మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 6


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 6 🌹

✍️. మాస్టర్ ఇ. కృష్ణమాచార్యులు
సంకలనము : వేణుమాధవ్

📚. ప్రసాద్ భరద్వాజ


కర్మలను విడిచిపెట్టుట ద్వారా గాక, కర్మల యందు సంగాన్ని విడిచిపెట్టి అంతర్యామికి అర్పితమయిన యజ్ఞార్థ కర్మ చేయడం ద్వారానే యోగసిద్ధి లభిస్తుంది.

అట్లా అని కర్మలలో‌ ఇరుక్కుపోకూడదు.

కర్మ చేయని క్షణముండదు కావున, నిత్యదినచర్య అంతా యోగసాధనే అవుతుంది. మోక్షమనే అంశముపై మనస్సు పెట్టడం కూడా బంధమే అవుతుంది.

కావున ముందు మోక్షమును గూర్చిన అభిప్రాయములు, ఆలోచనలు‌ వదలివేయాలి. "తన" అసలైన అస్తిత్వములో ఎడము లేకుండా, జీవించడమే లక్ష్యముగా దినచర్యను ఏర్పాటుచేసికోవాలి.

ఏకాగ్రత అంటే ఒక దానిపైన మనస్సు కేంద్రీకరించి, మిగిలిన పనులు మానేయమని కాదు. అసలు మనస్సు స్వభావమే అదికాదు.

ధ్యానం పేర పనులు ఎగగొట్టేవాని మనస్సే అనవసరమయిన ఆలోచనలు, రాగద్వేషాలు, ఇతరులను గూర్చి వివిధాభిప్రాయాలతో గజిబిజి అయి, అశాంతిని పెంచుకుంటూ, పంచుతూ ఉంటుంది.

చేతి రుమాలులో ఎట్టి వాసనల వస్తువునుంచితే, ఆ వాసనే రుమాలు కేర్పడుతుంది. అట్లే మనసుకూడ. రుమాలులో కర్పూరముంచి, వెలిగిస్తే, అదే లయిస్తుంది.

ఇలాగే అంతర్యామి స్మరణతో గూడిన పనులలో నిమగ్నమయిన మనస్సు కూడా అంతర్యామితోనిండి, తన అస్తిత్వాన్ని కోల్పోతుంది‌.

కావున ఏకాగ్రత లేక ఏకాంత భక్తి అంటే ఏ పనిలో ఉన్నా ఒకే ఒక అంతర్యామి తత్త్వమునందు‌ నిలుచుటయే.....

🌹 🌹 🌹 🌹 🌹


31 Mar 21

No comments:

Post a Comment