. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 18
. సద్గురు శ్రీ విద్యాసాగర్
. ప్రసాద్ భరద్వాజ
. శ్రేయో మార్గము - ప్రేయో మార్గములు స్వధర్మము-పరధర్మము - 6
ఈ రకంగా వస్తు సముదాయ భ్రాంతి ఎందువల్ల ఏర్పడింది అంటే ఆ వస్తువు సుఖాన్ని ఇస్తుంది. ఈ వస్తువు సుఖాన్ని ఇస్తుంది. నా సుఖమునకు ఈ వస్తువు చాలా అవసరం అనేటటువంటి పరుగులాట బాగా బలంగా వుంది.
ఇంకేమున్నదీ అంటే ఆ వస్తు సముదాయాన్ని పొందటానికై ధన సముపార్జన, ధన సేకరణ, ధనమును దాచుకొనుట, ధనమును దోచుకొనుట. ఈ రకంగా క్రమాంతరమున గుణధర్మంలో పతనం చెందుతూ వస్తాడు.
ఎంతగా ధనము దాచుకోవాలని ప్రయత్నిస్తావో, అంతగా ధనమును దోచుకొనాలనేటటువంటి ప్రయత్నం కూడా దాని వెనకనే నీడవలె బలపడిపోతూ వుంటుంది. ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే!
“శరీర మాద్యం ఖలు ధర్మ సాధనం”. అసలు ఈ శరీరమే ఒక వస్త్రము. ఇది ధర్మమార్గంలో నడవడం కోసం, జీవనాన్ని నడపడం కోసం, ధర్మమునకు లక్ష్యమైనటువంటి పరము ఏదైతే వుందో ఆ మోక్ష మార్గంలో ప్రవేశించడంకోసం ఈ శరీరమనేటటువంటి పనిముట్టుని వాడుకోవాలి.
ఐహికమైనటువంటి అంశాలయందు ఎవరికైతే విరమణ వుంటుందో ఎవరికైతే ఉపరతి వుంటుందో ఎవరికైతే తితీక్ష వుంటుందో ఎవరికైతే ఉదాసీనత వుంటుందో వారు మాత్రమే శ్రేయోమార్గమైనటువంటి ఆత్మజ్ఞాన విచారణలో పరమును సాధించేటటువంటి పద్ధతిగా తీవ్ర మోక్షాపేక్షతో తీవ్ర వైరాగ్యంతో అధికారిత్వాన్ని సాధిస్తారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి జీవన విధానం. జ్ఞానమార్గంలో ప్రవేశించాలి అంటే తప్పక ప్రతిఒక్కరూ కూడా తీవ్ర వైరాగ్యనిష్ఠని కలిగివుండాలి.
జ్ఞానమార్గంతో నాకు పనిలేదండి, నాకు కర్మమార్గంతోనే పని అన్నావనుకో ఇహపరములు రెండింటినీ ఒక్కసారే సాధించాలనేటటువంటి భ్రమ భ్రాంతిలో పడతావు.
దేనికి ఎప్పుడు అవకాశం వస్తుందో, దేనికి ఎప్పుడు ప్రాధాన్యత ఇవ్వాలో, దేనిని ఎప్పుడు తగ్గించుకోవాలో, దేనిని ఎప్పుడు ఆశ్రయించాలో - సరియైన జ్ఞానం ఆ కర్మ మార్గంలో వుండదు. ప్రతిచోటా రెండు రెండు మార్గాలని కర్మమార్గం చూపిస్తుంది.
వాటిలో ప్రతిఒక్కరూ తప్పక ఆ ప్రేయోమార్గంలోనే పడిపోతాడు. ఎట్లా అయితే మిడత దీపాన్ని చూసి, శలభము దీపాన్ని చూసి ఆహారమని భ్రమశి, భ్రమశి ఏమి చేస్తుంది? దగ్గరికి వెళ్ళి ఆ మంటమీద పడుతుంది. పడగానే దాని రెక్కలు కాలిపోతాయి. కాలిపోగానే అక్కడే విరిగి పడిపోతుంది. తన జీవితాన్ని ముగిస్తుంది.
మానవుడు కూడా ఇటువంటి విషయసక్తమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ, అట్టి విషయములే సుఖమునిస్తాయనే భ్రాంతికి గురవుతూ అట్టి శలభము వలే మిడతవంటి జీవితాన్ని మానవుడు జీవిస్తున్నాడు.
No comments:
Post a Comment