🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 127 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనము : పద్మావతి దేవి
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻. సమర్పణ 🌻
తాను తరింపవలెనని జ్ఞప్తి యున్నవాడెవడును తరింపడు. అతడు గొప్ప సాధకుడు కావచ్చును గాని, తన సాధనకు తానే కేంద్రము.
తాను తరింపవలెనను బుద్ధి స్వలాభబుద్ధియగు స్వార్థమే యగును. దానిని సమర్పణము చేయని వాడెవ్వడు తరింపడు.
సమర్పణ చేయుదమనుకొన్నను అనుకొనుట పోదు కనుక సమర్పణము జరగదు. దేవుని వేషమున తానే తన మనస్సున పగటి వేషగాడై నిలబడి సమర్పించు కొనుటయు, పుచ్చుకొనుటయు చేయును గనుక సమర్పణ జరుగదు.
మహనీయుల మూర్తులను నారాయణుని మూర్తిగా ముచ్చటపడి ధ్యానింపవలెను. వారి సద్గుణముల యందు అభిలాష కలిగి వర్ణింపవలెను. అపుడప్రయత్నముగా సమర్పణ జరుగును.
సమర్పించునట్టి మనస్సు తన యందు మేల్కొని యున్నంతవరకు సమర్పింపదు. మనస్సును మోసగించి అది లేనపుడు సమర్పణ జరుగునట్లు మార్గము తీర్చిదిద్దుకొనవలెనే గాని సమర్పణ సంకల్పము వలన కాదు.
ఈ సమర్పణ జరుగుటకు అంతకు ముందు సమర్పణ జరిగిన వారి సాంగత్యము ఆవశ్యకము. వారి సాంగత్యమున సమకూర్చిన వారిని కూడ నారాయణుని మూర్తులుగా తెలియవలెను.
..... ✍🏼 మాస్టర్ ఇ.కె.🌻
No comments:
Post a Comment