🌹. ధ్యానం మాత్రమే మీకు వాస్తవంతో ముఖాముఖీ జరిగేలా చేస్తుంది. 🌹
🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀
📚. ప్రసాద్ భరద్వాజ
ఒకసారి జీవితమంటే ఏమిటో స్వయంగా మీరు తెలుసుకుంటే, మరణం గురించి మీరు ఏమాత్రం పట్టించుకోరు. అంతేకాక, దానిని అధిగమించి మీరు ముందుకు వెళ్ళగలరు. ఆ శక్తి మీలోనే ఉంది. అది మీ హక్కు. కానీ, అందుకు మీరు మీ మనసునుంచి మనోరహిత స్థితిలోకి చేరే చిన్నప్రయత్నం చెయ్యవలసి ఉంటుంది.
ఒక శిశువు జన్మించిన వెంటనే దాని జీవితం ప్రారంభమైనట్లు, ఒక వృద్ధుడు మరణించిన వెంటనే అతని జీవితం ముగిసిపోయినట్లు మీరు భావిస్తారు. కానీ, అది నిజంకాదు. జనన, మరణాలు జీవితం యొక్క రెండు చివరలు కావు. ఎందుకంటే, వాటికన్నా జీవితం చాలా పెద్దది. జీవితంలో అనేక జనన, మరణాలు జరుగుతూ ఉంటాయి. ఆద్యంతాలు లేనిదే జీవితం జీవిత, శాశ్వతత్వాలు రెండూ సమానమే. కానీ, జీవితం మరణంలోకి ఎలా మళ్ళుతుందో మీరు సులభంగా అర్థం చేసుకోలేరు. అలాగే, అది అసాధ్యమని కూడా మీరు అంగీకరించలేరు.
జీవితంలో అనూహ్యమైనవి కొన్ని ఉంటాయి. జీవితం మరణంలోకి మళ్ళడమనేది వాటిలో ఒకటి. ఎప్పుడు, ఎక్కడ జీవితం ముగిసి మరణంగా మారుతుందో అలాగే ఎప్పుడు, ఎక్కడ జీవితం మళ్ళీ ప్రారంభమవుతుందో మీరు గిరిగీసి చెప్పలేరు.
జీవితం ప్రారంభం శిశువు పుట్టినప్పుడా లేక గర్భధారణ జరిగినప్పుడా? గర్భధారణకు ముందే తల్లిగర్భంలోని బీజం, తండ్రి శరీరంలోని వీర్యకణాలు సజీవంగా ఉన్నాయే కానీ, మరణించలేదు.
ఎందుకంటే, రెండు నిర్జీవాల కలయిక ఒక జీవాన్ని ఎప్పటికీ సృష్టించలేదు. మరి శిశువు ఎప్పుడు జన్మించినట్లు? ఈ విషయంలో విజ్ఞానశాస్త్రం కూడా ఒక కచ్చితమైన నిర్ణయానికి రాలేకపోయింది. అందుకు కారణం దాని దగ్గర ఎలాంటి ఆధారము లేదు. ఎందుకంటే, పుట్టుకనుంచే బీజాలను తల్లి తనలో మోస్తోంది.
ఒక విషయాన్ని మీరు ఇక్కడ అంగీకరించాలి. గర్భధారణకు ముందే మీ ఉనికిలోని సగం మీ తల్లిలో సజీవంగా ఉంది. మిగిలిన సగం మీ తండ్రి ద్వారా సజీవంగానే లభిస్తుంది. ఎందుకంటే, తండ్రి శరీరంనుంచి విడుదలైన వీర్యకణాలన్నీ సజీవంగానే ఉంటాయి. కానీ, వాటి జీవితకాలం కేవలం రెండు గంటలు మాత్రమే.
ఆ సమయంలోనే అవి తల్లి శరీరంలో ఉన్న బీజాన్ని కలుసుకోవాలి. ప్రతి వీర్యకణం కచ్చితంగా తన లక్షణాలతో కూడిన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటుంది. కొన్ని కణాలు బీజం వైపు పరిగెడుతుంటే, మరికొన్ని కణాలు సోమరిపోతుల్లా చాలా నిదానంగా నడుస్తూ ఉంటాయి. అందుకే అవి ఎప్పటికీ బీజాన్ని చేరుకోలేవు. ఇలాంటి లక్షణాలన్నీ పుట్టుకతోటే సంక్రమిస్తాయి. అలాంటి లక్షణాలు సంక్రమించిన వ్యక్తులు మరణించేందుకైనా సిద్ధపడతారే కానీ, పరుగెత్తలేరు. కనీసం ఏం జరుగుతోందో కూడా వారికి తెలియదు.
- ఇంకాఉంది.
🌹 🌹 🌹 🌹 🌹
31 Jan 2021
No comments:
Post a Comment