🌹. గీతోపనిషత్తు -214 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 8వ అధ్యాయము - అక్షర పరబ్రహ్మ యోగము 📚
శ్లోకము 5-1
🍀 4-1. సంకల్పము - నిద్ర కుపక్రమించినపుడు తన యందలి ఈశ్వరుని స్మరించుచు, ఆధ్యాత్మ భావమున ప్రవేశించి, బ్రహ్మమును చేరు ప్రయత్నము చేయు సాధకుడు అనునిత్యము బ్రహ్మమును చేరగలడు. ఈ విషయమున ఎట్టి సందేహము లేదు. ఈశ్వరుడే విశ్వాత్మయని, అతనికి మూలము బ్రహ్మమని భావించుచు నిద్రించు వాడు నిద్రావస్థలు చెందక బ్రహ్మము దిశగ ప్రజ్ఞామయ లోకములలోనికి చనును. ఇది నిత్యము చేయవలసిన సాధన. 🍀
అంతకాలే చమామేవ స్మరమ్మక్యా కలేబరమ్ |
యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః || 5
తాత్పర్యము :
అంత్యకాలమందు నన్నే స్మరించుచు శరీరమును విడిచినవాడు నా భావమునే (స్వరూపమును) పొంద గలడు. ఈ విషయమున సందేహము లేదు.
వివరణము :
అంత్యకాల మనగా ప్రజ్ఞకు మరపు కలుగుట. మరపులేని ప్రజ్ఞకు మరణము సంభవించదు. మానవునకు నిద్రా సమయ మంత్యకాలము వంటిదే. మెలకువ ఆరంభకాలము కాగా, నిద్ర అంత్యకాల మగుచున్నది.
నిద్ర కుపక్రమించినపుడు తన యందలి ఈశ్వరుని స్మరించుచు, ఆధ్యాత్మ భావమున ప్రవేశించి, బ్రహ్మమును చేరు ప్రయత్నము చేయు సాధకుడు అనునిత్యము బ్రహ్మమును చేరగలడు. ఈ విషయమున ఎట్టి సందేహము లేదు.
నిద్ర కుపక్రమించినపుడు భావింపవలసినది తనయందలి ఈశ్వరుని. ఆ ఈశ్వరుడే విశ్వాత్మయని, అతనికి మూలము బ్రహ్మమని భావించుచు నిద్రించువాడు నిద్రావస్థలు చెందక బ్రహ్మము దిశగ ప్రజ్ఞామయ లోకములలోనికి చనును. ఇది నిత్యము చేయవలసిన సాధన.
ఇట్టి సాధన చేయువానికి దేహము నుండి విడిపడుట సులభమగును. మృత్యువునుండి విడిపడుట వీలగును. అట్టి వానికి దేహ విసర్జన సమయమున మృత్యువు అనుభూతముకాక సులభముగ దేహమునుండి ముక్తుడగును. "మృత్యోర్ముక్షీయ మామృతాత్" అనునది సత్యమగును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
19 Jun 2021
No comments:
Post a Comment