🌹 . శ్రీ శివ మహా పురాణము - 338 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
85. అధ్యాయము - 40
🌻. శివదర్శనము -2 🌻
బ్రహ్మ ఇట్లు పలికెను -
విష్ణువు దేవతలు మొదలగు వారితో గూడియున్న బ్రహ్మను (నన్ను) ఇట్లు ఆదేశించి, దేవతలతో గూడి శివుని పర్వతమునకు వెళ్లవలెనని నిశ్చయించుకొనెను (21). విష్ణువు దేవతలతో మునులతో దిక్పాలకులతో ఇతరులతో గూడి తన ధామము నుండి బయలుదేరి మంగళకరము, శివుడు నివసించు పర్వత రాజము అగు కైలాసమునకు వెళ్లెను (22). కైలాసము శివప్రభునకు మిక్కిలి ప్రియమైనది. కింనరులు మొదలగు వారిచే సేవింపబడునది, అప్సరసలు మొదలగు దేవతాస్త్రీలచే మరియు యోగసిద్ధులచే సేవింపబడునది, మిక్కిలి ఎత్తైనది (23), అంతటా మణులు పొదిగిన అనేక శిఖరములతో ఒప్పారునది, అనేక ధాతువులతో రంగు రంగుల సానువులు గలది, అనేక విధముల చెట్లతో లతలతో దట్టముగా నిండియున్నది (24).
ఆ కైలాసము అనేక రకముల మృగముల గుంపులతో ఆవరింపబడియున్నది. అచట వివిధ రకముల పక్షులు ఉండెను. అనేక కొండకాలువలతో కూడియున్నది. దేవతాస్త్రీలు ప్రియులగు సురలతో గుడి వివిధ గుహలయందు (25) పర్వత సానువులయందు విహరించుచుండిరి. ఆ పర్వతము వెండి వలె కాంతులీనెను. అనేక వృక్ష జాతులతో ప్రకాశించెను (26). క్రౌర్యమును వీడిన వ్యాఘ్రము మొదలగు మహామృగములు అచట తిరుగాడుచుండెను. సమస్త శోభలతో గూడిన ఆ దివ్య పర్వతము గొప్ప అచ్చెరువును కలిగించుచుండెను (27). స్థానమహిమచే మరింత పుణ్యమగు ఉదకములు గలది, సర్వులను పావనము చేయునది, విష్ణు పాదముల నుండి పుట్టినది, పవిత్రమైనది అగు గంగచే చుట్టూవారబడియున్న ఆ పర్వతము నిర్మలముగ నుండెను (28).
శివునకు ప్రియమైన, కైలాసమని పేరు గాంచిన ఇట్టి పర్వతమును చూచి విష్ణువు మొదలగు దేవతలు మరియు మహర్షులు అచ్చెరువునందిరి (29). ఆ దేవతలు దాని సమీపమునందు శివమిత్రుడగు కుబేరుని అత్యంత దివ్యమైన, అలకయను పేర ప్రఖ్యాతి గాంచిన సుందరమగు పురమును చూచిరి (30). దాని సమీపములో సర్వ విధముల వృక్షములతో కూడిన సౌగింధికమను దివ్యవనమును చూచిరి. ఆ వనములోని పక్షుల ధ్వనులు అద్భుతముగ నుండెను (31). దానికి కొద్ది దూరములో దివ్యములు, మిక్కిలి పవిత్రమైనవి, దర్శనమాత్రముచే పాపములను పొగొట్టునవి అగు నంద, అలకనంద అనే సరస్సులు గలవు (32).
దేవతాస్త్రీలు ప్రతిదినము తమ లోకమునుండి అచటకు వచ్చి వాటిలోని నీటిని త్రాగెదరు. మన్మథ పీడితులగు వారలు తమ ప్రియులతో కలిసి వాటియందు జలక్రీడలాడెదరు (33). కుబేరుని నగరమును, సౌగంధిక వనమును దాటి ఆ దేవతలు కొద్ది దూరము వెళ్లి శంకరుని మర్రి చెట్టును చూచిరి (34). దాని ఊడల్నియు వేర్వేరు వృక్షములా అన్నట్లున్నవి. అది బహువిస్తారమగు తొలగిపోని నీడను ఇచ్చుచుండెను. దాని క్రింద చల్లగా నుండెను. అది వంద యోజనముల ఎత్తుండెను. దాని యందు పక్షుల గూళ్లు లేకుండెను (35). ఆ స్థలములో శంభుడు తపస్సును చేసెను. ఆ దివ్య స్థలము మహాపుణ్యాత్ములకు మాత్రమే చూడనగును. ఆ సుందర స్థలము పరమ పావనమైనది. మహోత్తరమగు ఆ స్థలమును యోగులు సేవించెదరు (36).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
31 Jan 2021
No comments:
Post a Comment