🌹. గీతోపనిషత్తు -137 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 5వ అధ్యాయము - కర్మసన్న్యాస యోగము 📚
శ్లోకము 22
🍀. 20. స్థిర చైతన్యము - ఇంద్రియ సుఖములు, యింద్రియ భోగములు మొదలు సుఖము కలిగించినను, తరువాత దుఃఖము కలిగించగలవు. అవి అంతవంతములని తెలిసి బ్రహ్మజ్ఞాని వానియందు రమించడు. త్రిగుణాత్మకమగు ప్రకృతి సహజ లక్షణము మార్పు. అష్ట ప్రకృతులు ఎప్పుడును మార్పు చెందుచునే యుండును. మూల ప్రకృతి మార్పు చెందకయుండు వెలుగు. అది తొమ్మిదవది. ఆ స్థిరమగు వెలుగున కాధారము దాని కావలయున్న బ్రహ్మతత్వము. ఈ తత్వము నాశ్రయించినపుడు మనయందలి చైతన్యమను వెలుగు స్థిరముగ నుండును. స్థిరచైతన్యము ఆనంద దాయకము. 🍀
యే హి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవ తే ।
ఆద్యంతవంతః కౌంతేయ న తేషు రమతే బుధః ।। 22 ।।
ఇంద్రియ సుఖములు, యింద్రియ భోగములు మొదలు సుఖము కలిగించినను, తరువాత దుఃఖము కలిగించగలవు. అవి అంతవంతములని తెలిసి బ్రహ్మజ్ఞాని వానియందు రమించడు.
త్రిగుణాత్మకమగు ప్రకృతి సహజ లక్షణము మార్పు. అష్ట ప్రకృతులు ఎప్పుడును మార్పు చెందుచునే యుండును. మూల ప్రకృతి మార్పు చెందకయుండు వెలుగు. అది తొమ్మిదవది.
ఆ స్థిరమగు వెలుగున కాధారము దాని కావలయున్న బ్రహ్మతత్వము. ఈ తత్వము నాశ్రయించినపుడు మనయందలి చైతన్యమను వెలుగు స్థిరముగ నుండును. స్థిరచైతన్యము ఆనంద దాయకము.
అది పూర్ణము కూడ. అష్ట ప్రకృతులలోని చైతన్యము మార్పుకు నిరంతరము గురియగు చుండును. పంచేంద్రియములు, రజస్తమస్తత్వములు సన్నివేశములను బట్టి, కాలమును బట్టి, దేశమును బట్టి వివిధముగ అనుభవము కలిగించును. అవి సుఖము కలిగించునట్లుగ అనిపించునుగాని, ఆ సుఖమును అందీ అందనట్లు అనుభవింప చేయుచుండును.
తిథులకు గురియైన చంద్రుడు ఎట్లు హాని వృద్ధులను అనుభవించునో, మానవుడు కూడ అట్లే ద్వంద్వము లందు ఊగిసలాడు చుండును. ప్రకృతి విలాసమును దాటి, స్థిరముగ నుండి ప్రకృతి క్రీడను చూచుట మహదానంద దాయకము.
నదీ ప్రవాహమున కొట్టుకొని పోవుచున్నవాడు నదీ గమన మును గాని, పరిసరములగల ప్రకృతి రమ్యతనుగాని అనుభూతి చెందలేడు. స్థిరము, పటిష్ఠము అయిన నావయందు సుఖాసీనుడై, నదిపై పయనించు ప్రయాణికుడు ప్రవాహము యొక్క వేగమును, తీరమునందలి రమ్యమగు దృశ్యములను చూచి ఆనందించ గలడు.
అట్లే సృష్టి రమ్యతను శాశ్వతముగ అనుభూతి చెందుటకు సృష్టి కధిష్ఠానమైన తత్వమున స్థిరపడుట తెలివి. ఇట్టి తెలివి బ్రహ్మజ్ఞానికి మాత్రమే యుండును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
31 Jan 2021
No comments:
Post a Comment