కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 5

🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 5 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

  నచికేతుడు ఏం చేశాడు? మొదటి వరం అడిగాడు. ఓ వైవస్వతా! నా తండ్రి నన్ను మీ ఇంటికి పంపిన తరువాత నన్ను గురించి చింతించు చుండును. 

కావున నా తండ్రి ఎటువంటి చింతన లేక, ప్రసన్న చిత్తంతో ఉండునటుల అనుగ్రహింపుము. మరియు మీరు నన్ను తిరిగి ఇంటికి పంపినప్పుడు, నా తండ్రి నన్ను బాగుగా గుర్తించి, ప్రేమతో మాట్లాడునట్లు అనుగ్రహింపుము... 

ఎవరైనా మనల్ని వరం కోరుకోమంటే మనం ఏం అడుగుతాం? ముందు నా సంగతి ఏంటో చూడండి బాబూ అంటాం. అంతేనా కాదా? సర్వజీవులు అన్నీ కూడా స్వసుఖం అనేటువంటి దానిచేత ప్రేరేపితమై మాట్లాడుతూ వుంటాయి. 

ఇక్కడ ఓ జ్ఞానీ! అని ఈ నచికేతుడిని ఎందుకు సంబోధించారో ఇప్పుడు ఈ మొదటి వరం అడగడంలోనే మనం తెలుసుకోవాలి. తను నిజానికి తండ్రి చేత బాధించబడి పంపబడ్డాడు. కానీ తండ్రి యొక్క క్షేమాన్ని కాంక్షించాడు మొట్టమొదట. 

తనకు ఆయన గురువుగారు. తండ్రి మాత్రమే కాకుండా తపస్వి, గురువుగారు. ఆయన యొక్క అనుమతి వల్లనే ఆ యమాలయమునకు రాగలిగాడు. 

ఈ సత్యాన్ని గ్రహించినటువంటి నచికేతుడు మొట్టమొదట వరాన్ని ఏ దిశగా కోరాడు? అంటే, తన గురువుగారు సంతోషంగా వుండాలి. అంతే కాకుండా తన యెడల వ్యగ్రత భావాన్ని లేకుండా తనను చూడాలి. 

ఆ వరం కోరే విధానం కూడా ఎలా అడిగాడో చూడండి. ఆయన అభ్యర్థించాడు వరములు కోరుకోమని, ఈయన కోరికలు కూడా ఎంతో వినయశీలియై అభ్యర్థించాడు. ఇది చాలా ముఖ్యం.

            మనం పిల్లల్ని ఏమైనా నీకేమి కావాలో కోరుకోరా అని అడిగేప్పడు కూడా మనలో అహం వ్యక్తమౌతుంది. ఇచ్చేచేయి నాదనేటటువంటి అహం పనిచేస్తుంది. 

అడిగేవాడు కూడా అధికారంతోటి అడుగుతున్నాను. హక్కుగా అడుగుతున్నాను అనుకుంటాడు. కానీ, ఇచ్చేవారిలోనూ వినయశీలత, పుచ్చుకునే వారిలోనూ వినయశీలత ఎప్పుడైతే వుంటుందో ఇద్దరిలోనూ దివ్యత్వం రాణిస్తుంది.

      మీరందరూ ఇంట్లో గృహస్థుగా మీరు సాధారణంగా రోజూ చేసే పని ఏమిటీ అనంటే, అన్నం వండుతారు, మీ భార్య పిల్లలు మీ భర్త గారు అందరూ కలిసి భోజనం చేసే ప్రయత్నం చేస్తారు. 

సాధారణంగా గృహిణి స్థానంలో వున్నటువంటి భార్యగారు అందరికీ ఆహర సేవలను అందిస్తూ, వారికి అన్నీ వడ్డిస్తారన్నమాట! వడ్డించేటప్పడు ఎలా వడ్డించాలి? తినేటప్పుడు ఎలా వుండాలి? ఒక సేవను అందించేటప్పుడు ఎలా అందించాలి? అనేది చాలా ముఖ్యం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ‘ఇచ్చే చేయి నాది’ అనే అహం ఉండకూడదు. ‘చేసేవాడను నేను, నేనే చేస్తున్నాను’ అనే అహంతో చేయకూడదు. 

అలా గనుక చేశావనుకో అప్పుడు ఈశ్వరానుగ్రహానికి దూరం అవుతావు. పొందేవారు కూడా, సేవలను పొందేవారు కూడా ఈశ్వర ప్రసాదంగా ఆ సేవలను పొందాలి. 

కానీ భౌతికమైన, ఐహికమైన, సుఖభోగ ఇంద్రియ లాలసతో ఆ ఇంద్రియ విషయార్థములుగా వాటిని స్వీకరించకూడదు. ఈ రకంగా ఒకరి యెడల మరొకరు మానవ సంబంధాలలో దివ్యత్వాన్ని అనుగమించేటటువంటి ప్రతిక్షేపణ చేసుకోవాలి. 

       ఆ దివ్యత్వాన్ని ఎప్పుడైతే మనం అనుభూతం ఒనర్చుకునేటటువంటి పద్ధతిగా ఈ మానవసంబంధాలని కలిగివుంటావో అప్పుడు ప్రతి చోట మానవుడు దైవీ స్వరూపుడిగా మారిపోతాడు. నువ్వు దైవీభావనలోకి మారిపోతావు. ప్రతి చోట ‘నేను’ అన్న స్థానంలో ఆ ‘ఈశ్వరుడు’ వచ్చి కూర్చొంటాడు. 

ప్రతీ చోట ‘నేను’ అన్న స్థానంలో ‘నేను’ను తొలగించి, ఆ ఈశ్వరుడిని ప్రత్యక్షంగా అందులో ప్రతిపాదించాలన్నమాట. అంతేకాకుండా, ప్రతిక్షేపించాలి. ‘నేను’ అన్న ప్రతీ చోట ‘ఈశ్వరుడు’ని పెట్టడం అభ్యాసం చేయాలి.
🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment