శ్రీ శివ మహా పురాణము - 414
🌹 . శ్రీ శివ మహా పురాణము - 414🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴
అధ్యాయము - 23
🌻. దేవతలు శివుని దర్శించుట - 4 🌻
విష్ణువు ఇట్లు పలికెను-
పార్వతీ దేవి చేయుచున్న తపస్సు యొక్క పరిస్థితి అంతయూ నాకు తెలియును. నేనిపుడు మీతో గూడి పరమేశ్వరుని వద్దకు వెళ్లుచున్నాను (31). ఓ దేవతలారా! ఆయన లోకకల్యాణము కొరకై ఇప్పుడు పార్వతిని చేబట్టవలయుననియు, ఆమె వద్దకు వెంటనే వెళ్లుడనియు మనము ఆనందముతో ఆయనను ప్రార్థించెదము (32).
పినాక పాణియగు ఆ దేవదేవుడు శివాదేవికి ఇప్పుడే వరమునిచ్చు విధముగా ఆయనను ఒప్పించవలయును. మనమా ప్రయత్నమును ఆచటనే చేయుదము (33). కావున, మహాప్రభుడు, పరమమంగళ స్వరూపుడునగు రుద్రుడు ఉగ్రమగు తపస్సును చేయుచున్న స్థలమునకు ఇప్పుడే మనము వెళ్లెదము (34).
బ్రహ్మ ఇట్లు పలికెను-
విష్ణువు యొక్క ఆ మాటను విని దేవతలు మొదలగు వారందరు, లయకారకుడగు రుద్రుడు హఠాత్తుగా కోపించి దహింప గోరునేమో యని మహా భయమును పొంది, ఇట్లు పలికిరి (35).
దేవతలిట్లు పలికిరి -
మహా భయంకరుడు, క్రోధములో ప్రలయ కాలాగ్నితో సమమగు కాంతి గలవాడు, ముక్కంటి, మహాప్రభుడు అగు రుద్రుని వద్దకు మేము ఎవ్వరమైననూ వెళ్లము (36). పూర్వము ఆయన దుర్జయుడగు మన్మథుని ఎట్లు దహించినాడో, అదే తీరున క్రోధముగలవాడై ఆయన మమ్ములను కూడ దహించివేయును. సందేహము లేదు (37).
బ్రహ్మ ఇట్లు పలికెను-
ఇంద్రుడు మొదలగు వారి ఆ మాటను విని లక్ష్మీపతి ఆ దేవతలనందరినీ ఓదార్చెను. ఓ, మునీ! విష్ణువు అపుడు వారితో నిట్లనెను (38).
విష్ణువు ఇట్లు పలికెను-
ఓ దేవతలారా! మీరందరు నా మాటను ప్రీతితో ఆదరముతో వినుడు. దేవతల భయమును పోగొట్టే ఆ స్వామి మిమ్ములను దహించడు (39)జ కావున మీరు వివేకము గలవారై, శంభుడు శుభుములనిచ్చువాడని యెరింగి నాతో గూడి ఆ మహాప్రభుని శరణు పొందుడు (40). సనాతుడు, పరమ పరుషుడు, అధీశ్వరుడు, శ్రేష్ఠమగు రూపము గలవాడు, తపస్సును చేయుచున్నవాడు, పరమాత్మ సర్వరూపుడు, సర్వోత్కృష్టుడు అగు ఆ శివుని శరణు వేడెదము (41).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
19 Jun 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment