గీతోపనిషత్తు -178


🌹. గీతోపనిషత్తు -178 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚

శ్లోకము 20

🍀 20. అనుగ్రహము - భగవంతుని యందు రమించు బుద్ధి కలుగుట భగవదనుగ్రహముననే జరుగవలెను గాని, పుట్టించు కొనుట సాధ్యము కాదు. దైవ ప్రేరితమైనపుడు మాత్రము దైవము నందు ప్రేమ కలుగును. ఇది సత్యము. దైవము సాధించు విషయము కాదు. అనుగ్రహ వశముచే దానిని పొంద వచ్చును. అనుగ్రహమునకు తీరుతెన్నులు లేవు. అనుగ్రహము కలుగు వరకు యజ్ఞార్థ కర్మలు నిర్వర్తించుట, తనకున్న దానిలో దానములు చేయుట, తన శక్తి మేరకు ఆరాధనలు గావించుట చేయుచు వేచి యుండవలసి యుండును. కమలములు సూర్య కిరణములకై వేచియున్నటులు, ఆలుచిప్ప స్వాతిచినుకుకై వేచియున్నట్లు, వేచి యుండుటయే కర్తవ్యము. 🍀

యత్రోపరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా |
యత్రచైవాత్మనా 2 త్మానం పశ్యన్నాత్మని తుష్యతి || 20


యోగాభ్యాసమున నిబద్ధము చేసిన చిత్తము ఆత్మను దర్శించుచు, ఉపరమించుచు తుష్టి చెందును. ఆత్మ 'నేను' అను దైవముగను, 'నేను' అను జీవుడుగను, 'నేను' అను స్వభావముగను, 'నేను' అను దేహముగను నష్టము చెందియుండును. అనగ సూత్రము నుండి విడిపడిన పూసలవలె విడిపడి బలము లేక పడియుండును.

నేను అను దేహాత్మభావన, నేను అను స్వభావము లేక చిత్తము కూడి నేను అను వెలుగునందు లగ్నము చేయుట ఆత్మసంయమ మగును. నేను అను జీవాహంకారము నేను అను దైవము నందు లగ్నము చేసినపుడు, అది అభ్యాసముగ నిలచినపుడు చిత్తము నేను అను వెలుగు నందు ఉపరతి చెందినచో, ఇతరముల జోలికి పోదు.

నేను, తాను అను వెలుగు నందు ఆసక్తి రతిగ మారవలెను. ఆసక్తి పెంపొందిన కొలది రతి యగును. నేను అను వెలుగు నందు రతి భావము లేక ప్రేమ భావము లేనపుడు ఆత్మ దర్శనమునకు అవకాశము లేదు. నేను అను జీవాహంకారము నేను అను త్రిగుణాతీతమగు వెలుగునందు రతి కలుగుటకు ఉపాయమేమి?

ఆసక్తి, రతి, ప్రేమ ఉన్నచోట అప్రయత్నముగనే చిత్తము లగ్నమగును. అట్టి ప్రేమ కలిగించుకొనవలె నన్నచో కలుగదు. అనుగ్రహము వలననే కలుగును. భగవదనుగ్రహము జీవుని యందున్నపుడు, జీవునికి దైవముపై ఆసక్తి, ప్రేమ కలుగును. ప్రేమ లేనిచోట కలయక లేదు. యోగము లేదు.

ఒకరినొకరు ప్రేమింపని యువతీ యువకులను ఒక చోట చేర్చినను ప్రేమ పుట్టదు. ప్రేమ కలిగినపుడు వారు వేరు వేరు ప్రదేశములలో నున్నను ఒకరినొకరు ప్రేమించుకొనుచు, ఆత్మీయ భావముతో ముడిపడుదురు. ఎన్ని అవరోధములు కలిగినను ఒకరినొకరు చేరుట మానరు.

ఇచ్చట భగవంతుడు ఒక రహస్యమును తెలుపుచున్నాడు. యోగ సేవ వలన అనగ యోగాభ్యాసము వలన చిత్తము నిరోధింప బడినను అట్టి చిత్తమందుగల ప్రజ్ఞ నేనను ఆత్మయందు లగ్నము చేసి ఆత్మయను వెలుగును దర్శించుచు ఉపరమించ వలెనని, అట్లు పరమించునపుడు తుష్టి కలుగునని చెప్పుచున్నాడు.

అట్లు భగవంతుని యందు రమించు బుద్ధి కలుగుట భగవదనుగ్రహముననే జరుగవలెను గాని, పుట్టించుకొనుట సాధ్యము కాదు. బహుమతులు, కానుకలు, ధనము, కీర్తి, సంపద ఇట్లు అడిగిన వన్నియు ఇచ్చినను భగవంతునిపై ప్రీతి కలుగదు. అవి యన్నియు వదలి అడవులకేగినను భగవంతునిపై ప్రీతి కలుగదు. నిజేచ్చనైన దైవమును ప్రేమించలేరు అని భాగవతము తెలుపు
చున్నది. దైవ ప్రేరితమైనపుడు మాత్రము దైవమునందు ప్రేమ కలుగును. ఇది సత్యము.

దైవము సాధించు విషయము కాదు. అనుగ్రహవశముచే దానిని పొందవచ్చును. అనుగ్రహమునకు తీరుతెన్నులు లేవు. అనుగ్రహము కలుగు వరకు యజ్ఞార్థ కర్మలు నిర్వర్తించుట, తనకున్నదానిలో దానములు చేయుట, తన శక్తిమేరకు ఆరాధనలు గావించుట చేయుచు వేచి యుండవలసి యుండును. కమలములు సూర్య కిరణములకై వేచియున్నటులు, ఆలుచిప్ప స్వాతిచినుకుకై వేచియున్నట్లు, వేచి యుండుటయే కర్తవ్యము.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


31 Mar 2021

No comments:

Post a Comment