కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 6

🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 6 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ

నిద్రాదేవత ఈ మృత్యు దేవత ఆధీనంలో వుంటుంది. నిద్ర పట్టని వారు కొంతమంది వున్నారు. ఊరకూరికే లేచికూర్చొంటుంటారు, ఊరుకూరికే కలత నిద్ర పోతూ వుంటారు. కారణం ఏమిటి? అంటే, మరణభయ సమానమైనటువంటి కలలు వస్తుంటాయి.

ఆ మరణ భయ సమానమైనటువంటి కలలు ఎప్పుడైతే ప్రస్ఫటమైనటువంటి, బలవత్తరమైనటువంటి ప్రభావాన్ని నీ మనోబుద్ధులమీద చూపిస్తాయో, అప్పుడు నీ నిద్ర భంగమై పోతుంది.

కారణమేమంటే, మేల్కొంటే తప్ప ఆ కల యొక్క ప్రభావం పోదు కాబట్టి, పూర్తిగా ఎఱుకను పొందితే తప్ప ఆ కల యొక్క ప్రభావం పోదు కాబట్టి, ఒక్కొక్కప్పుడు పోదు కూడా, మేల్కొన్నా కూడా ఆ కల యొక్క ప్రభావం పోదు. కారణం మరుపు, మరణము, సుషుప్తి, మూర్ఛలు ఈ నాలుగు అవస్థలు ఒకదానికి ఒకటి సంబంధపడి వుంటాయన్నమాట.

కాబట్టే, మనం నిద్రావస్థలో మనం మన ఎఱుకను మనం పూర్తిగా కోల్పోతున్నాము. మరణములో కూడా ‘నేను’ అనే ఎఱుకని కోల్పోతున్నాము.

ఎవరైతే, ఈ నాలుగు అవస్థలలో ‘నేను’ అనే ఎఱుకను నిలబెట్టుకున్నారో, వారు ఆత్మనిష్ఠులు అనేటటువంటి నిర్ణయాన్ని సూచన ప్రాయంగా చెప్తున్నారు.

చాలామంది తామసికమైన అజ్ఞానభూయిష్టమైనటువంటి నిద్ర పోయి, ఆహా! చాలా బాగా నిద్రపట్టిందండీ, ఒళ్ళు మరచిపోయి, ఒడలు మరచిపోయి నిద్రించాను అని ఆనందిస్తూ వుంటారు. ఇదో రకమైన ఆనందము. ఇది తామసిక గరిష్ఠమైనటువంటి నిద్ర. కానీ... ఇది శాంత చిత్తమైన నిద్ర కాదన్నమాట.

ఎవరైతే తన ప్రజ్ఞను తాను గుర్తిస్తూ, తన ఎఱుకను తాను గుర్తిస్తూ, స్వస్థితిని గుర్తిస్తూ, ‘స్వీయ నేను’ ని గుర్తిస్తూ, ‘సెల్ఫ్‌ రియలైజ్‌డ్‌ స్టేటస్‌’ [self realized status] లో ఎవరైతే నిద్రావస్థని ఆచరిస్తారో, వాళ్ళు శాంత చిత్తులై నిద్రిస్తారని అర్థం.

ఎప్పుడైతే ఆ శాంత చిత్తంతో నిద్రించాడో, అతనిలో ప్రజ్ఞ మేల్కొంటుంది. మనమందరం కూడా రోజువారీ నిద్రని ఇలా శాంత చిత్తంతో ఆచరించడం నేర్చుకోవాలి.

నీలో ప్రజ్ఞ మేల్కొన్నవాడవై, స్వప్రకాశ స్థితిలో వుండి, నిద్రలో మనం విశ్రాంతి తీసుకోవడం అభ్యాసం చెయ్యాలి. ఆ రకమైన మెలకువను కలిగి వున్నటువంటి నిద్రగా మనం నిద్రను స్వీకరించాలి. ఆ రకంగా మీరు తురీయంలో ప్రవేశిస్తారన్నమాట!

అటువంటి నిర్వాణానుభవం ద్వారా తాను తురీయస్థితిలోనికి ప్రవేశిస్తాడు. కాబట్టి శాంత చిత్తుడై నిద్రించడం అన్నటువంటి దాంట్లో, సూచన ప్రాయంగా నిర్వాణానుభవ స్థితిని సూచిస్తున్నాడు.

ఎప్పుడైతే ఒకసారి నీకు నిర్వాణ సుఖం లభించిందో, నువ్వు వాటిని మెలకువలోనూ, స్వప్నంలోనూ పోగొట్టుకోవడానికి ఇష్టపడవు ఇక. ఎలాగో చెప్పనా?

ఎవరైనా తమ తలకాయిని ఇవ్వడానికి సిద్ధపడతారా? ఎవరైనా సిద్ధపడుతారా? ఎవ్వరూ సిద్ధపడరు. ఎందుకని? తల లేకపోతే జీవితం లేదు కాబట్టి. అంత ముఖ్యమైనటువంటిది. అట్లాగే, నీ జీవితానుభవాల మొత్తం మీద, అత్యంత విలువైన అనుభూతి ఏదైన ఒకటి ఉందంటే అది నిర్వాణం.

ఒక్కసారి నిర్వాణ సుఖాన్ని అనుభూతి పొందినటువంటివాడు మరలా ఎట్టి కష్ట పరంపర వచ్చినప్పటికీ కూడా, ఎట్టి సుఖదుఃఖ పరంపర ఏర్పడినప్పటికీ కూడా, ఎట్టి ద్వంద్వానుభూతులు ఏర్పడుతున్నప్పటికీ కూడా, ఈ నిర్వాణ సుఖాన్ని పోగొట్టుకోరు.

జాగ్రత్‌ స్వప్న సుషుప్తులలో ప్రయత్న పూర్వకముగా నిర్వాణ సుఖాన్ని నిలబెట్టుకోవాలి. ఇది చాలా ముఖ్యం. అన్ని సాధనలలో కెల్లా ముఖ్య సాధనమిదే!

ఈ శాంత చిత్తం ఎప్పుడైతే వచ్చేస్తుందో, నీలో నిర్వాణ సుఖం ఏర్పడుతుంది. అట్టి నిర్వాణ సుఖమే, ఆత్మసాక్షాత్కార జ్ఞానానికి పునాది. ఆధారభూతమైనటువంటి పునాది స్థితి అన్నమాట!
🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment