కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 162


🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 162 🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. ఆత్మను తెలుసుకొను విధము - 92 🌻


మరి ఇప్పుడు ఈ రకమైన జీవితాన్ని ఏమని చెపుతాము. దీంట్లో నుంచి బయటపడాలంటే ఒకే ఒక మార్గమున్నది. ప్రయత్నించి శుద్ధ బుద్ధిని సంపాదించుట. నన్ను ఏం చేయమంటారండీ? నాయన! శుద్ధ బుద్ధిని సంపాదించు. నన్ను ఉద్యోగం చేయమంటారా? మానేయ మంటారా? ఎవ్వరూ చెప్పరూ.

వేదాంత విద్యా విశారదులు ఈ ప్రపంచంలో ఎవరికీ వ్యవహార శైలియందు ఇలా ఉండు, అలా ఉండు అని చెప్పడానికి ఒక ఆధారం ఉండదు. ఎందుకని అంటే, నువ్వు ఏ వివేకంతో వ్యవహరించావు అన్నదానికే ప్రాధాన్యత. అట్టి వివేకశీలి అయినటువంటి వాడు, సామాన్యమైనటువంటి కర్తృత్వ కర్మాచరణ యందు అసంగముగా ఉన్నాడా లేదా? అనేటటువంటి దానిని గుర్తించాలి.

అట్టి అసంగత్వ లక్షణం నువ్వు కనుక నిలబెట్టుకోపోయినట్లయితే, అట్టి సాక్షిత్వ లక్షణాన్ని నువ్వు నిలబెట్టుకోక పోయినట్లయితే, సదా పుస్తకాల పురుగువలె చదివినప్పటికిని, సదా శాస్త్రములను అభ్యసించినప్పటికి, సదా నీవు వ్యాపార సహితుడవి అగుతున్నావు కానీ, నిర్వృత మానసాన్ని పొందినవాడివి అవ్వడం లేదు.

అట్టి నిర్వృత మానసం లేకుండా, ‘వినివృత్త కామాః’ అని అంటోంది భగవద్గీత. వినివృత్త కామా - వృత్తి, కామములయందు నిః - నివృత్తత. విరమించుట. అనేటటువంటిది విశేషముగా జరగాలి. వాసనలతో సహా లేకుండా పోవాలి. వాటి రసం ఇంకి.. ఇంగువ యొక్క రసం ఇంకి బట్ట ఎలా అయితే ఇంగువ పోయినప్పటికి అదే వాసన వస్తుంది.

చేతితో ఉల్లిపాయపట్టుకుంటే, ఉల్లిపాయ వదిలేసినప్పటికి చేతికి ఉల్లిపాయ వాసన ఎట్లా అంటుతుందో, ఈ రకంగా అనేక పదార్థముల యొక్క రసము మనలో శోషించి, అవే పదార్థముల యొక్క స్ఫురణ కలుగుతూ నానాత్వ భ్రాంతి కలిగిస్తూ, అట్టి నానాత్వ బుద్ధి చేత, మరల జనన మరణములందే తిరుగుతూ ఉంటారు.

కాబట్టి, తప్పక సాధకులందరూ నిరంతరాయంగా సాధన అనగా, ధనము అనగా మార్పు చెందనటువంటిది. ఆ సాధనని ఆ మార్పు చెందనటువంటి స్థితిని సాధించుట కొరకు, పొందుట కొరకు, ఆ లక్షణంతో ఉండుట కొరకు, అట్టి లక్షణమునే నిలబెట్టుకొనుట కొరకు, స్థిరత్వము అంటే, అర్థం అది. జీవితంలో ఎప్పటికి స్థిరపడుతావు నాయనా? అనే ప్రశ్నకి అర్థము, లక్షణము ఏమిటంటే, స్థిరమైనటువంటి స్థితిని నువ్వు ఎప్పుడు గుర్తిస్తే, అప్పుడు స్థిరపడి పోయినట్లే. ఈ రకంగా ఆత్మవస్తువును గుర్తిస్తూ, అనాత్మను నిరసిస్తూ, ఈ ఆత్మానాత్మ వివేకమును సంపాదించాలి.

ఎంతకాలమైతే ఆనాత్మ వస్తూప లబ్దియందు నీ ప్రేరణ, బుద్ధి, ఆకర్షణ కలిగి ఉంటావో, చాలా మంది ఈ రకమైనటువంటి అంశాలను మానవజీవితంలో కలిగిఉన్నారు. ఏదో పుట్టావు, ఏదో పెరిగావు, ఏదో ఒకటి చేయాలి, చేశాను.

చేస్తే ఏదో ఒక ఫలితం రావాలి, వచ్చింది. వచ్చినదానిని ఏదొ నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకున్నాము. నిలబెట్టుకున్న తరువాత దానిని ఏం చేయాలి? నిలబెట్టుకున్న దానిని పది మందిలో ప్రదర్శించాలి. ప్రదర్శించాము. ప్రదర్శించిన తరువాత ఏమైంది? పరువా? ప్రతిష్ఠ వచ్చినాయి. ఆ పరువు ప్రతిష్ఠ పోగొట్టుకోకుండా నిలబెట్టుకోవాలి.

మరలా ప్రయత్నించాలి. ఇలా నిరంతరాయంగా అనాత్మ భ్రాంతితో కూడుకున్నటువంటి, అంశాలయందే చిత్తం లగ్నంమై ఉండడం చేత, జగత్‌ వ్యాపార సహితమైన వాటియందే, చిత్తం లగ్నమై యుండుట చేత, ఎంత మంది నన్ను ఇవాళ పొగిడారు, ఎంతమంది నన్ను ఇవాళ విమర్శించారు అని లెక్కపెట్టుకునే వారు కూడా ఉన్నారు.

ఎంత మంది ఇవాళ నమస్కారం చెప్పారు, ఎంతమంది నమస్కారం చెప్పలేదు? అనేటటుంవంటి అధికార మదాంధత్వమును పొందినటువంటి వారు కూడ ఉన్నారు. మరి ఇవన్నీ ఎటు దారితీస్తున్నాయి అంటే, అజ్ఞానాంధత వైపు దారి తీస్తున్నాయి. - విద్యా సాగర్ గారు

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


14 Jan 2021

No comments:

Post a Comment