కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 28
🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 28 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. శ్రేయోమార్గము - ప్రేయోమార్గము - 17 🌻
అజ్ఞానాంధకార రూపమైనటువంటి ప్రేయోమార్గమును అనుసరించేటటు వంటి వారు, తమకు తాత్కాలికముగా అప్పటికప్పుడు ఏది సుఖము కలుగజేయునో, అది మాత్రమే ఆశ్రయిస్తారు. శాశ్వత దుఃఖం ఏర్పడుతుందనేటటువంటి సత్యాన్ని గ్రహించలేరు. గ్రహించలేకపోగా వారిలో అజ్ఞానాంధకారము వలన, అవిద్యాదోషము వలన, మోహప్రభావంవలన, తమను తామే గొప్పగా తలుస్తారు.
అందుకని పెద్దలు ఎవరైనా గానీ వారి యొక్క జ్ఞానబలాన్ని తెలుసుకోవాలి అంటే, వారేం మాట్లాడుతున్నారో, వారిని అనుసరించి కొద్దిసేపు గమనించినట్లయితే తెలిసిపోతుంది.
ఎవరి మాటలలో అయితే ఆత్మస్తుతి, పరనింద ఈ రెండూ వుంటాయో ఇవి అవిద్యకి ప్రధమ ముఖం. అవిద్యా దోషమునకు ప్రధమ ముఖము ఏమిటంటే ఆత్మ స్తుతి, పరనింద. తననుతాను పొగుడుకోవడం. తననుతాను గొప్పగా చేసుకోవడం. తననుతాను అహంభావంతో వ్యక్తీకరించుకోవడం. తనను తాను అభిమానంతో చూచుకొనుట. తనను తాను గొప్పగా చేసి చెప్పుకొనుట.
తన యొక్క విద్వాంస లక్షణాన్ని, తనయొక్క శాస్త్రజ్ఞుడైనటువంటి లక్షణాన్ని, తన ఆజీవన పర్యంతము తాను చేసిన పరిశోధనా ఫలమును తాను గొప్పగా చేసి ఎప్పుడైతే చెప్పుకుంటాడో, పెద్దల యొక్క కృపచేత తాను సాధించినటువాటి వాటినన్నింటిని తానే సాధించినట్లుగా ఎప్పుడైతే చెప్పుకుంటాడో, తనయొక్క కర్తృత్వ భోక్తృత్వ అభిమానమును ఎప్పుడైతే బలపరచుకుంటాడో అప్పుడు ప్రేయోమార్గమైనటువంటి, అజ్ఞానాంధకారమైనటువంటి, అవిద్యారూపమైనటువంటి, బంధకారణమైనటువంటి, మోహరూపమైనటువంటి సంసారమునందు చిక్కుకున్నాడు.
కాబట్టి ఇది ఎటువంటిదయ్యా. చాలామంది అట వీళ్ళనే గురువులుగా భావిస్తారు. ఎవరైతే ఆత్మనిష్ఠులు కారో వారు గురువులు కారు.
ఎవరైతే ఈ అవిద్యాబలముచేత శాస్త్రజ్ఞులుగా, విద్వాంసులుగా, పండితులుగా, కార్మికమైనటువంటి మలముచేత, త్రిగుణమాలిన్యముచేత కర్తవ్యకర్మలని కామ్యక కర్మలుగా అనుష్ఠింపచేస్తూ కామ్యక గురువులుగా, నిషిద్ధగురువులుగా ఉన్నటువంటివారిని ఆశ్రయించినట్లయితే తప్పక మరింత బంధకారణములో చిక్కుకునే అవకాశం ఏర్పడుతుంది. తప్పక మోహం బలపడే అవకాశం ఏర్పడుతుంది. అందువలన ఏమైపోతావూ అంటే ఒక గ్రుడ్డివాడు మరొక గ్రుడ్డివాడిని గురువుగా పెట్టుకున్నాడట.
అప్పుడేమయింది. ఏ రకమైనటువంటి విద్యని పొందగలుగుతావు. ఏ రకమైన జ్ఞానాన్ని పొందగలుగుతావు. ఏ రకమైనటువంటి నిర్ణయాన్ని తెలుసుకోగలుగుతావు అంటే అసాధ్యం. ఎందుకంటే గురువుగారికే ఆత్మానుభవంలేనప్పుడు శిష్యులకి ఆ అత్మానుభూతిని అందించగలిగేటటువంటి శక్తి వుండదు.
ఎప్పటికప్పుడు ఆత్మోపరతి దిశగా నడపవలసినటువంటి గురువుగారు వారిని జగద్ వ్యాపార సహితమైనటువంటి సకామ్య పద్ధతిగా నడుపుతారు. - విద్యా సాగర్ స్వామి
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment