భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 222


🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 222 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. జైమినిమహర్షి - 7 🌻


36. కర్మకర్మకు ఉన్న సంబంధంగురించి చెప్పాడు జైమిని. వైదిక కర్మమంతా కూడా తంత్రమే! ఆ తంత్రం చాలా కఠినంగా ఉంటుంది. పవిత్రగ్రంథి ఎంతఉండాలి వంటివి ఉంటాయి. దర్భపొడవు ప్రాదేశికమాత్రం అంటాడు. యజమానికి జానేడు అని అర్థం. అంతే తీసుకోవాలి.

37. ప్రాదేశిసూత్రం జానెడు ముడివేసిన తరువాత, చివరినుండి ముడితో కలిపి జానెడు తీసుకోవాలి. దాన్నేమో ఛేధించాలి. ‘న నఖేన’, అంటే గోళ్ళతో కాదు అని చెప్తారు వెంటనే. అంటే గోరుతో తంపకూడదు దానిని. దానిని ఒక పాత్ర అంచు మీద ఉంచి తెంపాలి. ఇదంతా తంత్రం. ఇది జ్ఞానానికి గాని, భక్తికిగాని హేతువు కాజాలదు. కర్మయందు శ్రద్ధ ఉన్నప్పుడు, ఎక్కడో ఉండేటటువంటి ఈశ్వరుణ్ణి ధ్యానం చేయటం అనే భావన పుట్టదు. అది అక్కడ అప్రస్తుతమవుతుంది. యజ్ఞం చూచేవారికి భక్తికి, ఈశ్వరధ్యానానికి అవకాశం ఉంది.

38. ధ్యానం చేస్తే, వాళ్ళు నమస్కరిస్తూ ఉంటే, యజ్ఞపురుషుడికి – పరమేశ్వరుడో, విష్ణువో ఎవరైతే ఉన్నారో, యజ్ఞ స్వరూపుడయిన వాడెవడో, యజ్ఞం ఎవరినుంచీ పుట్టిందో, ఎవరి ఆజ్ఞానుసారంగా ఆ యజ్ఞం ఆ ఫలాన్ని ఇస్తుందో, అట్టి పరమేశ్వరునికి – ఈ ధ్యానం, నమస్కారం చెందుతాయి. కాబట్టి యజ్ఞం చూచేవారికైనా ఫలం వస్తుంది.

39. చేసేవాడికి ధ్యానం ఎక్కడ ఉన్నది? దర్భలు మొత్తం 108 ఉన్నాయాలేవా అని లెక్కపెట్టుకోవటం వంటి శాస్త్రవిహితమైన విషయాలపైనే ఏకాగ్రత ఉంటుంది. యజ్ఞకర్తకు, యజమానికి భక్తిభావాలతో సంబంధంలేనటువంటి ఏకాగ్రత నూరుశాతం ఉంటే, ఎక్కడా పొరపాటు రాకుండా చూచుకోవచ్చు. ఎక్కడయినా కొంచెం పొరపాటు వచ్చిందా, ఆ కోరిన ఫలమ్రాదు. కాబట్టి కర్మకు, కర్మకు ఉండే సంబంధం, అలాగే ఎందుకు చెయ్యాలి? ఇటువంటివన్నీ ఆ సూత్రములలో చెప్పారు.

40. జైమినిమహర్షి దానం విషయంలో మరొకసూత్రం వ్రాసాడు, తనకు ఆపద్ధర్మంగా అత్యవసరంగా కావలసింది ఉంచుకోవచ్చు అన్నాడు. లేకపోతే పుత్రులను, భార్యను అందరినీ కూడా ఇవ్వవలసి వస్తుంది. భార్యను కూడా ఎవరింట్లోనైనా దాసీపని చేయమని దానమిచ్చే అవకాశం ఉంది.

41. కాబట్టి ఉన్నదంతా దానం చెయ్యమనే ప్రస్తావన వచ్చినప్పుడు, ఏదీ మిగలదు, తన శరీరం తప్ప! కాబట్టి ఈ యుగంలో, ఈ కాలంలో, ఉన్నదంతా దానంచేయటమనేది పొసగదు. యావఛ్ఛక్తితో ఎంత దానం చేయగలిగితే అంతా దానంచేస్తే, ఈ ఫలం వస్తుందని జైమిని మహర్షియొక్క అభిప్రాయం.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


31 Jan 2021

No comments:

Post a Comment