వమును నాకు అనుగ్రహించుము.
అటువంటి బ్రహ్మోపదేశమును నాకు అనుగ్రహింపుము. అని యముని ప్రార్థించుచున్నాడు నచికేతుడు. ఆ రకంగా ప్రార్థిస్తూ, తాను పొందవలసినటువంటి లక్ష్యం ఎడల, సరియైనటువంటి నిర్ణయాన్ని, సరియైనటువంటి మార్గాన్ని, సరియైనటువంటి ఆచరణను, సరియైనటువంటి నిశ్చయాన్ని కలిగివున్నాడు. శిష్యులకు ఇది చాలా ముఖ్యం. తాను ఏది పొందాలి అనేది స్పష్టంగా పట్టుకోవడం రాకపోయినట్లయితే, ఆ లక్ష్యభేదనం జరుగుదు.
కాబట్టి ఎన్నిరకాలుగా నిన్ను ప్రకృతి ఏమార్చే ప్రయత్నం చేసినప్పటికి, జగత్తు ఏమార్చే ప్రయత్నం చేసినప్పటికి, నీ ఇంద్రియములు నిన్ను ఏమార్చే ప్రయత్నం చేసినప్పటికీ, నీలో వున్నటువంటి జీవభావం నిన్ను అధః పతనం చెందించే ప్రయత్నం చేసినప్పటికి, నీవు ఉత్తమగతి కలిగినటువంటి వాడవై, ఉత్తమ అనుశీలత కలిగినటువంటి వాడవై, ఉత్తమమైనటువంటి ప్రయత్నాన్ని కలిగినటువంటి వాడవై, నీ యొక్క జన్మసాఫల్యతను పొందించేటటు వంటి, పరమాత్మ తత్వమును గ్రహించేటటువంటి ప్రయత్నం చేయాలి.
పరబ్రహ్మనిర్ణయాన్ని పొందే ప్రయత్నం చేయాలి. నీ ప్రయత్నం సదా బ్రహ్మనిష్ఠ యందు నిలబడి వుండేటట్లుగా నువ్వు అనుశీలత కలిగి వుండాలి. అదే రకమైనటువంటి ఓరియన్టేషన్ [orientation] అంటారు.
నీ లక్ష్యం వైపుకు నీవు తిరిగి వుండేటటువంటి, లక్ష్యములో నిలచివుండేటటువంటి, లక్ష్యములో నిలకడ కలిగి వుండేటటువంటి, స్థిరమైనటువంటి పద్ధతిని ఎవరైతే ఆశ్రయిస్తారో, వాళ్ళుమాత్రమే, ఈ ఆత్మనిష్ఠని, ఈ బ్రహ్మనిష్ఠని ఈ పరబ్రహ్మనిర్ణయాన్ని పొందగలుగుతారు.
ప్రతి తలపుని, ప్రతి మాటని, ప్రతి చేతని తనలో కదిలే ప్రతి కదలికని కూడా కేవలం ఈ ఆత్మనిష్ఠకి, బ్రహ్మనిష్ఠకి, పరబ్రహ్మ నిర్ణయానికి సరిపోతుందా లేదా? అనేటటువంటి గీటురాయి మీద ఎవరైతే చూసుకోగలుగుతారో, వాళ్ళు మాత్రమే దీనిని పొందగలుగుతారు. - విద్యా సాగర్ స్వామి
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
Whatsapp Group
https://chat.whatsapp.com/5LFkJu3UEcQ5Kgx46WRsin
Telegram Group
https://t.me/ChaitanyaVijnanam
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #కఠోపనిషత్ #చలాచలబోధ
23 Sep 2020
No comments:
Post a Comment