✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. ఆత్మను తెలుసుకొను విధము - 60 🌻
“నానా ఛిద్ర ఘటోదరస్థిత మహాదేవ ప్రభా భాసురం జ్ఞానం యస్యతు చక్షురాది కరణ ద్వారా బహిః స్పందతే జానామి ఇతి అనుభావ్యతత్ సమస్తం జగత్” అనేటటువంటి గొప్పవిశేష జ్ఞాన బోధ అయినటువంటి, దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఆశ్రయించి, కేవలం తొమ్మిది చిల్లులు కలిగినటువంటి కుండయిది. ఈ కుండలో ప్రకాశిస్తున్నటువంటి దీపం కనుక లేకపోయినట్లయితే కుండ ప్రకాశించదు, చిల్లులు ప్రకాశించవు, తత్ ఫలితమైనటువంటి, ఆ చిల్లుల ద్వారా బయటకు ప్రకాశిస్తున్న ప్రతిఫలించేటటువంటి ప్రతిబింబములు ఏవైతే ఉన్నాయో, అట్టి జగత్తూ ప్రకాశించదు.
కాబట్టి, అనంతమైనటువంటి జగత్తుని తెలుసుకోవాలి, అనుభవించాలి అనేటటువంటి పేరాశ ఒట్టిదే. అత్యాశ. ఇటువంటి మృగయా విశేషం. మృషజల విశేషం, అంటే ఎండమావిలో నీళ్ళు త్రాగాలని పరిగెత్తడం ఎంత అవివేకమో, కుందేటి కొమ్మను సాధించాలనేటటువంటి ప్రయత్నం చేయడం ఎంత అవివేకమో, గగన కుసుమం - ఆకాశ పుష్పాన్ని సాధించాలనేటటువంటి చంద్రుడు ఆకాశంలో పూచిన పువ్వు అని భ్రాంతి చెంది, చేతితో పట్టుకుంటాననడం ఎంత అసమంజసమో, అవివేకమో, అజ్ఞానమో, అవిద్యామోహమో సత్యత్వ జ్ఞానం పొందిన తరువాత మాత్రమే, ఆత్మానుభూతిని పొందిన తరువాత మాత్రమే, అనుభూతమవుతుంది. కాబట్టి, ప్రతీ ఒక్కరూ ప్రయత్నించి, ఇట్టి మానసిక వైక్లబ్యాన్ని పోగొట్టుకోవాలి. ఇట్టి మనో విశేషణాల్ని పోగొట్టుకోవాలి.
ఆహా! ఎంత అందంగా ఉందో? అంటాడు. అందం అంటే అర్థం ఏమిటి? నిర్వచనం లేనటువంటిది అందం అంటే. ఏమిటి? అందం చందం? వస్తుతః వాటికి ఉన్నటువంటి రంగుల కలయిక, వాటికున్నటువంటి వాస్తవికమైనటువంటి చైతన్యం యొక్క ప్రతిబింబము. నిజానికి ఏ రంగూ సత్యము కాదు. నిజానికి ఏ దృశ్యమూ సత్యము కాదు. నిజానికి ఏ రకమైనటువంటి వాసనలు సత్యం కావు. అవన్నీ కూడా ప్రతిబింబ జ్ఞానములు. ప్రతిఫలించుచున్న జ్ఞానములు. జ్ఞానప్రతిబింబాలు అవన్నీ. కాబట్టి అట్టి స్వాత్మ స్వరూపాన్ని ఎఱుగ వలసినటువంటి అవసరం ఉన్నది.
కానీ మానవుడు మనోఫలకంపై ప్రేరితమౌతున్నటువంటి ఈ దృశ్య ప్రతిబింబాలు, రస ప్రతిబింబాలు, రుచికి సంబంధించినటువంటివి లౌల్యత చేత, ఇంద్రియ లౌల్యత చేత, ఆ యా వాక్ సంయమనం లేక, ఇంద్రియ సంయమనం లేక, గుణ సంయమనము లేక, ప్రతిబింబమును అనసరించి పరిగెట్టేటటువంటి మృగయా వినోదము వంటి, అనేకమైనటువంటి బలహీనతలకు లోనై, స్వాత్మ జ్ఞానాన్ని కోల్పోయి, అంధుని వలె, బాంధుని వలె, చెవిటి వాని వలె, గుడ్డివాని వలె, మూగవాని వలె అన్నీ ఉండి తెలుసుకోలేనటువంటి అజ్ఞాని వలె, మానవ దేహాన్ని ధరించినప్పటికి, అందున్నటువంటి స్వాత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేయకుండా, పరిగేట్టేటటువంటి అల్పజ్ఞుడి వల, కించిజ్ఞుడి వలె జీవించడం అసమంజసమైనటువంటి పద్ధతి.
కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పక ప్రయత్న శీలురై మనః సంయమనం చేసి స్వాత్మసాక్షాత్కార జ్ఞానాన్ని పొందాలి. అదే విద్యా ప్రదాయిని. అదే జ్ఞాన ప్రదాయిని. అదే స్వప్రకాశ సాక్షాత్కార జ్ఞానము. అటువంటి స్వరూప జ్ఞానాన్ని, తప్పక పొందాలి. అల్పజ్ఞానులు దీనిని తెలుసుకోలేరు.
జాగ్రత, స్వప్న, సుషుప్తి అవస్థలను అందరూ నిత్యమూ అనుభవించుచున్నారు కదా! జాగ్రదావస్థలో సర్వవ్యవహారములు చేయుచున్నారు. స్వప్నావస్థలో అనేక కలలు కనుచున్నారు. సుషుప్తిలో ఈ రెండు అవస్థలలోని వ్యవహారములు లేక ఏ బాధయు లేక సుఖముగా నిద్రించుచున్నారు. ఈ అవస్థలన్నియూ గుర్తించునది ఆత్మయే.
కాలత్రయము నందు ఉన్నట్టి ఆత్మను గొప్పదానిగను, సర్వవ్యాప్తిగను తెలుసుకొన్న ధీరులు శోకింపరు. జాగ్రదాది అవస్థలు వ్యవహారములు దేహమును అనుసరించి జరుగుచున్నవి. దానిని అనుసరించి దుఃఖము కలుగుచున్నది. వ్యవహార రహితమైన ఆత్మ దేనిని గురించి శోకించును? శోకించదు. అనగా ఆత్మ శోకరహితం. అట్లు తెలుసుకొన్నవారు శోక రహితులు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
13 Dec 2020
No comments:
Post a Comment