గీతోపనిషత్తు -275
🌹. గీతోపనిషత్తు -275 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚
శ్లోకము 12-2
🍀 12-2. కర్తవ్య కర్మ - భగవద్గీత యందు "ఉపదేక్షంతితే జ్ఞానం", "ఉపదేక్షంతితే అజ్ఞానం" అను ద్వివిధములగు అవగాహన తెలుప బడినది. జ్ఞానము తెలిసినచో అజ్ఞాన మేమో తెలుయును. అట్లే అజ్ఞానమేమో తెలిసినచో జ్ఞానమేమో తెలుయును. మోహము చేతను, ఆశ చేతను వికృతి చెందిన చేతస్సు గలవారై, అజ్ఞానమగు కర్మలు జీవకోట్లు నిర్వర్తించు చున్నారు. కానీ మానవునకు విచక్షణ ప్రధానముగ ఈయబడినది. దానిని వినియోగించుచు కర్తవ్యమునే ఆశ్రయించవలెను. కోరికల నాశ్రయించ రాదు. 🍀
మోఘశా మోఘకర్మాణో మోఘజ్ఞానా విచేతసః |
రాక్షసీ మాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః || 12
తాత్పర్యము : మోహము చేతను, ఆశ చేతను వికృతి చెందిన చేతస్సు గలవారై, అజ్ఞానమగు కర్మలు జీవకోట్లు నిర్వర్తించు చున్నారు.
వివరణము : మానవునకు విచక్షణ ప్రధానముగ ఈయబడినది. దానిని వినియోగించుచు కర్తవ్యమునే ఆశ్రయించవలెను. కోరికల నాశ్రయించ రాదు. ఈ ప్రధానమగు సూత్రము ప్రాథమిక అధ్యాయములలోనే తెలుపబడినది. ఆ సూత్రమును త్యజించినచో కలుగు పతనము కూడ తెలుపబడినది. అదే విషయమును 'గీత' మధ్యమున మరియొక మారు గుర్తుచేయుట జరిగినది. ఈ శ్లోకము భగవద్గీతయందలి నడిమి శ్లోకమై యున్నది. ఏడువందల (700) శ్లోకములతో విరాజిల్లుచున్న భగవద్గీతయందు ఇది (350) మూడువందల యాబదియవ శ్లోకం. విచిత్రమేమనగ జ్ఞానమునకు పరాకాష్ఠగ విరాజిల్లుచున్న భగవద్గీతయందు, ఈ శ్లోకమున అజ్ఞాన స్వరూప స్వభావములు తెలుపబడినవి.
నిజమునకు అజ్ఞానమేమో తెలిసినచో అపుడు జ్ఞానము కూడ తెలుయును. “ఇది చేయరాని పని" అని తెలిసినపుడు దానిని చేయకుండుట వలన కూడ మనిషి చేయవలసిన పనియందే యుండును. అజ్ఞాన స్వరూపము తెలిసినచో ఇక మిగులునది జ్ఞానమే గదా! భగవద్గీత యందే "ఉపదేక్షంతితే జ్ఞానం", "ఉపదేక్షంతితే అజ్ఞానం" అను ద్వివిధములగు అవగాహన తెలుప బడినది. జ్ఞానము తెలిసినచో అజ్ఞాన మేమో తెలుయును. అట్లే అజ్ఞానమేమో తెలిసినచో జ్ఞానమేమో తెలుయును. బియ్యపు గింజల యందు బిడ్డలు కలిసి యుండును. అందు బియ్య మేరుకొన్న బిడ్డలు మిగిలిపోవును. లేదా, బెడ్డ లేరుకొన్నచో బియ్యము మిగులును. అట్లే సృష్టి యందు జ్ఞానా జ్ఞానములు బియ్యము బిడ్డలుగ కలిసి యుండును. అందేది తెలిసినను రెండవది కూడ స్పష్టముగ తెలుయును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
13 Nov 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment