✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚
శ్లోకము 2
🍀 2. దివ్య సంకల్పము - నిత్య నైమిత్తిక కర్మలను, కర్తవ్య కర్మను ఫలా పేక్షను ఆశ్రయింపక నిర్వర్తించువాడు, తనదైన యితర సంకల్పములు లేనివాడు యోగి యగును. కర్తవ్య కర్మలు ప్రారబ్దము నుండి, సంచితము నుండి కాలము రూపమున ఏర్పడుచుండును. కాలమందించిన కర్మమును ఫలాపేక్ష రహితముగ నిర్వర్తించుటయే సాధకునకు ప్రధానము. ఋణము, కర్మము తరుగవలెనన్నచో కర్తవ్య నిర్వహణమే గాని అందుండి మరల మొలకలు పుట్టించు కొనుట కాదు. దైవము స్వతంత్ర బుద్ధి నిచ్చెను. స్వతంత్ర బుద్ధిని బాధ్యతయని ఎరిగి నిర్వర్తింప వలెనే గాని, హక్కుగ భావించి దుర్వినియోగము చేయరాదు. 🍀
యం సన్న్యాస మితి ప్రాహు ర్యోగం తం విద్ది పాండవ |
న హ్యసన్న్యస్త సంకల్పో యోగీ భవతి కశ్చన || 2
దేనిని సన్యాసమని చెప్పుదురో దానినే యోగమని గూడ నెరుగుము. సంకల్ప సన్యాసము చేయనివాడు యోగి కానేరడు. (అట్టివాడు సన్యాసియు కాదు.)
నిత్య నైమిత్తిక కర్మలను, కర్తవ్య కర్మను ఫలా పేక్షను ఆశ్రయింపక నిర్వర్తించువాడు, తనదైన యితర సంకల్పములు లేనివాడు యోగి యగును. సన్యాసియు అగును. పుట్టగొడుగుల వలె సంకల్పములు గలవారు సన్యాసులు కారు, యోగులు కారు. కోరికలు గలవారు, యిచ్ఛాద్వేషములు కలవారు యోగమును గూర్చి, సన్యాసమును గూర్చి భావించుట వ్యర్థము.
నిత్య నైమిత్తిక కర్మ లనగా దంతధావనము, స్నానము, ఆహార స్వీకరణము, నిద్ర మొదలగునవి. ఇవి ఎవ్వరికైనను తప్పని సరి. కర్తవ్య కర్మలు ప్రారబ్దము నుండి, సంచితము నుండి కాలము రూపమున ఏర్పడుచుండును. కాలమందించిన కర్మమును ఫలాపేక్ష రహితముగ నిర్వర్తించుటయే సాధకునకు ప్రధానము.
నిర్వర్తించు కర్మల నుండి, కర్తవ్యముల నుండి రజోగుణము కారణముగ నూతన సంకల్పములు, నూతన కర్మలను సాధారణముగ మానవుడు పెంచుకొను చుండును. బాకీలు తీర్చుచు, క్రొత్త బాకీలు ఏర్పరచు కొనువాడు తెలివిగలవాడను కొనుటకు వీలు లేదు. ఋణము, కర్మము తరుగవలెనన్నచో కర్తవ్య నిర్వహణమే గాని అందుండి మరల మొలకలు పుట్టించు కొనుట కాదు. పూర్వము చేసిన కామపూరిత సంకల్పముల కారణముగ ఋణము లేర్పడుటచే, ఆ ఋణములే ప్రస్తుత జన్మమున కర్తవ్యములుగ దరి చేరును.
శ్రద్ధాభక్తులతో వానిని నిర్వర్తించుటయేగాని నూతన కర్మల నేర్పరచుకొనరాదు. ఏది కర్తవ్యమో, ఆ కర్తవ్యము నెంతవరకు నిర్వర్తించవలెనో, తెలిసి నిర్వర్తించవలెను. తమది కాని కర్తవ్యము తమదనుకొనుట అవివేకము. రజోగుణ దోషము వలన ధనకాంక్ష, కీర్తి కాంక్ష, పదవీ కాంక్ష లేర్పడి, చేయుచున్న కర్తవ్యముల నుండి అనేకానేక కార్యములు పుట్టుచు నుండును. స్వకాంక్షకై నిర్వర్తించుట యుండును. గనుక చేయు పనులయందు అవకతవకలుండి, వాని నుండి కర్మఫలములు పుట్టి, మరల ఋణ రూపము ధరించి, కర్తవ్యములై కాలము రూపమున సమీపించును.
తన సంకల్పములే తన బంధనములకు కారణమని తెలియుటకు కొన్ని జన్మలు పట్టవచ్చును. సృష్టి యందు దివ్య సంకల్పమొకటి ఆరంభము నుండి నడచుచున్నది. సృష్టి కథ మధ్యమున మానవు డవతరించినాడు. అతడు జరుగుచున్న కథలో తన వంతు కర్తవ్యమును నిర్వర్తించినచో ఉత్తీర్ణు డగును. కృతకృత్యు డగును. లేనిచో బందీ యగును.
జరుగుచున్న కథలో తన కథను స్వంత సంకల్పములతో చేర్చుట వలన మానవుడు బద్దుడగుచున్నాడు. అతనికి దైవము స్వతంత్ర బుద్ధి నిచ్చెను. స్వతంత్ర బుద్ధిని బాధ్యతయని ఎరిగి నిర్వర్తింప వలెనే గాని, హక్కుగ భావించి దుర్వినియోగము చేయరాదు. అట్లు చేసినచో రజస్తమస్సులు తనయందు ప్రకోపించి, తనను శాశ్వత బందీని చేయును. విమోచనము కావలెనన్న తపన యున్నచో, స్వంతముగ సంకల్పించుట మాని కర్తవ్యము మాత్రమే ఆచరించుట నేర్వవలెను.
దీర్ఘకాలమట్లు నిర్వర్తించినపుడు, రజస్తమో గుణములు శాంతించి సత్వ మలవడును. సత్వమున నిలబడుటకు సంకల్ప సన్యాసము ముఖ్యము. అట్టివాడే సన్యాసమునకు గాని, యోగమునకు గాని అర్హత గలవాడు. వ్యక్తిగత సంకల్పములున్న వారు యోగమున, సన్యాసమున ప్రవేశింపలేరు. ఇది నిశ్చయము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
13 Feb 2021
No comments:
Post a Comment