భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 232
🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 232 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. దేవలమహర్షి - 3 🌻
13. వినయశీలునిగా ఉండటము, తనకుతాను నిత్యతృప్తుడుగా ఉండటము, పరద్రవ్యాన్ని స్వప్నంలోకూడా కోరకుండా ఉండటము, తనను ఎవరైనా గౌరవించినా గౌరవించకపోయినా నిస్పృహతో ఉండటము – దీనినే యథార్థశీల సంపద కలిగి ఉండటమనవచ్చు.
14. కొన్ని విషయాలలో శీలము అనే మాటకు అర్థంచెప్పటం సులభమే! అంటే తనకు చెందని వస్తువు, తనకు ఆధ్యాత్మికమార్గంలో పొందరానివస్తువు ఏదయితే ఉన్నదో దానియొక్క స్మరణం కూడా శీలభ్రష్టత్వానికి హేతువవుతుంది.
15. ఆధ్యాత్మిక మార్గానికి సంబంధించి ఏదయినా ధ్యానంచేయదగని వస్తువు, ఉంటే దానిని కోరటము – ఏది కోరితే అది ఈ మార్గంలో పనికిరాదో దానిని కోరటము – శీలభ్రష్టత్వము అవుతుంది.
16. అందువల్లనే విశ్వామిత్రాది మహర్షులుకూడా తపస్సును వ్యయంచేసారు. అయితే వారు దుశ్శీలురు అంటానికి వీలులేదు. తమయొక్క తపోనిష్ఠకు, బ్రహ్మలోకప్రాప్తికి హేతువుకానటువంటి వస్తువు తననొచ్చి వరిస్తేకూడా దానిని చూడకూడదు. అదే సూత్రం యథార్థంగా తీసుకున్నారు. కాబట్టి శీలమే గొప్పది.
17. మానావమానాలగురుంచి భగవద్గీతలో కృష్ణభగవానుడు చెప్పాడు. అవమానము కలిగినపుడు దానిని అమృతంలాగా తీసుకోవచ్చు. తనలో ఏ దోషం ఉందో, ఏ పాపం ఏ సందర్భంలోనో ఎక్కడ చేసిఉన్న కారణంగా ఈ అవమానం తనకు లభించిందో అని అతడు అనుకోవాలి. “బాగుంది. ఈ అవమానం ఇప్పుడు పొందటంవలన ఆ పాపం పోయిందికదా! శభాష్ చాలా బాగుంది” అని అట్టివాడు సంతోషిస్తాడు.
18. ఎవరయినా ఆదరించి గౌరవించనప్పుడు, “అయ్యో! నా పుణ్యం క్షీణించిపోతున్నది. దీనివల్ల నా మనసు భ్రంశంపొంది నాకు అహంకారం వస్తుందేమో? ఈ గౌరవం నాకెందుకు?” దానిని భయంతో విషప్రాయంగా చూడమని చెప్పారు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
13 Feb 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment