🌹 . శ్రీ శివ మహా పురాణము - 378🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴
అధ్యాయము - 13
🌻. పార్వతీ పరమేశ్వర సంవాదము - 1 🌻
భవాని ఇట్లు పలికెను-
ఓ యోగీ! తపశ్శాలివగు నీవు పర్వత రాజుతో నెట్టి మాటలను పలికితివి? హే విభో! నీవు జ్ఞానులలో శ్రేష్ఠుడవు. దానికి సమాధానమును నా నుండి వినుము (1). హే శంభో ! నీవు తపశ్శక్తితో కూడియున్నావు. గొప్ప తపస్సును చేయుచున్నావు. మహాత్ముడవగు నీకు ఇట్టి తపస్సును చేయవలెననే బుద్ధి ఉదయించినది (2). కర్మలన్నియు ఆ శక్తి నుండియే పుట్టుచున్నవని యెరుంగుము. ఆమెయే సృష్టినంతనూ రచించి, పాలించి, నశింపజేయుచున్నది (3). నీవెవరు? సూక్ష్మప్రకృతి ఏది? హే భగవాన్! ఈ విషయములను విమర్శించి తెలుసుకొనుము. ప్రకృతి లేకుండగా మహేశ్వరుడు సగుణ రూపధారి ఎట్లు కాగల్గును? (4) ప్రకృతితో కూడి యుండుట చేతనే నీవు సర్వదా ప్రాణులచే పూజింపబడి, ధ్యానింపబడుచున్నావు. ఈ సత్యమును మనస్సులో నెరింగి, అపుడు నీవు మాటలన్నిటినీ పలుకదగును (5).
బ్రహ్మ ఇట్లు పలికెను-
గొప్ప లీలను ప్రదర్శించుటలో ప్రీతిగల మహేశ్వరుడు ప్రసన్నమగు అంతఃకరణము గలవాడై, పార్వతి యొక్క ఆ మాటను విని చక్కగా నవ్వి ఇట్లు పలికెను (6).
మహేశ్వరుడిట్లు పలికెను-
నేను గొప్ప తపస్సుచే ప్రకృతిని నాశనము చేయుదునా యున్నట్లు చేయుదును. శంభుడనగు నేను ప్రకృతి లేకుండగా ఆత్మస్వరూపుడనై ఉందును (7). కావున సత్పురుషులు ఏ కాలము నందైననూ ప్రకృతిని (స్త్రీని) స్వీకరించరాదు. సత్పురుషులు లోకాచారములను పరత్యజించి వికారము లేనివారై ఉండవలెను (8).
బ్రహ్మ ఇట్లు పలికెను-
వత్సా! శంభుడు లోకపు పోకడనను సరించి ఇట్లు పలుకగా, కాళీదేవి తనలో తాను నవ్వుకొని మధురమగు వచనము నిట్లు పలికెను (9).
కాళీదేవి ఇట్లు పలికెను-
హే శంకరప్రభో! నీవు ప్రకృతిని అతిక్రమించినానని చెప్పితివి. అట్లైనచో, ప్రకృతి స్వరూపురాలగు స్త్రీఏల ఉండరాదు? ఉండకూడదన్నచో, నీవు అతీతుడవని ఎట్లు చెప్పగలము? (10) ఈ విషయమును ఉన్నది ఉన్నట్లుగా తత్త్వ బుద్దితో విచారించి చెప్పవలెను. ఈ సర్వము సర్వకాలములయందు ప్రకృతి చే బంధింపబడి యున్నది (11). నీవు ప్రకృతి లేనిదే మాటలాడలేవు. ఏ పనినీ చేయలేవు. ఈ జగత్తులోని సర్వవచనములు, సర్వక్రియలు ప్రకృతి నుండి పుట్టినవని నీవు నీ మనస్సులో నిశ్చయించుకొనుము (12). నీవు ఏది విన్ననూ, ఏది తిన్ననూ, ఏది చూచిననూ, ఏది చేసిననూ ఆ సర్వము ప్రకృతి నుండియే పుట్టును. ప్రకృతిని గురించి మిథ్యావచనములను పలుకుట వ్యర్థము (13).
నీవు ప్రకృతికి అతీతుడవైనచో, తపస్సును ఏల చేయుచున్నావు? హే శంభో! ప్రభో! నీవు ఇపుడు ఈ హిమవత్పర్వతముపై ఏలనున్నావు? (14). హే హరా! నీవు ప్రకృతినుండి విడి పోయినావు. నీ ఆత్మ స్వరూపమును నీవు తెలియకున్నావు. నీకు నీ ఆత్మ స్వరూపము విదితమే అయినచో, తపస్సునేల చేయుచున్నావు? (15) హే యోగీ! నాకు నీతో వాదులాడుటవలన ఏమి ప్రయోజనము గలదు? వస్తువు ప్రత్యక్షముగా నున్న సందర్భములో అనుమాన ప్రమాణమునకు తావు లేదని పండితులు చెప్పెదరు (16). ప్రాణులు తమ ఇంద్రియములచే ఎంతవరకు తెలుసుకొనగలరో, స్వీకరించగలరో, అది అంతయూ ప్రకృతి నుండియే ఉద్భివించినదని జ్ఞానులు తమ బుద్ధిలో దర్శించవలెను (17).
ఓ యోగి వర్యా! ఇన్నిమాటలేల? నా శ్రేష్ఠమగు వచనమును వినుము. ఆ ప్రకృతి నేనే. నీవు పురుషుడవు. ఇది ముమ్మాటికీ సత్యము (18). నీవు నా అనుగ్రహము చేతనే రూపమును పొంది సగుణుడవైనా వని పెద్దలు చెప్పెదరు. నేను లేనిచో, నీయందు సంకల్పశక్తి ఉండదు. నీవు ఏ పనినీ చేయజాలవు (19). జీతేంద్రియుడవగు నీవు పరాప్రకృతికి అధీనుడవై వివిధ కర్మలననుష్ఠించుచున్నావు. నీవు వికారములు లేనివాడవు ఎట్లు కాగలవు? నా లేపము నీకు లేదనుట ఎట్లు సంభవము? (20) హే శంకరా! నీవు ప్రకృతి కంటె అతీతుడవు అనే నీమాట సత్యమైనచో, నీవు నా సమీపములో భయపడవలసిన పని యేమి? (21)
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
31 Mar 2021
No comments:
Post a Comment