✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. జ్ఞానాన్ని సాధించాలి అంటే రెండే మార్గాలు. యోగము, ఇంద్రియ జయము. 🌻
ఈ రెండింటి ద్వారానే సాధ్యమవుతుంది. కాబట్టి “నాన్యః బంధాయ విద్యతే వాసుదేవాయ ధీమహి”. అటువంటి వాసుదేవుణ్ణి ఆశ్రయించాలి అంటే అన్యమైనటువంటి మార్గం లేదు.
ఏమిటీ? ఒకటి ఇంద్రియజయము. రెండు భక్తి. ఈ రెండింటి ద్వారా జ్ఞానసిద్ధికి అధికారిత్వాన్ని పొందాలి. “భోగములను అనుభవించి తృప్తిని పొందినవారు లేరు” అని కూడా నిర్ణయంగా చెప్తున్నాడు.
అంటే అర్ధ ఏమిటటా? “కారే రాజులు? రాజ్యముల్ గలుగవే? గర్వోన్నతిం బొందరే? వారేరీ సిరిమూటఁగట్టుకొని పోవం జాలిరే?” అనేటటువంటి పద్యాన్ని గనుక, మనం భాగవత పద్యాన్ని గనుక గుర్తిస్తే - “కారే రాజులు? రాజ్యముల్ గలుగవే?” - ఎంతోమంది రాజులు ఈ భూమిని పరిపాలించారు. ఎంతోమంది చక్రవర్తులు పరిపాలించారు. ఎంతోమంది మహనీయులైనటువంటి వాళ్ళు, ఎంతోమంది చరిత్ర కలిగినటువంటి వాళ్ళు,
యశఃకాములైనటువంటి వాళ్ళు ఎంతోమంది పృధ్విలో వచ్చారూ, పోయారు. కానీ వారేమైనా సిరి మూటకట్టుకుపోయారా? వారేమైనా తృప్తిని పొందారా? అంటే వారెటువంటి నిత్యతృప్తిని పొందలేదు. ఒక్క జ్ఞానం వల్ల మాత్రమే, అది కూడా ఆత్మజ్ఞానం వల్ల మాత్రమే నిత్య సంతృప్తతని పొందగలుగుతాడు మానవుడు.
అటువంటి ఆత్మజ్ఞాన సముపార్జనకై జీవితంలో సమయాన్ని, శ్రమని, శ్రద్ధని, ఆసక్తిని, తహని, నిశ్చయాన్ని, లక్ష్యాన్ని మనం సాధించాలి.
అలాంటి మార్గంలో మనం ప్రయాణం చేయాలి అంటే తప్పక భోగమార్గమై వున్నటువంటి జగత్ వ్యాపార విషయములందు అనురక్తి కలిగి వుండరాదు. విరక్తి వుండటం అవసరం కాని అనురక్తి లేకుండా చూసుకోవడం ముఖ్య అవసరం. ఈ రెండింటి మధ్య బేధాన్ని కొద్దిగా మనం గుర్తించాలనమాట.
మానవుడు ప్రతిరోజూ తన శరీర అవసర నిమిత్తమై భోజనం చెయ్యాలా? వద్దా? చెయ్యాలి. అనురక్తి లేక చెయ్యాలి. వైరాగ్య భావంతో చెయ్యాలి. ఈశ్వర ప్రసాద భావంతో చెయ్యాలి. అట్లాంటప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. అలా గనుక ఆచరించకపోయినట్లయితే అది సాధ్యపడదు.
ఇట్లా గమనించుకోవాలన్నమాట. ప్రతిదీ ఈశ్వర ప్రసాదంగా చూసేటటువంటి ఉత్తమ లక్షణాన్ని మానవులందరు కూడానూ చక్కగా సంపాదించాలి. అలా సంపాదించకపోయినట్లయితే నువ్వు ఎంతగా ప్రయత్నించినప్పటికీ కూడా అది అసాధ్యం.
అందుకని అనురక్తి దేంట్లో వుంది, ప్రియాప్రియాలు దేంట్లో వున్నాయి అనేటటువంటి జాబితా సాధకులందరూ తప్పక తయారు చేసుకోవాలి. తయారు చేసుకుని వాటియందున్నటువంటి అనురక్తిని పోగొట్టుకోవాలి. ఇది చాలా ముఖ్యం.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment