కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 90



🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 90 🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. ఆత్మను తెలుసుకొను విధము -20
🌻

తత్ర సత్త్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయమ్

సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చానఘ

సత్వగుణ విశేషం వర్తిస్తుందని మనకు భగవద్గీతలో స్పష్టంగా చెప్పారు. నిర్మలమైనటువంటి బుద్ధి కలుగుతుంది. ఇతరులతో పోల్చి చూస్తే జ్ఞాన విశేషం కలుగుతుంది. ఎల్లప్పుడూ సుఖముగా ఉండేటువంటి స్థితి, ప్రయత్న రహిత స్థితిగా సత్వగుణంలో ఉన్నప్పుడు, ఎల్లప్పుడూ సుఖంగానే ఉండేటు వంటి స్థితి కలుగుతుంది. అయితే,

రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగసముద్భవమ్

తన్నిబధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినమ్

కర్మబంధము యొక్క తగులుకోవడమనేది రజోగుణ ధర్మం వల్లనే కలుగుతుంది. కాబట్టి, ప్రయత్నించి రజోగుణ ధర్మాన్ని విడవాలి. ప్రయత్నించి చంచలబుద్ధిని విడవాలి. ప్రయత్నించి ఇంద్రియార్థములను నిగ్రహించాలి. ఇంద్రియములను నిగ్రహించాలి. ఇంద్రియములను ఇంద్రియార్థములందు ప్రవేశింపనివ్వకుండుట.

ఏది ఆలోచిస్తే మనకు చంచల లక్షణం పెరిగిపోతుందో, ఆలోచన పరుగుపెడుతుందో, ఆ ఆలోచన ప్రారంభ స్థితిలో ఉండగానే, ఇది నాకు హానికరము అని గుర్తించి విరమించాలి. దానిని అట్లాగే కొనసాగించినట్లయితే నీవు రజోగుణ ధర్మానికి ఊతం ఇచ్చిన వాడవు అవుతావు. అప్పుడు ఏం చేయాలి మరి? ఎట్లా విరమించాలి అనేది ప్రశ్న? అక్కడల్లా దైవ నామ స్మరణ చేయాలి.

ఎప్పుడెప్పుడైతే, నీకు రజోగుణ ధర్మం ప్రారంభమై, నీకు చంచల లక్షణం కలుగుతుందో, మనోవ్యాకులత కలుగుతుందో, మనస్సుకి విక్షేప లక్షణం కలుగుతుందో, అప్పుడప్పుడల్లా నువ్వు ఈశ్వర నామ స్మరణ చేయాలి. భగవన్నామ స్మరణ చేయాలి. పరమాత్మను స్మరించాలి. సద్గురుమూర్తిని స్మరించాలి. జపం చేయాలి. అప్పుడప్పుడల్లా నువ్వు మానసిక జపం చేయాలి. అయితే రోజుకు ఎన్నిసార్లు చేయాలి ఈ మానసిక జపం ఇప్పుడు? ఎప్పుడెప్పుడైతే, మనస్సు రజోగుణ ధర్మానికి లోనైనప్పుడల్లా నువ్వు దానిని విరమింపచేయడానికి మనస్సుకి విరమించడానికి ఒకే ఒక్క సాధనం.... “జపతోనాస్తి పాతకః”

‘పాతకము’ అంటే అర్థం ఏమిటంటే, ఈ రజోగుణ ధర్మాన్ని అనుసరించి జీవించడమే పాతకమంటే! అంటే, ఇతరులు నొచ్చుకునేటట్లుగా చేసేటటువంటి లక్షణం మనలో బలపడుతుంది. ఇతరులను బాధింప చేసేటటువంటి లక్షణం మనలో బలపడుతుంది. తద్వారా మరొక మెట్టు దిగి తమోగుణ ధర్మంలోకి వెళ్ళి తాను కూడా బాధ పడతాడు.

ఈ రజోగుణ ధర్మం రజోగుణ ధర్మంలోనే పూర్తి అవ్వదు అది. అది మరో మెట్టు జారిపోతుంది కాలక్రమంలో. ఎంతో సేపు పట్టదు. ఒక నిమిషం, రెండు నిమిషాలు, ఐదు నిమిషాలలోపలే అది యాక్షన్‌, రియాక్షన్‌ లకు గురై, చర్యా ప్రతి చర్యలకు లోనై, వెంటనే తమోగుణ ధర్మంలోకి మారిపోతుంది.

తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినామ్ !

ప్రమాదాలస్యనిద్రాభిః తన్నిబధ్నాతి భారత !!

ప్రమాదము, ఆలస్యము, నిద్ర, భయము అనేటటువంటి వాటికి లోనయ్యేటట్లుగా చేస్తుంది. వీటిలో ఏదో ఒక ఫలితం వచ్చేస్తుంది తప్పక. తమోగుణంలోకి ప్రవేశించగానే అయితే ప్రమాదమో, లేకపోతే ఆలస్యమో, లేకపోతే నిద్రో, లేకపోతే భయమో ఈ నాల్గింటిలో ఏదో ఒక లక్షణం కలుగుతుంది.

ఈ నాలుగు లక్షణాలలో ఏ లక్షణం కలిగినా వెంటనే మనం గుర్తించాలి. ఓహో! తమోగుణంలోకి జారిపోయాను. అప్పుడు వ్యాకులత ఇంక ఘనిష్టం అయిపోతుంది. బలపడిపోతుంది. ఎంతగా బలపడిపోతుందయ్యా అంటే, ఇహ లేచి కూర్చుని దాన్ని సాధన చేయాలన్నమాట! - విద్యా సాగర్ గారు

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹



Facebook, WhatsApp & Telegram groups, WordPress:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/



31 Oct 2020


No comments:

Post a Comment