కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 1

🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 1 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఉపోద్ఘాతము 🌻

ఉపనిషత్‌ అంటే ఉప+నిషత్‌ గురువుకు సమీపముగా నుండి విచారించుట - అని అర్థము.

ఉపనిషత్‌ విచారణ క్రమంలో ప్రధానం ఏమిటంటే గురువుగారు చెప్పినదానిని చెప్పినట్లుగా ఆచరించటం.

శరణాగతులైనటువంటి శిష్యులకు మాత్రమే ఉపనిషత్‌ విచారణ సాధ్యం. మిగిలినటువంటి వారికి అనుసరణీయులు అయినటువంటి వారికి, ఈ ఉపనిషత్‌ విచారణ పెద్దగా ఫలవంతం కాదు.

కాబట్టి మీలో కూడా ఆ విధమైనటువంటి శరణాగత లక్షణం నూటికి నూరుపాళ్ళు ఉండాలి. అప్పుడు మాత్రమే ఉపనిషత్‌ విచారణ సక్రమంగా సాగుతుంది. సరైనటువంటి సందేహాలు కలుగుతాయి. సరైనటువంటి పరిష్కారాలు సూచించబడుతాయి.

శిష్యుని యొక్క అధికారిత్వం బట్టి ఉపనిషత్ యొక్క ప్రయోజనం. ఈ ప్రయోజనం మాత్రం అన్నింటికి సమానమే. ఏమిటంటే, పరబ్రహ్మ నిర్ణయమే ప్రయోజనం. వేదము యొక్క యథార్థ లక్ష్యము పరబ్రహ్మ నిర్ణయము. జీవుడు, ఆత్మ, బ్రహ్మ, పరబ్రహ్మ - ఈ నాలుగు స్థితులని, కర్మ-భక్తి-యోగ-జ్ఞాన మార్గముల ద్వారా నిర్ణయం చేయడమైనది.

ఈ నాలుగు మార్గముల ద్వారా సుస్పష్టమైనటువంటి విధి విధానాన్ని, జీవనాన్ని అందించినటువంటి గొప్పశాస్త్రం వేదము. ఈ మానవజాతికి ఉత్తమమైనటువంటి ప్రసాదం. ‘వ్యాసోచ్ఛిష్టము’. వేదము అంతా కూడా వ్యాసోచ్ఛిష్టము’ అంటే అర్థం ఏమిటంటే వేదము వ్యాసుని చేత బోధించబడింది.

వేదాంత శ్రవణం అంటే ఏమిటి? వేదాంతం అంటే, వేదముల యొక్క అంత్యమునందు బోధించబడినటువంటి ఉపనిషత్‌ వాక్యములు ఏవైతే ఉన్నాయో, అట్టి ఉపనిషత్తులకే వేదాంతం అని పేరు.

ఈ వేదాంతమైనటువంటి ఉపనిషత్తు వాక్యములందు ప్రధానము తత్వజ్ఞానము .తత్‌, త్వం అని విచారణ ద్వారానే ఈ నడక అంతా సాగుతుంది. ఈ తత్వమసి మహావాక్యోపదేశం క్రమంగా చెప్పబడినటువంటి ఉపనిషత్‌ వాక్య విచారణని ఆశ్రయించి ఎవరైతే ఉపనిషత్తుని అధ్యయనం చేస్తారో, వారికి తప్పక జ్ఞానసిద్ధి కలుగుతుంది.

మృత్యుదేవత అయినటువంటి యమునకు, ఆశ్రయించినటువంటి నచికేతునకు మధ్య జరిగినటువంటి సంవాద రూపమే ఈ కఠోపనిషత్తు.

నచికేతుడు యమధర్మరాజు తనకిచ్చెదనన్న మూడు వరములలో, మూడవ వరముగా మనష్యుడు మరణించిన తర్వాత అతడు ఉండునని కొందరు, ఉండడని కొందరు చెప్పుచున్నారు. ఉన్న ఎడల ఆ తత్త్వమును గురించి చెప్పవలసినదిగా కోరినాడు.

దీనికి సమాధానముగానే అనేక ఉపమానములతో ఈ ఉపనిషత్‌ చెప్పబడినది. యమధర్మరాజు నచికేతుడు అడుగగానే ఆత్మతత్వమును బోధింపక అతనిని ధన కనక వస్తు వాహనాదుల నిచ్చెదనని అనేక ప్రలోభములకు గురిచేసి అతని అర్హతను గుర్తించిన తర్వాతనే ఆత్మను గురించి బోధించెను. వైరాగ్యము మొదలగు అర్హతులున్నవారే బ్రహ్మజ్ఞానమునకు అర్హులని స్పష్టమగుచున్నది.

జీవునిగా ఏ రకమైనటువంటి ప్రలోభాలు ఉంటాయో, ఆ ప్రలోభాలన్నింటినీ నీకు అసలు ఉన్నాయా? లేదా? అని పరీక్షించిన తరువాతనే నీకు ఆత్మవిద్యను ఉపదేశించడం జరుగుతుంది. ఎవరైతే జీవభావంలో ఉన్న ప్రలోభాలకు లొంగనివారు ఉంటారో, వాళ్ళు మాత్రమె ఆత్మవిద్యకు అర్హులు.

అటువంటి ధన, కనక, వస్తు, వాహన, జగత్‌ సంబంధమైనటువంటి, సంసార సంబంధమైనటువంటి, పుత్ర, పౌత్ర, ధన, ధారాదులను అనుగ్రహించగలిగే సమర్థుడైనటువంటి యమదేవత అవన్నీ ఇస్తానంటాడు.

అవన్నీ ఇస్తానంటే, సంతృప్తి చెందిన వాడవైతే, నీవు ఆత్మవిద్యకు పనికిరావు. దీనిని బట్టి సూచన ఏమి తెలుసుకోవాలి? మనలో ఇప్పుడు వింటున్న వారిలో జగత్‌ సంబంధమైనటువంటి కామ్యకర్మల ద్వారా సంతృప్తి, భోగి భోగ్య భావన ద్వారా ఎవరైతే భోక్తగా జీవితాన్ని సాగిస్తూ ఉన్నారో, వీరు ఈ రకమైనటువంటి ఆత్మవిద్యను గ్రహింప జాలరు.

సతి, సుత, ధార, మోహములు ఎవరికైతే బలంగా ఉన్నాయో, ఎవరికైతే ధన కనక వస్తు వాహనాది ప్రాప్తి యందు ఆసక్తి కలిగియున్నారో, వారు ఆత్మవిద్యను గ్రహించడానికి అధికారిత్వము లేనటువంటివారు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment