కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 112


🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 112 🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఆత్మను తెలుసుకొను విధము -42
🌻

పరమాత్మను దర్శింపగోరువారు ముందు వాక్కును అనగా కర్మేంద్రియములను, జ్ఞానేంద్రియములను, విషయములందు పోనీయక, వాటి నుండి మరల్చి, మనస్సునందు చేర్చవలెను.

ఇంద్రియములు గోళకముల ద్వారా బహిర్గతమై, రూపాదులను దహించుచున్నది. అట్లు గోళకముల ద్వారా బయటకు వ్యాపించకుండా, ఇంద్రియములు తమ స్వస్థానములో ఉండునట్లు చూడవలెను. అచట నుండి వాటికి అంతరముగా ఉన్న మనస్సునందు చేర్చవలెను. అప్పుడు మనస్సు కూడా బహిర్ముఖము కాకుండా స్వస్థానంలో ఉండును.

ఆ మనస్సును బుద్ధి యందు చేర్చవలెను. మనస్సు బాహ్యవిషయముల నుండి మరలినప్పుడు బుద్ధికి స్థూల విషయములను నిశ్చయించవలసిన అవసరము లేకపోవుట చేత ఏకాగ్రమై సూక్ష్మవస్తువులను పరిశీలించగలుగును. అట్టి బుద్ధిని తనకు అంతరముగా వున్న మహతత్త్వమునందు చేర్చవలెను. ఆ మహతత్త్వమును ఆత్మయందు చేర్చవలెను. సాంఖ్య విచారణచే సాధకులకు ఈ విధానము చాలా ఉపయోగముగా ఉండును.

ఈ రకముగా క్రమంగా ఎట్లా మరలించాలి? విరమించాలి అనేటువంటి అంశాన్ని ప్రస్తావిస్తు్న్నారు. బోధిస్తున్నారు. అంటే, సాధకులకు మొట్టమొదటిది వాక్‌ సంయమనం. అనగా మనో సంయమనము సాధించాలి, మనో జయాన్ని సాధించాలి అనేటువంటి సాధకులందిరికీ కూడా మొదట్టమొదటిది వాక్‌ సంయమనము.

అనగా అర్థం ఏమిటంటే, ఈ శరీరం అనే కోటకి, రెండు ద్వారములు ఉన్నాయి. ఒకటి ప్రధాన ద్వారము రాజద్వారము జిహ్వేంద్రియము. అట్లానే వెనుక ద్వారము ఉపస్థేంద్రియము. అంటే పునరుత్పత్తి కార్యక్రమములో పాల్గొనేటటువంటి ఉపస్థేంద్రియమేమో వెనుక ద్వారము.

అలాగే జిహ్వేంద్రియము. ఎప్పుడూ రెండు రెండు పనులు చేస్తుంది. రెండు రెండు పనులు చేసేటువంటి ఇంద్రియములు ఇవి రెండే. ఈ రెండింటి మీద అదుపు సంపాదిస్తే, వీటిని కనుక స్వాధీనమొనర్చుకొనగలిగితే, సాధకులకి యాభై శాతము విజయము వచ్చినట్లే!

అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క గోళకం కానీ, ఒక్కొక్క ఇంద్రియము కానీ, ఒక్కొక్క శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ.... తన్మాత్ర గానీ, లేదా సాక్షిగా ఉండవలసిన మనస్సులోనే బలహీనతగానీ లేదా బుద్ధియందే బలహీనతగానీ, వారి వారి యొక్క స్థితిని వారు స్వాధ్యాయం చేయాలన్నమాట! అధ్యయనం చేయాలి. ఎందుకంటే, ప్రతీరోజు తప్పక తమను తాము పరిశీలించుకొనడం అనే పనిని చేపట్టాలి. తనకి ఎక్కడ బలహీనత ఉంది? అనేది తానే గుర్తించాలి.

డాక్టరుగారి వద్దకు వెళ్ళినప్పుడు, ఏమండీ! నాకేమి సమస్య ఉందో మీరే గుర్తించాలి...! అన్నామనుకో? అప్పుడు వైద్యం ఎలా చేస్తాడు? చేయలేడు కదా! నీ సమస్య ఏమిటో, నువ్వు చెబితే తప్ప, దానిని ఆరోగ్యశాస్త్ర రీత్యా పరిశీలించి, ఏమి సలహా ఇవ్వాలో, ఏమి వైద్యం చేయాలో, ఆ విచారణ చేసి దాని ప్రకారం నీకు సహాయపడ గలుగుతాడు.

అట్లానే గురువుకూడా స్వాధ్యయన శీలియైనటువంటి సాధకుడికి మాత్రమే ఉపయోగపడగలుగుతాడు. అంతా మీరే గురువుగారు, అంతా మీరే గురువుగారు అని మనం ఎన్ని సార్లు చెప్పినప్పటికీ, నీ సమస్య ఏమిటో నువ్వు స్పష్టంగా గుర్తు పట్టగలిగేటటువంటి స్థాయికి ఎదిగేటట్లు చేస్తారు మొట్టమొదట.

అందుకనే ప్రతి ఒక్కరిని నాలుగు సంధ్యలలో ఉపాసనా క్రమాన్ని, ధ్యాన విశేషాల్ని, సాధనా బలాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేయమని చెప్పేది. దాని వల్ల ఏమౌతుంది అంటే, ఒక సరైనటువంటి, క్రమమైనటువంటి, క్రమశిక్షణతో కూడినటువంటి, యమనియమాలతో కూడినటువంటి, ఆసనసిద్ధితో కూడినటువంటి, మనస్సుద్ధికారకమైనటువంటి, చిత్తశుద్ధి కారకమైనటువంటి జీవన ప్రయాణాన్ని నువ్వు కనుక చేస్తూవున్నప్పుడు తద్భిన్నమైన, తద్విరుద్ధమైన, తద్వ్యతిరిక్తమైన, ఆలోచనలు గానీ, స్వభావయుత ప్రేరణలు గానీ లేదా అరిషడ్వర్గాల యొక్క ఉత్ప్రేరకమైనటువంటి పరిస్థితులు గానీ, ఏవైనా ఏర్పడుతున్నప్పుడు నువ్వు సూక్ష్మంగా గుర్తించ గలిగేటటువంటి శక్తి నీకు కలుగుతుంది.

కలిగి వాటి నుంచి ఎలా విరమించాలి? అనేటటువంటి ప్రాధాన్యతని నువ్వు లక్ష్యం కొరకు స్వీకరించడం జరుగుతుంది. కాబట్టి, ఏ రకమైనటువంటి యమనియమాదులు లేకుండా కేవలం విషయవ్యావృత్తితోటి, విషయానురక్తులై జీవించేటటువంటి వారు ఈ సాధన బలాన్ని పొందలేరన్నమాట!

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


25 Nov 2020

No comments:

Post a Comment