శ్రీ శివ మహా పురాణము - 198


🌹 . శ్రీ శివ మహా పురాణము - 198 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - సృష్టిఖండః 🌴

43. అధ్యాయము - 18

🌻. గుణనిధి సద్గతిని పొందుట - 5 🌻

గ్రామాధీశాన్స మహూయ సర్వాన్స విషయస్థితాన్‌ |ఇత్థమాజ్ఞాపయామాస దీపా దేయాశ్శివాలయే || 56

అన్యథా సత్యమేవేదం సమే దండ్యో భవిష్యతి | దీపదానాచ్ఛి వస్తుష్టో భవతీతి శ్రుతీరితమ్‌ || 57

యస్య యస్యాభితో గ్రామం యావంతశ్చ శివాలయాః | తత్ర తత్ర సదా దీపో ద్యోతనీయోsవిచారితమ్‌ || 58

మామాజ్ఞాభంగో దోషేణ శిరశ్ఛేత్స్యా మ్య సంశయమ్‌ | ఇతి తద్భయతో దీప్తాః ప్రతి శివాలయమ్‌ || 59

అతడు తన రాజ్యమందలి గ్రామాధికారుల నందరిని పిలిచి, ఇట్లు ఆజ్ఞాపించెను. శివాలయమందు దీపములను వెలిగించవలెను (56).

అట్లు చేయని వ్యక్తిని నేను దండించెదను. ఇది సత్యము. దీపములను వెలిగించినచో, శివుడు సంతుష్టుడగునని వేదములు చెప్పుచున్నవి (57).

ప్రతి అధికారి తన అధికారక్షేత్రములోని గ్రామములలో ఉన్న శివాలయములన్నింటి యందు నిత్యము దీపమునకు ఏర్పాటు చేయవలెను. దీని విషయములో చర్చకు తావు లేదు (58).

నా ఆజ్ఞను ఉల్లంఘించిన వారికి ఉరిశిక్ష వేయబడును. సందేహము లేదు. ఈవిధముగా రాజ భయము వలన ప్రతి శివాలయమునందు దీపములు ప్రకాశించెను (59).

అనేనైవ స ధర్మేణ యావజ్జీవం దమో నృపః | ధర్మర్థిం మహతీం ప్రాప్య కాలధర్మవశం గతః || 60

స దీపవాసనాయోగా ద్బహూన్దీపాన్ర్పదీప్య వై | అలకాయాః పతిరభూద్రత్నదీపశిఖాశ్రయః || 61

ఏవం ఫలతి కాలేన శివేsల్పమపి యత్కృతమ్‌ | ఇతి జ్ఞాత్వా శివే కార్యం భజనం సుసుఖార్థిభిః || 62

క్వ స దీక్షితదాయాదస్సర్వ ధర్మారతిస్సదా | శివాలయే దైవయోగాద్యాతశ్చోరయితుం వసు || 63

దమ మహారాజు జీవించి యున్నంత కాలము ఇదే ధర్మము నాచరించి గొప్ప పుణ్య సమృద్ధిని పొంది మరణించెను (60).

అతడు దీపమును వెలిగించిన సంస్కారబలముచే అనేక దీపములను వెలిగించి, రత్న దీపముల కాంతులకు నిలయమైన అలకానగరమునకు ప్రభువు ఆయెను (61).

ఈ తీరున శివునకు చేసిన ఆరాధన అల్పమైనా కొంత కాలమునకు ఫలించునని యెరింగి సుఖమును గోరు మానవులు శివుని భజించవలెను (62).

సర్వదా సర్వధర్మములకు విముఖుడైన దీక్షితపుత్రుడు ఎక్కడ? ఆతడు దైవయోగము వలన సంపదనపహరించుటకు శివాలయమును జొచ్చినాడు (63).

స్వార్థదీప దశోద్యోతలింగమౌలి తమోహరః | కలింగ విషయే రాజ్యం ప్రాప్తో ధర్మరతిం సదా || 64

శివాలయే సముద్దీప్య దీపాన్‌ ప్రాగ్వాసనోదయాత్‌ | క్వైషా దిక్పాలపదవీ మునీశ్వర విలోకయ || 65

మనుష్యధర్మిణానేన సాంప్రతం యేహ భుజ్యతే | ఇతి ప్రోక్తం గుణనిధేర్యజ్ఞ దత్తాత్మజస్య హి || 66

చరితం శివ సంతోషం శృణ్వతాం సర్వకామదమ్‌ | సర్వ దేవశివేనాసౌ సఖిత్వం చ యథేయివాన్‌ || 67

తదప్యేకమనా భూత్వా శృణు తాత బ్రవీమి తే || 68

ఇతి శ్రీ శివ మహాపురాణ ద్వితీయాయాం రుద్ర సంహితాయాం ప్రథమ ఖండే సృష్ట్యుపాఖ్యానే కైలాసగమనో పాఖ్యానే గుణనిధే స్సద్గతి వర్ణనం నామ అష్టాదశోSధ్యాయః (18).

ఒక ప్రయోజనము నాశించి ఈతడు దీపమును ప్రకాశింపజేయగా శివలింగ శిరస్సు పై గల చీకటి తొలగినది. దాని మహిమచే ఈతడు కలింగాధిపతియై, సర్వదా ధర్మశ్రద్ధ కలిగియుండెను (64).

పూర్వ జన్మ సంస్కారము ఉద్బుద్ధమగటచే నీతడు శివాలయములలో దీపములను పెట్టించినాడు. ఓ మునిశ్రేష్ఠా! తిలకించుము. ఈతడు ఇప్పుడు దిక్పాల పదవిని పొందినాడు (65).

ఈతడు ఇప్పుడు కుబేరుడై దుస్సాధ్యమగు దిక్పాల పదవిని అనుభవించుచున్నాడు. యజ్ఞదత్తుని కుమారుడగు గుణనిధి యొక్క వృత్తాంతము నింతవరకు చెప్పితిని (66).

ఈ చరితము శివునకు ప్రీతిని కలిగించును. వినువారల కోర్కెల నన్నిటినీ ఈడేర్చును. దేవదేవుడగు శివునితో ఈతనికి మైత్రి ఎట్లు కలిగినది ? (67).

అను వృత్తాంతమును చెప్పెదను. హే వత్సా! నీవు మనస్సును లగ్నము చేసి వినుము (68).

శ్రీ శివ మహాపురాణమునందు రెండవదియగు రుద్ర సంహితలో మొదటిదియగు సృష్టిఖండములో గుణనిధి సద్గతిని పొందుట అనే పదునెనిమిదవ అధ్యాయము ముగిసినది (18).

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment