గీతోపనిషత్తు -176


🌹. గీతోపనిషత్తు -176 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚

శ్లోకము 18 - 2

🍀 18. నూతన చిత్తము - 2 - సాధకుడు తనయందేర్పడుచున్న నూతన చిత్తమును కళ్ళెముగ వినియోగించి, స్వాభావిక చిత్తమును అదుపులోనికి తెచ్చుకొనవలెను. అందులకే యమ నియమములను పాటించుట సాధకునికి కీలకము. నూతన చిత్తము బలపడనిదే ఆత్మ సంయమమునకు దారి లేదు. బలపడనపుడు స్వాభావిక చిత్తమే నూతన చిత్తమును దమించును. నూతన చిత్తము బలపడినచో స్వభావమందలి మలినములు నశించి, దైవీ స్వభావము లేర్పడును. గురువను అయస్కాంతము సన్నిధిని శిష్యుడను సాధకుడు తనయందు దైవానుగ్రహముగ కలిగిన నూతన స్ఫూర్తిని బలపరచుకొనగలడు. 🍀

పరుగిడుతున్న గుఱ్ఱములకు కళ్ళెము వేసి, రౌతు అదుపులోనికి తెచ్చునట్లు సాధకుడు తనయందేర్పడుచున్న నూతన చిత్తమును కళ్ళెముగ వినియోగించి, స్వాభావిక చిత్తమును అదుపులోనికి తెచ్చుకొనవలెను. అందులకే యమ నియమములను పాటించుట కూడ. ఈ అభ్యాసము సాధకునికి కీలకము. నూతన చిత్తము బలపడనిదే ఆత్మసంయమమునకు దారి లేదు. బలపడనపుడు స్వాభావిక చిత్తమే నూతన చిత్తమును దమించును.

ఈ సందర్భమును గూర్చియే వేమన యోగి 'ఎలుక తోక తెచ్చి ఏడాది ఉతికిన..... ', 'కనకపు సింహాసనమున శునకమును కూర్చుండబెట్టిన...' అను పద్యములను రచించెను. సాధకుడు యోగి అగుట గాని కాకుండుట గాని దీనిపై ఆధారపడి యున్నది. నూతన చిత్తము బలపడినచో స్వభావమందలి మలినములు నశించి, దైవీ స్వభావము లేర్పడును. గొంగళిపురుగు సీతాకోక చిలుక అయినట్లు మలిన స్వభావము దైవీ స్వభావమై వెలు గొందును. కానిచో, గొంగళి పురుగుగనే జీవించి నశించును.

ఇనుము అయస్కాంతమగుట వంటిదే ఆత్మ సంయమ యోగమునకు జరుగు ప్రక్రియ. అయస్కాంత సన్నిధిని ఇనుము తన స్వభావమును కోల్పోయి అయస్కాంత మగును. అట్లు చాల కాలము అయస్కాంత సన్నిధి నున్నపుడు స్వయముగ అయస్కాంతమై నిలచును. ప్రకృతి యందలి ఈ ధర్మము ననుసరించియే గురు-శిష్య సంప్రదాయ మేర్పడినది.

గురువను అయస్కాంతము సన్నిధిని శిష్యుడను సాధకుడు తనయందు దైవానుగ్రహముగ కలిగిన నూతన స్ఫూర్తిని బలపరచుకొనగలడు. అందులకే భారతీయ సంప్రదాయమున గురుశిష్య సంప్రదాయము అతి ఉత్కృష్టముగ తెలుపబడినది. స్ఫూర్తి గల యోగ సాధకుడు గురు సాన్నిధ్యమును కోరుటలోని ఆంతర్యము తనయందు స్వాభావికమగు మార్పు. ఇది కేవలము సద్గురువు నుండియే లభించును.

సద్గురువు నుండి ఇతర విషయముల నాసించుట అవివేకము. కాని పరిపాటిగ ఇతర విషయములనే ఆశించు చుందురు. నూతన స్ఫూర్తివంతమగు చిత్త మేర్పడుటచే, స్వాభావిక చిత్తము నియమింపబడి, నూతన చిత్తమై నిలచును. అట్టి నూతన చిత్తమునకు మూలము దివ్యస్ఫూర్తి గనుక, ఆ చిత్తము ఆత్మ యందు నిలచుటకే ఉత్సహించును.

అట్టి సమయమునందే ఆత్మ యందు చిత్తము తిష్ఠ వేయుట జరుగును. ఆత్మ యందే చిత్తము తిష్ఠవేసినపుడు ఇతర కోరికలు నిస్పృహ చెందును. వాటిని పోషించు చిత్తము లేకుండుట వలన కోరికలు సాధకుని వీడును.

ఆత్మ యందు రుచి గొన్న చిత్తమునకు లౌకిక అంశములపై రుచి తగ్గును. వాని జోలికి పోరు. వాని యందు ఆసక్తి లేక పోవుట వలన తటస్థముగ నిలచి పోవును. ఇతర విషయములను చేరుట కన్న ఆత్మ విషయము లేక దైవ విషయమునందు చేరుటకు ఉత్సహించును.

“నంబుజోదర దివ్యపాదారవింద చింతనామృత పానవిశేష మత్త చిత్త యేరీతి నితరంబు జేరనేర్చు?”

శ్రీమహా విష్ణువు పాదపద్మములను స్మరించు చిత్తము ఆ పాదముల దర్శన స్పర్శన ఆనంద అమృతము గ్రోలుచు, చిత్తము మత్తెక్కి యుండునుగదా. అట్టి చిత్తమునకు ఇతర విషయములందాసక్తి ఎట్లుండును? పై ప్రశ్న ప్రహ్లాదుడు హిరణ్యకశిపుని అడుగును. సాధకునకు అట్టి చిత్తమే గమ్యము. సాధనయే మార్గము.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


27 Mar 2021

No comments:

Post a Comment