స్కందమాత Skandamata



_07.10.24 శ్రీశైలంలో నవదుర్గలలో ఈరోజు 5వ రోజు - స్కందమాత, ఐదవ నవదుర్గ...!!_

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸


స్కందమాత దుర్గా , నవదుర్గల్లో ఐదో అమ్మవారైన స్కంధమాత దుర్గాదేవి అవతారాలలో 5 వ అవతారం. కార్తికేయుని మరో పేరు స్కంధ నుంచి ఈ అమ్మవారి పేరు వచ్చింది.

నవరాత్రులలో ఐదవరోజైన ఆశ్వీయుజ శుద్ధ పంచమి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు.


రూపం

నాలుగు చేతులతో ఉండే ఈ స్కందమాత దుర్గాదేవి సింహవాహనంపై ఉంటుంది. చేతిలో కమలం , జలకలశం , ఘంటా ఉంటాయి.

ఒక చేయి అభయముద్రలో ఉండగా , స్కందుడు (కుమారస్వామి) ఆమె ఒళ్ళో కూర్చుని ఉంటాడు. తెల్లగా ఉంటుంది స్కందమాతా దేవి.



విశిష్టత

ఈ అమ్మవారు మోక్ష , శక్తి , ఐశ్వర్య ప్రదాయినిగా భక్తులు నమ్ముతారు. స్కందమాతాను ఉపాసించేవాడు నిరక్షరాస్యుడైనా జ్ఞానం ప్రాసాదిస్తుందని పురాణోక్తి.

తనను పూజించే భక్తుల కోరికలన్నిటినీ తీర్చే అమ్మవారు ఈమె. నిస్వార్ధ భక్తి చూపేవారికి జీవితంలో ఇహ , పర సుఖాలను ప్రసాదిస్తుంది అని ధ్యానుల విశ్వాసం.

ఈ అమ్మవారిని పూజించేటప్పుడు పూర్తిగా శరీరం , మనస్సు ఆమె మీదే లగ్నం చేయాలి అని దేవీ పురాణం చెబుతుంది.

ఈ అమ్మవారిని పూజించి నప్పుడు , ఆమె ఒడిలో ఉన్న ఆమె కుమారుడు స్కందుడు కూడా భక్తునిచేత పూజింపబడతాడు.

దాంతో ఆ ఇద్దరి ఆశీస్సులూ భక్తునికి వస్తాయని భక్తుల నమ్మకం. ఈ అమ్మవారి ఉపాసకులు దైవ శోభతో ప్రకాశిస్తుంటారట. స్కందమాతా దుర్గా దేవిని పూజిస్తే జీవితం చివర్లో తప్పకుండా మోక్షం లభిస్తుందని పురాణోక్తి. ఈ దేవి అగ్నికి అధిదేవత కూడా.


కథ ..


తన కుమారుడు స్కంద /కార్తికేయ / కుమారస్వామిని ఒడిలో కూర్చోబెట్టుకున్న స్కందమాతా దుర్గాదేవి.

స్కందపురాణంలో కుమారస్వామి ఆవిర్భావం గురించి వివరంగా ఉంటుంది. శివ , పార్వతుల వివాహానంతరం ఎన్నో మన్వంతరాల(కొన్ని కోట్ల సంవత్సరాలు) కాలం సంతోషంగా గడుపుతూ ఉంటారు.

వారిద్దరి శక్తి ఒకటైన తరువాత , వచ్చిన పిండం త్వరగా బిడ్డగా పుట్టాలనే దురుద్దేశ్యంతో ఇంద్రుడు , ఇతర దేవతలు కలసి తారకాసురునికి దొరకకుండా అగ్నిలో దాస్తారు.

ఆ పిండంతో కలసి అగ్ని ఒక గుహలో దాక్కుంటాడు. ఈ లోపు శివ తేజస్సును భరించలేని అగ్ని గంగాదేవికి ఆ పిండాన్ని ఇచ్చేస్తాడు. ఆ తేజస్సును భరించలేని గంగాదేవి ఆ పిండాన్ని రెల్లుపొదల్లో విడిచిపెడుతుంది.

అప్పుడు ఆ పిండాన్ని ఆరు కృత్తికలు పోషించగా కుమారస్వామి జన్మిస్తాడు. ధ్యానం నుంచి బయటకు వచ్చిన పార్వతీదేవి తమ పిండం అగ్ని దగ్గర ఉందని తెలుసుకుంటుంది.

తన తేజస్సును దొంగతనం చేసిన దేవతలకు , ఇక పిల్లలు పుట్టరని శపిస్తుంది అమ్మవారు. తన పిండాన్ని తనలో దాచుకున్న అగ్నిని కూడా ఎప్పుడూ మండతూ ఉండమని , ఇది మంచి , ఇది చెడూ అని లేకుండా అన్నిటినీ మండిస్తూ ఉండమనీ శాపం ఇచ్చింది.

ఇంతలో అక్కడకు వచ్చిన శివుడు ఆమెను శాంతించమనీ , కుమారస్వామి పుట్టిన వైనాన్ని వివరిస్తాడు. కృత్తికలు జన్మనిచ్చినా , ఆ తేజస్సు తనది కాబట్టీ ఆ బిడ్డ తనవాడేనని పార్వతీదేవి కుమారస్వామిని కైలాశానికి తెచ్చుకుంటుంది.

కృత్తికలు పెంచారు కాబట్టీ కార్తికేయుడనీ , రెల్లు పొద (శరవణాలు)లో ఉన్నాడు కాబట్టీ శరవణుడని పేర్లు వచ్చాయి ఆయనకు. అలా లోకమాత అయిన పార్వతీదేవి కుమారస్వామికి తల్లి అవుతుంది.

పెరిగి పెద్దవాడైన కుమారస్వామికి తారకాసురునికి శివ , పార్వతుల బిడ్డనైన తన వల్ల తప్ప మరణం లేదన్న విషయం తెలుసుకుని , అతనిపై యుద్ధం ప్రకటించి , దేవతల సేనకు అధ్యక్షుడై అతణ్ణి సంహరించడానికి సిద్ధమవుతాడు.

ఆ సమయంలో పార్వతీదేవి దుర్గా అవతారం పొంది కుమారస్వామిని దీవిస్తుంది. అలా దేవ సేనకు అధ్యక్షుడై తారకాసుర సంహారం చేస్తాడు కుమారస్వామి. తిరిగి శంభు , నిశంభులతో యుద్ధ సమయంలో ఐదవ రోజున అమ్మవారు స్కందమాతా దుర్గాదేవి అవతారంలో రణరంగానికి వెళ్ళి కొంతమంది అసురులను చంపుతుంది.


ధ్యాన శ్లోకం

"సింహాసనగతా నిత్యం పద్మాశ్రిత కరద్వయా శుభమస్తు సదా దేవి స్కందమాతా యశస్వినీ"..

ఓం శ్రీ స్కందమాత్రే నమః


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸







_7-10-2024 ఇంద్ర కీలాద్రిపై దుర్గమ్మ శ్రీ మహా చండీ దేవిగా దర్శనం....!!_

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


శ్రీ మహా చండీ దేవి దసరా శరన్నవరాత్రి అలంకారం విశేషాలు, అవతార చరిత్ర, ఆలయం & పూజ విధానం...

చండీ దేవి కాళీదేవిని పోలి ఉంటుంది. ఒక్కోసారి ఆమె దయగల రూపంలో మరియు తరచుగా ఉగ్ర రూపంలో దర్శనమిస్తుంది. చండీ దేవిని దయగల రూపంలో ఉన్నప్పుడు ఉమా, గౌరీ, పార్వతి, లేదా హైమవతి, శతాక్షి, శాకంభరీ దేవి, అన్నపూర్ణ, జగన్మాత మరియు భవాని అని పిలుస్తారు.

అలాగే భయంకరమైన రూపంలో ఉన్నప్పుడు ఆమె దుర్గ, కాళి మరియు శ్యామ, చండీ లేదా చండిక, భైరవి, చిన్నమాస్త మొదలైన పేర్లతో పిలువబడుతుంది.

చండీదేవి యొక్క పూజ అశ్వినీ మరియు చైత్ర మాసాల శుక్ల ప్రతిపద నుండి నవరాత్రులలో ఒక ప్రత్యేక వేడుకతో భక్తులు జరుపుకుంటారు. నవరాత్రుల మహోత్సవాలల్లో తల్లి చండీ దేవికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.

ప్రపంచంలోని పురణా దేవాలయాలలో చండీ దేవి ఒకటి. దుర్గా దేవి యొక్క తొమ్మిది రూపాల్లో ఒకటైన చండికా దేవి యొక్క రూపం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

చండీ దేవి ఎలా అవతరించింది.

మన హిందూ పురాణాలు మరియు హిందూ మత విశ్వాసాల ప్రకారం, రాక్షసులు ఇంద్రుడి సింహాసనాన్ని లాక్కునే సమయం వచ్చినప్పుడు, దేవతలు అందరూ ఒకచోట సమావేశమై ఆ పరమ శివుడి వద్దకు వెళ్ళి రాక్షసులు గురించి చెబుతారు.

అప్పుడు పరమ శివుడు మాతృ దేవతను స్తుతించాలని కోరారు. అప్పుడు దేవతలు అందరూ కలిసి మాతృ దేవతను ఆరాధించారు. అప్పుడు మాతృ దేవత అనుగ్రహంతో తల్లి సరస్వతి దేవి, లక్ష్మీదేవి మరియు మహాకాళి దేవి చండీ రూపాన్ని ధరించి రాక్షసులను సంహరిస్తారు.

చండీ దేవి యొక్క ఆలయం నీల్ పర్వత శిఖరంపై ఉంది. రాక్షసులను సంహరించిన తరువాత, తల్లి చండీ దేవి హరిద్వార్ నీల్ పర్వతానికి వచ్చి అక్కడ స్థిరపడింది. హరిద్వార్లో ఉన్నటువంటి మా చండీ దేవి ఆలయం చాలా ప్రత్యేకమైనది.

ఈ దేవాలయం ప్రసిద్ధ శక్తి పీఠాలలో ఒకటి. ఈ ఆలయ విగ్రహాన్ని 8వ శతాబ్దంలో గొప్ప సన్యాసి ఆదిశంకరాచార్య రూపొందించారని అక్కడి ప్రజలు విశ్వాసం.

చండీ దేవిని ఇక్కడి ప్రజలు రెండు రూపాల్లో పూజిస్తారు. నవరాత్రులలో అష్ఠమి మరియు నవమి నాడు చండీ దేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. చండీ దేవి అమ్మవారికి అత్యంత ఇష్టమైన చతుర్థి రోజున శారదియ నవరాత్రి సందర్భంగా ఇక్కడ భక్తులు ఉత్సవం కూడా నిర్వహిస్తారు.

ఈ రోజున చండీ దేవి అమ్మవారి దర్శనం చేసుకోవడం వలన మనసులోని కోరికలు నెరవేరు తాయని ఇక్కడ భక్తుల విశ్వాసం. నవరాత్రులు ప్రారంభం కావడంతో ఆలయంలో 9 రోజుల పాటు పగలు మరియు రాత్రి ప్రత్యేక పూజలు చేస్తారు. అక్కడి ప్రభుత్వం భక్తులకు ప్రత్యేక ప్రసాదం అందజేస్తోంది.

ఉపవాసం ఉన్న భక్తులకు ప్రత్యేక ప్రసాదాన్ని అందజేస్తారు. 1929లో, కాశ్మీర్ రాజు సుచేత్ సింగ్ కోరిక నెరవేరినందుకు అతను ఆ ఆలయాన్ని పునరుద్ధరించాడు అని పురాణాలు చెబుతున్నాయి.


పూజ విధానం

చండీ దేవి పూజ కోసం నవరాత్రి మొదటి రోజున ఒక బ్రాహ్మణుడు ఆవు పేడ మరియు మట్టితో పూత పూసిన ఒక మట్టి కుండను ఆలయం మధ్యలో ఏర్పాటు చేస్తారు. కలశంలో నీటిని తీసుకుని దానిని మామిడి ఆకులతో కప్పి, బియ్యంతో నిండిన మట్టి మూతని కలశం పైన ఉంచి పసుపు గుడ్డతో కప్పుతారు.

అదే కలశంలో బ్రాహ్మణ మంత్రాలు చదివిన తర్వాత ఒకరు కుండల నుండి నీటిని చిలకరించి, అదే కలశంలో అమ్మవారిని ఆవాహన చేస్తారు. పూజ మొదటి రోజు నుండి తొమ్మిది రోజుల ఈ కాలంలో, బ్రాహ్మణుడు కేవలం పండ్లు మరియు మూలాలను మాత్రమే తింటారు.

చండీ దేవి పూజ ఒక యాగంతో ముగుస్తుంది తరువాత హోమం చేయడం మొదలపెడతారు దానిలో బార్లీ, పంచదార, నెయ్యి మరియు నువ్వులను ఉపయోగిస్తారు. ఈ హోమాన్ని కలశం ముందు చేస్తారు.

ఆ కలశం దేవత నివసిస్తుందని భావించబడుతుంది. ప్రతి ఒక భక్తుడు చండీదేవి పట్ల ఐక్యంగా పరిగణించబడతారు.

చండీ మాత పూజ సమయంలో పారాయణం చేయడానికి కొన్ని ప్రసిద్ధ మంత్రాలు ఉన్నాయి.


ఓం ఐం హ్రీం క్లీం చాముణ్ణాయై విచ్ఛే

శ్రీ హ్రీం క్లీం గ్లౌన్ గన్ గణపతయే వర వరద్ సర్వజనం మే

వష్మానాయ స్వాహా

ఓం హ్రీం శ్రీం శ్రీం శ్రీం శ్రీం వరః-ముఖాయ దుః-స్థాన్-శూల్-వేతలాయ

క్రీం శ్రీం స్వాహా

ఐం హ్రీం శ్రీం క్లీం చాముణ్డయై విచ్ఛే..


ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా దుర్గామాత అనుగ్రహం పొంది శక్తిని పొందుతారు. మరియు ఆమె వివిధ పూజలకు ఈ మంత్రాలు వివిధ రూపాల్లో ఉపయోగించ బడతాయి. ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా చండీ దేవి అనుగ్రహం పొంది అన్ని కష్టాల నుండి విముక్తి పొందుతారు...

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿






_నేడు(07.10.24) ఆరోవ రోజు బతుకమ్మ....!!_

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


ఇప్పటికే ఐదురోజుల బతుకమ్మ వేడుకల్లో ఎంగిలిపువ్వు బతుకమ్మ, అటుకల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ వేడుకలు ముగిశాయి.

ఇక ఈరోజు బతుకమ్మ పండుగలో ఆరో రోజును 'అలిగిన బతుకమ్మ' అంటారు. ఈ రోజు అమ్మవారు అలకతో ఉంటారని భక్తులు భావిస్తారు.

అలక తీరాలని బతుకమ్మను ప్రార్థిస్తారు. ఆమెకు ఈ రోజు

ఏ నైవేద్యం ఉండదు.

పూర్వకాలంలో బతుకమ్మను పేర్చే సమయంలో అనుకోకుండా మాంసం ముద్ద తగలడంతో అపచారం జరిగిందని 6వ రోజు బతుకమ్మను ఆడరు.

అప్పటి నుంచి ఈ రోజును 'అలిగిన బతుకమ్మ'గా పిలుస్తారు.

‘రామ రామ రామ ఉయ్యాలో ’ బతుకమ్మ పాట

బతుకమ్మ పాట మీ కోసం..

రామ రామ రామ ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో..

రామ రామ నంది ఉయ్యాలో రాగమేత్తరాదు ఉయ్యాలో..

నెత్తిమీద సూర్యుడా ఉయ్యాలో నేలవన్నేకాడ ఉయ్యాలో..

పాపిటలో చంద్రుడా ఉయ్యాలో బలాకుమరుడా ఉయ్యాలో..


పెద్దలకు వచ్చింది ఉయ్యాలో పెత్తరామాసము ఉయ్యాలో..

బాలలకు వచ్చింది ఉయ్యాలో బతుకమ్మ పండుగ ఉయ్యాలో..

తెల్ల తెల్లయి గుళ్లు ఉయ్యాలో తెల్లయమ్మ గుళ్లు ఉయ్యాలో..

పన్నెండేండ్ల కింద ఉయ్యాలో పాడుబడ్డ గుళ్లు ఉయ్యాలో..


తెల్లయి వేములవాడ ఉయ్యాలో రాజన్న గుళ్లు ఉయ్యాలో..

నల్ల నల్లయి గుళ్లు ఉయ్యాలో నల్లయమ్మ గుళ్లు ఉయ్యాలో..

నల్లయి నల్గొండ ఉయ్యాలో నరసింహ గుళ్లు ఉయ్యాలో..

పచ్చ పచ్చయి గుల్లు ఉయ్యాలో పచ్చయమ్మ గుళ్లు ఉయ్యాలో..


పచ్చయి పరకాన ఉయ్యాలో మల్లన్న గుల్లు ఉయ్యాలో..

పర్వతాల మల్లన ఉయ్యాలో పదములు సెలవయ్య ఉయ్యాలో..

రామ రామ రామ ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో…

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿



No comments:

Post a Comment