శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 34
🌹. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 34 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. సిద్ధయ్యకు జ్ఞానోపదేశం చేయడం - 4 🌻
కక్కయ్య అజ్ఞానానికి ఆశ్చర్యపోయారు బ్రహ్మంగారు. తర్వాత "కక్కయ్యా! నేను చెప్పినదేదీ అసత్యం కాదు. నేను అసత్యాలేవి చెప్పను. దానికి ఋజువుగా మరణించిన నీ భార్యను నేను బతికిస్తాను ” అని అభయమిచ్చి అతని వెనుక బయల్దేరారు.
కక్కయ్య ఇంటికి చేరిన తరువాత కక్కయ్య భార్య శరీరంపై మంత్రజలం చల్లారు. ఆశ్చర్యకరంగా ఆమె పునర్జీవితురాలైంది.
ఆ అద్భుతాన్ని చూసి బ్రహ్మానందభరితుడైన కక్కయ్య బ్రహ్మంగారి కాళ్ళమీద పడ్డాడు. “నన్ను క్షమించండి ప్రభూ ! నేను మిమ్ముల్ని తెలుసుకోలేకపోయాను. ఇక ఎప్పటికీ నేను మీ శిష్యుడిగానే వుండిపోతాను” అని ప్రార్థించాడు.
“నా శిష్యులు ఎవ్వరూ నన్ను పూజించకూడదు. వారందరూ ఆ సర్వేర్వరుని కోసం అన్వేషిస్తూ వుండాలి. నువ్వు కూడా అదే విధంగా జీవించు" అని కక్కయ్యను ఆయన ఆదేశించి తిరిగి తన నివాసానికి వెళ్ళిపోయారు.
యధా ప్రకారం వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తన దేశాటనను కొనసాగించారు. గ్రామాల్లో తిరుగుతూ, ప్రజలకు జ్ఞానబోధ చేస్తూ కాలం గడపటం మొదలుపెట్టాడు.
తన మార్గాంతరంలో నంద్యాల చేరుకున్నారు. ఆ దగ్గరలో వున్నఒక గ్రామంలో విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. భోజనం చేసే సమయంలో దాహం వేసి, ఆ ఊరిలో వున్నఒక విశ్వబ్రాహ్మణుని యింటికి వెళ్లి, కొద్దిగా మంచినీరు ఇవ్వమని అడిగారు.
ఆ విశ్వబ్రాహ్మణుడు తన పనిలో నిమగ్నమై వున్నందువల్ల, ఇంటిలో ఎవ్వరూ లేనందువల్ల పక్కనే వున్న బావి వద్దకు వెళ్లి నీరు తాగమని చెప్పాడు. కానీ బ్రహ్మంగారు ఆ మాటలను పట్టించుకొనక మళ్ళీ మంచినీరు ఇవ్వమని అడిగారు. దాంతో ఆ విశ్వబ్రాహ్మణుడు కోపం తెచ్చుకుని కొలిమిలో కరుగుతున్న లోహాన్ని మూసతో సహా తీసుకువచ్చి, బ్రహ్మంగారికి ఇచ్చి దాహం తీర్చుకోమని ఎగతాళి చేశాడు. అతని అహంకారమును పోగొట్టాలని నిర్ణయించుకున్న బ్రహ్నంగారు ఆ మూసను చేతితో పట్టుకుని మంచి నీటి వలె తాగేశారు.
ఇది చూసిన ఆ విశ్వబ్రాహ్మణునికి భయం వేసింది. తర్వాత బ్రహ్మంగారు మామూలు మనిషి కాదని గ్రహించుకుని, ఆయన పాదాలపై పడి, తన తప్పును క్షమించమని ప్రార్థించాడు.
ఒక సందర్భంలో బ్రహ్మంగారు, తన శిష్యుడు కక్కయ్యను ఉద్దేశించి, "నాకు ఎవ్వరి మీదా ఆగ్రహం కలగదు. కేవలం అజ్ఞానం మీద తప్ప! ఆ అజ్ఞానాన్ని తొలగించుకుని సత్యాన్ని తెలుసుకోవడం ద్వారా విజ్ఞానం అంకురిస్తుంది, విచక్షణ పెరుగుతుంది. ఇప్పుడు నేను నీ విషయంలో చేసిందే అదే. కాబట్టి ఇకపై నువ్వు వివేకవంతుడిలా ప్రవర్తించు. జరిగినదాని గురించి మరచిపో " అని జవాబిచ్చాడు.
“నా అజ్ఞానాన్ని తొలగించి, నాకు జ్ఞాన బోధ చేసినందుకు నేను మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎప్పటికీ నేను మీకు శిష్యుడిగానే వుండిపోతాను. మీరు అంగీకరించండి ” అని ప్రార్థించాడు.
అందుకు ఒప్పుకున్నబ్రహ్మంగారు, కక్కయ్యను స్వీకరించి, అతనికి సంతృప్తిని కలిగించారు. ఆయన అక్కడి నుంచి బయలుదేరి కర్నూలు జిల్లాలోని కొన్ని పుణ్యక్షేత్రాలను సందర్శించి, నంద్యాలకు చేరుకున్నారు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment