సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము :
ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత
రాగాస్వరుప పాశాడ్యా క్రోధా కారంకుశోజ్జ్వల
🌻 7. 'చతుర్బాహుసమన్వితా 🌻
నాలుగు బాహువులు కలది, నాలుగు బాహువులుగా ఏర్పడినది లేక నాలుగు బాహువులతో కూడినది అని అర్థము. సంకల్పము నుండి ఏర్పడిన చేతనాగ్ని ఉద్భవించు సమయమున వేయి సూర్యుల అరుణకాంతిగా ఇంతకు ముందటి నామమున చెప్పబడినది.
అచటి నుండి క్రమశః నాలుగు బాహువులు పొందినదిగా ఈ నామము తెలుపుచున్నది. ఈ నాలుగు బాహువులే బ్రహ్మ జనించు నాలుగు దళముల పద్మముగను, అటుపై బ్రహ్మకేర్పడు నాలుగు ముఖములుగను, బ్రహ్మ ధరించు నాలుగు వేదములుగను తెలియవలెను.
అటులే దేవి ఉద్భవించినదై, సృష్టియందు నాలుగు స్థితుల యందున్నదని కూడ తెలియవలెను. ఈ నాలుగు స్థితులను పరా, పశ్యంతి, మధ్యమా , వైఖరి అని యందురు.
వైష్ణవ సంప్రదాయమున వాసుదేవ, సంకర్షణ , ప్రద్యుమ్న, అనిరుద్ధులుగా పేర్కొందురు. శాక్తేయులు ఆదిశక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులుగ పేర్కొందురు. నాలుగు కాలముల యందు నిండియున్న శక్తి స్వరూపిణిగ కూడ దేవిని గ్రహింపవచ్చును.
అనగా కృత, త్రేతా, ద్వాపర, కలియుగములలో వ్యాపించిన శక్తిగా భావన చేయవచ్చును. సృష్టి సమస్తము చతురస్రమే అని వేదము ఘోషించుచున్నది. విష్ణునామ సహస్రమునందు కూడ 'చతురస్రో' అను నామము కలదు. ఉద్భవించిన దేవి చతురస్రముగ రూపుగొనునని దీని భావము.
ఎర్రని కాంతితో కూడిన దేవి నాలుగు బాహువులు కలదిగ ధ్యానింపవలెనని కూడ ఇందలి సూచన. సృష్టి సమస్తము నందును ఈ నాలుగు బాహువులను దర్శింపవచ్చును. ప్రతి వస్తువునకును రూపముండును. ఆ రూపమునకు ఆధారముగ వర్ణముండును.
ఆ వర్ణమున కాధారముగ శబ్దముండును. శబ్దమున కాధారముగ తత్త్వముండును. తత్త్వము, శబ్దము, వర్ణము, రూపము అను నాలుగు స్థితులను ఒక వస్తువునందు దర్శించుటయే చతుర్బాహు దర్శనము.
కనబడు ప్రతి వస్తువు నందును కనపడక మూడు స్థితులు ఇమిడి యున్నవని తెలియవలెను. పురుష సూక్తమున ఈ ధర్మమునే “కనపడు విశ్వము, దానియందలి జీవులు ఒక పాదమని, కనపడక యున్న పాదములు మూడు అని, మొత్తము నాలుగు పాదములు పురుషునకు కలవని” వివరింపబడినది.
అటులనే గుణాతీతమైన తత్త్వము మూడు గుణములుగ ఏర్పడుట యందు కూడ ఈ చతుర్భాహువులను దర్శింపవచ్చును. దినము నందలి నాలుగు భాగములు (ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, అర్థరాత్రి); మాసము నందలి నాలుగు భాగములు (శుక్లాష్టమి, పౌర్ణమి, కృష్ణాష్టమి లేక బహుళాష్టమి, అమావాస్య), సంవత్సరమందలి నాలుగు భాగములు (మకర సంక్రమణము, వసంత సంక్రమణము (ఉత్తర), కర్కాటక సంక్రమణము, శరత్ సంక్రమణము (దక్షిణ) కూడ దేవి నాలుగు బాహువులేనని భావన చేయవలెను.
మానవులందు కూడ దేవి నాలుగు బాహువులు - అహంకారము, బుద్ధి, చిత్తము, మనస్సు అను అంతఃకరణ చతుష్టయముగ పనిచేయు చుండును. అహంకార మనగా తానున్నానని తెలివి. ఇట్లు తన యందును, తన చుట్టును ఉన్న సృష్టియందును ఈ నాలుగు స్థితులను భావించి, ధ్యానించి, దర్శించుట ఒక చక్కని సాధనా మార్గము. ఈ దర్శనమున దేవి ఎంత అద్భుతముగ నాలుగు బాహువులతో కూడి యున్నదో తెలియగలదు.
బాల్య, యౌవన, కౌమార, వార్థక్యములు, బ్రహ్మచర్య, గార్హస్థ్య, వానప్రస్థ, సన్యాస ఆశ్రమములను కూడ ఈ సందర్భముగా దేవి చతుర్బాహువులుగ గమనింప వచ్చును. జాగ్రత్, స్వప్న, సుషుప్తి, తురీయావస్థల యందు కూడ ఈ చతుర్బాహువులను దర్శింపవచ్చును. తురీయము దేవి సహజస్థితి. సిద్ధుని సహజస్థితి కూడ ఇదియే.
తురీయమను తెరపై సుషుప్తి, స్వప్న, జాగ్రదవస్థలు వచ్చి పోవుచునుండును. మేల్కొనినపుడు, స్వప్నమునందును, నిద్రయందును, తానున్నానని తెలిసి యుండుటయే తురీయ స్థితి. దేవి సృష్టియందును , ప్రళయము నందును, వానికతీతముగను గోచరించును.
ఇట్లు శాశ్వతత్త్వము ఆధారముగ త్రిగుణాత్మకముగ సృష్టి స్థితి లయాదులు జరుగునని తెలుపుటయే నాలుగు బాహువుల సంకేతము. భారతీయ సంస్కృతి యందు దేవతల కిట్లు నాలుగు బాహువులను రూపించుట కిదియే రహస్యార్థము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 7 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 Caturbāhu-samanvitā चतुर्बाहु-समन्विता (7) 🌻
The physical appearance of Lalitāmbikā begins here. She has four arms.
These four arms represent Her ministers, through whom She administers.
These Devi-s who assist Her are described in the next four nāma-s.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Whatsapp Group
https://chat.whatsapp.com/5LFkJu3UEcQ5Kgx46WRsin
Telegram Group
https://t.me/ChaitanyaVijnanam
No comments:
Post a Comment