శ్రీ శివ మహా పురాణము - 348


🌹 . శ్రీ శివ మహా పురాణము - 348 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴

88. అధ్యాయము - 43

🌻. దక్షయజ్ఞ పరిసమాప్తి -3 🌻


శంకరుని మహిమ అనంతము.పండితులు కూడా తెలియజాలరు. కాని భక్తులు ఆయన యందు భక్తిన చేసి ఆయన అనుగ్రహముచే శ్రమ లేకుండగనే ఆయన ను తెలియగల్గుదురు (36). పరమాత్మయగు శివునకు ఒక్క వికారమైననూ లేదు. కాని విషాదమును పొందినాడు యన్నట్లు లోక గతిని అనుసరించి లీలను ప్రదర్శించును (37).

ఓ మహర్షీ! శివుని చరితమును చదివిన వాడు వినిన వాడు జ్ఞానియై సర్వమానవులలో ఉత్తముడగును. అట్టివాడు ఇహలోకములో ఉత్తమ సుఖమును పొంది దివ్యమగు సద్గతిని పొందును (38). ఈ విధముగా దక్ష పుత్రియగు సతి తన దేహమును విడిచిపెట్టి, హిమవంతుని భార్యయగు మేనకయందు జన్మించెనని పురాణాదులు యందు ప్రసిద్ధి గాంచెను (39).

ఆమె ఆ జన్మలో మరల తపస్సు చేసి శివుని భర్తగా వరించెను . ఆ ఉమాదేవి గౌరియై శివుని వామ భాగమును తనది చేసుకొని అద్భుతమగు లీలలను ప్రదర్శించెను (40).ఇంత వరకు పరమాద్భుతము, భుక్తి ముక్తులనిచ్చునది, దివ్యము కోర్కెలనన్నిటినీ ఈడేర్చునది అగు సతీ చరిత్రమును నీకు వివరించి చెప్పితిని (41).

ఇది నిర్దోషము, పవిత్రము, పరమ పావనము, స్వర్గ ప్రదము, కీర్తిని ఇచ్చునది, ఆయుర్దాయమునిచ్చునది, పుత్ర పౌత్రఫలమునిచ్చునది అగు గాథ (42).

వత్సా! ఎవరైతే ఈ గాథను భక్తితో విందురో, ఎవరైతే భక్తి గలవారై ఇతరులకు వినిపించెదరో వారు కోర్కెలనన్నిటినీ పొందుటయే గాక, పరలోకములో ఉత్తమగతిని పొందెదరు (43). ఈ శుభకరమగు గాథను చదివిన వారు, మరియు చదివించిన వారు కూడా ఇహలోకములో భోగములనన్నిటినీ అనుభవించి, దేహ త్యాగానంతరము మోక్షమును పొందెదరు (44).

శ్రీ శివ మహాపురాణములో రెండవదియగు రుద్రసంహితయందు రెండవది యగు సతీఖండలో దక్షయజ్ఞ పరిసమాప్తి యను నలభై మూడవ అధ్యాయము ముగిసినది (43).

రుద్ర సంహితయందలి రెండవ సతీఖండ ముగిసినది (2).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


13 Feb 2021

No comments:

Post a Comment