ప్రేమ భయాన్ని కలిగిస్తుందా?


🌹. ప్రేమ భయాన్ని కలిగిస్తుందా? 🌹

🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀

✍️. భరత్‌, 📚. ప్రసాద్ భరద్వాజ



నిజానికి, ప్రేమానుబంధం మీకు అనేక సమస్యలు సృష్టిస్తుంది. వాటిని ఎదుర్కోవడం మంచిదే. కానీ, అనుబంధాలకు అతీతులమని చెప్పుకునే తూర్పు దేశాలలోని వ్యక్తులు తమ ప్రేమను వ్యతిరేకిస్తూ, నిరాకరిస్తూ, అది సృష్టించే సమస్యల నుంచి తప్పించుకుని, ప్రేమరహితులుగా, నిర్జీవులుగా తయారయ్యారు. ఆ రకంగా తూర్పుదేశాలలో ప్రేమ దాదాపు అదృశ్యమై కేవలం ధ్యానం మాత్రమే మిగిలింది.

ధ్యానమంటే మీరు ఏకాంతంలో మీతో హాయిగా ఉండడమన్న మాట. అలా మీ వృత్తం మీతో పూర్తవుతుంది. అందులోంచి మీరు బయటకు వెళ్ళరు. దానివల్ల తొంభై తొమ్మిది శాతం సమస్యలు పరిష్కారమవడంతో మీరు అతి తక్కువ సమస్యలో ఉంటారు. కానీ, దాని కోసం మీరు చాలా చెయ్యవలసి ఉంటుంది.

తూర్పు దేశాలలో కళ్ళు మూసుకుని తన అంతరంగ కేంద్రంలో హాయిగా, సురక్షితంగా జీవించే వ్యక్తి తక్కువ ఆందోళన, తక్కువ ఉద్రిక్తతలతో ఉంటాడు. అతడు తన శక్తిని బయటకు ప్రవహించనివ్వకుండా తనలోనే ఇముడ్చుకుంటాడు. అందుకే అతడు ఆనందంగా ఉంటాడు. కానీ, అతని ఆనందం తక్కువ జీవంతో ఉంటుందే కానీ, పరమానంద పరవశంతో ఉండదు.

మహా అయితే, మీరు చాలా ఆరోగ్యంగా, హాయిగా ఉందని, ఎలాంటి రోగం లేదని చెప్తారు. కేవలం రోగం లేనంత మాత్రాన పూర్తి ఆరోగ్యం ఉన్నట్లు కాదు. అదే నిజమైతే, ఎలాంటి రోగం లేని శవం కూడా ఆరోగ్యంగా ఉన్నట్లే కదా!

కాబట్టి, తూర్పు దేశాలలో ప్రపంచాన్ని పరిత్యజిస్తూ, ప్రేమరాహిత్యంతో జీవించే ప్రయత్నమే జరిగింది. అంటే, స్త్రీని ద్వేషించడం, పురుషుని ద్వేషించడం, ప్రేమను కాదనడం- ఇలా ప్రేమ వికసించే అవకాశాలన్నింటినీ పరిత్యజించడం జరిగింది.

నిజానికి, ఒంటరిగా ఉన్న స్త్రీతో మాట్లాడేందుకు, ఆమెను తాకేందుకు, చివరికి ఆమెను చూసేందుకు కూడా జైన, హిందూ, బౌద్ధ సన్యాసులకు అనుమతి లేదు. ఒకవేళ ఏదైనా అడిగేందుకు స్త్రీ వచ్చినప్పుడు వాళ్ళు నేల చూపులు చూస్తూ మాట్లాడాలే కానీ, పొరపాటున కూడా ఆమె ముఖాన్ని చూడకూడదు. ఎవరికి తెలుసు? ఏదైనా జరగచ్చు. ఎందుకంటే, ప్రేమ చేతిలో అందరూ నిస్సహాయులే. అందుకే వారు ఎవరి ఇళ్ళల్లోను నివసించరు, ఒకే చోట ఎక్కువ కాలం ఉండరు.

ఎందుకంటే, ప్రేమానుబంధాలు ఏర్పడే అవకాశముంటుంది. అందుకే వాటిని తప్పించుకునేందుకు వారు ఒకేచోట ఉండకుండా ఊళ్ళు తిరుగుతూ ఉంటారు. అలా వారు ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా, తాము ఇబ్బంది పడకుండా ఒక రకమైన నిశ్చలత్వాన్ని సాధించారు. అయినా వారు సంతోషంగా లేరు, వేడుక చేసుకోలేరు.

పాశ్చాత్య దేశాలలో దీనికి వ్యతిరేకంగా జరిగింది. ప్రేమకలాపాల ద్వారా సంతోషాన్ని సాధించే ప్రయత్నంలో వారు తమకు తాము దూరమై, ఇంటిదారి తప్పి, వెనక్కి ఎలా రావాలో తెలియక చాలా ఇబ్బందుల్లో పడ్డారు. దానితో వారు పిచ్చిపిచ్చిగా అన్నిరకాల ప్రేమకలాపాలలో పాల్గొంటూ స్వలింగ, భిన్నలింగ, యాంత్రిక సంపర్కులుగా తయారయ్యారు. అయినా వారిలో శాంతి లేదు.

ఎందుకంటే, ప్రేమకలాపాలు కేవలం శారీరక సుఖాన్నిస్తాయే కానీ, అక్కడ ఎలాంటి నిశ్శబ్దము ఉండదు. అందువల్ల కావలసిన శారీరక సుఖాలు లభించినప్పటికీ ఏదో కోల్పోయిన భావన మీలో ఒక జ్వరంలా ఇంకా మిగిలే ఉంటుంది. దాని తీవ్రత వల్ల మీరు చాలా ఉద్రిక్తతకు లోనై అనవసరమైన దానికి అతిగా కంగారుపడుతూ ఉంటారు. అయినా, దానిని వెంటాడుతూ ఆయాసపడడం తప్ప మీకు దక్కేదేముండదు.

- ఇంకాఉంది.

🌹 🌹 🌹 🌹 🌹


13 Feb 2021

No comments:

Post a Comment