శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 113, 114 / Sri Lalitha Chaitanya Vijnanam - 113, 114

🌹. శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రము - 61 / Sri Lalitha Sahasra Nama Stotram - 61 🌹
ప్రసాద్ భరద్వాజ




🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 113, 114 / Sri Lalitha Chaitanya Vijnanam - 113, 114 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀. పూర్తి శ్లోకము :

భవానీ, భావనాగమ్యా, భవారణ్య కుఠారికా |

భద్రప్రియా, భద్రమూర్తి, ర్భక్తసౌభాగ్య దాయినీ ‖ 41 ‖


🌻113. 'భావనాగమ్యా'🌻

భావముచే పొందదగినది శ్రీదేవి అని అర్థము.

భజన రూపమున గానీ, స్తోత్రముల రూపమున గానీ, నోములు, వ్రతములు, పూజల రూపమున గానీ, ధ్యాన రూపమున గానీ చేయవలసినది భావనయే. శ్రీదేవి యందు భావన లగ్నము చేయక చేయు పై కార్యము లన్నియు వ్యర్థములు. భావన శ్రీలలితాదేవి యందు నిలచుటకే పూజ, ధ్యానము, స్తోత్రము, భజన మొదలగునవి.

అభ్యాస వశమున పైకార్యములన్నియు యాంత్రికముగ సాగుట వలన గమ్యమును చేర్చవు. భావన శ్రీలలితా దేవి యందు లగ్నమగుట ప్రధానము. భావన లేని భక్తి కార్యములు డంబాచారములే. భావనను నిరంతరము చేయుటకు అనుపానములే ధ్యానము, పూజ, కీర్తన, స్తోత్రము, భజన. చైతన్యమున మనసు లగ్నము కావలెను.

శ్రీదేవి చైతన్య స్వరూపిణి. ఆమె మనలో ఎరుకగ నున్నది. సర్వమును తెలియుటకు ఆ ఎరుకయే ఆధారము. అట్టి ఎరుకయందు మనసు నిలుపుట నిజమగు సాధన. ఇది అనన్యము కావలెనని శ్రీకృష్ణుడు బోధించినాడు. అనన్యమనగా అన్యము లేనిది. తనయందును తన పరిసరము లందును, తనకు గోచరించుచున్న సర్వస్వము పై తెలిపిన చైతన్యము ఆధారముగనే యున్నవని తెలియుట అనన్యము.

అన్నిటియందు చైతన్యమే కూడి యున్నది అని భావించుట వలన, ఆ భావనకు గమ్యముగా చేతన స్వరూపిణి యగు శ్రీలలితా దేవి అనంతమై దర్శన మిచ్చును. ఇది నిజమగు ఉపాసన. ఒక రూపమునకు, ఒక నామమునకు, కాలమునకు, దేశమునకు శ్రీలలితను పరిమితము చేయుట మనలోని పరిమితత్వమునకు తార్కాణము.

అన్యముగా గోచరించునది. ప్రతి వ్యక్తికిని తానుగ గోచరించునది, తన కతీతమై యున్నది. శ్రీదేవి. ఇట్లు మూడు విధములగు భావనలలో ఆమె యున్నది. ఈ మూడు భావనలను సకల, సకల నిష్కళ, నిష్కళ అను మూడు స్థితులలో తెలుపుదురు. బహిరంగ మంతయు సకల, అంతరంగమంతయు సకల నిష్కళ. రెండింటికిని ఆధారము నిష్కళ. మొదటిది స్థూలము. రెండవది సూక్ష్మము.

మూడవది రెండింటికిని ఆధారము. క్రమముగ ఈ మూడు స్థితుల యందు అమ్మను దర్శించుట సాధన. విశ్వము నంతను ఆమె రూపముగ దర్శించుట మొదటి మెట్టు. తనయందు తాను, నేను అను కేంద్రమునకు పుట్టుక స్థానమును అంతరంగమున భావించుట రెండవ మెట్టు. తనయందును, విశ్వమునందును భాసించునది, తనకును, విశ్వమునకును అతీతమై యున్నదని దానియందు తన్మయత్వము చెందుట మూడవ మెట్టు.

ఇట్లు మూడు సోపానములలో భావన మార్గమున అమ్మను చేరవచ్చును.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 113 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj


🌻Bhāvanāgamyā भावनागम्या (113) 🌻

She is to be realized through the mind. Internal worship or mental worship known as meditation is referred here. If this interpretation is correct, then it gives the same meaning as that of nāma 870 antarmuka-samārādhyā. Possibly this nāma refers to ‘Bhāvanā Upanishad’ which describes Her internal worship through Kuṇḍalinī meditation.

In the advanced stages of Śrī Vidyā worship all the external rituals such as navāvarana pūja (Śrī Cakra worship) etc. cease on their own leading the sādaka to internal worship through meditation internal exploration in terms of Bhāvana Upaniṣad. This Upaniṣad emphasizes the union of knower, knowledge and the known.

There is another interpretation for this nāma. It says that meditation is of two types. One is meditating with the help of mantra and another is meditating with the meaning of mantra. For example, one can meditate by reciting Pañcadaśi mantra mentally.

The second type is to understand the meaning of mantra and meditating on the meaning of such mantras. The latter is considered as more powerful. Śrī Vidyā cult attaches a lot of importance to Guru and therefore one has to go by what his/her Guru says.

But the transition from external rituals to internal worship (meditation) is very important, without which She can never be realized. This nāma says that She can be realised only through unstained awareness.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 114 / Sri Lalitha Chaitanya Vijnanam - 114 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀. పూర్తి శ్లోకము :

భవానీ, భావనాగమ్యా, భవారణ్య కుఠారికా |
భద్రప్రియా, భద్రమూర్తి, ర్భక్తసౌభాగ్య దాయినీ ‖ 41 ‖


🌻114. 'భవారణ్య కుఠారికా🌻

జన్మ పరంపరలతో కూడిన సంసారము అను అరణ్యమునకు గొడ్డలిపెట్టు వంటిది శ్రీలలిత. సంసారమనగా సంసరణము చెందుట వలన కరుగు బద్ధత, సంసరణమనగా జారిపోవుట. ఇది మోహము వలన కలుగును. మోహము మమకారమునకు దారితీయును.

మమకారము రాగ ద్వేషములకు దారితీయును. కామక్రోధములను, లోభమోహములను, ఈర్ష్యాసూయలను కలిగించునది మోహము. మోహము మాయ వలన కలుగును. మాయ శ్రీదేవి ప్రక్రియ. ఆమె మాయనుండి పుట్టినవారే సర్వ జీవులు. శ్రీదేవి త్రిగుణముల ద్వారా సమస్త సృష్టి చేయును.

ఒకే చైతన్యమునకు మూడు స్థితులు కల్పించును. అవి మూడు గుణములుగా మారును. అవి ఇచ్ఛ, జ్ఞాన, క్రియా శక్తులు. ఇట్లు ఒకటి మూడగుట ఆమెచేయు మాయ. తెల్లటి సూర్య కిరణము ఏడు రంగులుగా మారుట వంటిది ఈ ప్రక్రియ. నిజమున కున్నది ఒకే చైతన్యము. అది మూడుగ మారుటయే మాయా ఆవిర్భావము.

అందు ఇచ్ఛ సృష్టికి కారణమై నిలుచును. ఇచ్ఛ ఉన్నంతకాలము సృష్టి యుండును. మానవులయందు ఇచ్ఛయే అనేకానేక కోరికలుగ వ్యక్తమగుచుండును. ఇచ్ఛయున్నంత కాలము జన్మల పరంపర యుండును. సృష్టియందు ఏ మోహము లేనివానికి ఏ సంసార ముండదు. అట్టివాడు పరమశివుడని తెలుపుదురు.

అతడు త్రిమూర్తులలో ఒకడైన శివుడైనపుడు అతనికి కూడ మోహము

కలుగునని, జగన్మోహిని అవతారము తెలుపుచున్నది. జ్ఞానులు సహితము శ్రీదేవి మాయామోహితులే. నారదాది మహర్షులు కూడ దేవి మాయను దాటలేని ఉదంతము లున్నవి.

శ్రీదేవి మాయవలననే మోహితులైన జీవులు ఇచ్ఛ ఆధారముగ ఎడతెరిపి లేక జన్మ లెత్తు చుందురు. ఇచ్చట జనన మరణములు అరణ్యముతో పోల్చబడినవి. అరణ్యమున కొన్ని వృక్షములు కూలినను, మరికొన్ని పుట్టుచునే యుండును. పెంచకపోయినను పెరుగునదే అరణ్యము.

కోరికలు కొన్ని తీరగా మరికొన్ని పుట్టుచునే ఉండును. తీరని కోరికలు కారణముగా మరికొన్ని జన్మములు కలుగుచునే యుండును. దీనికి అంతులేదు. సముద్రము నందు అలలకు అంతు లేనట్లు కోరికలకు కూడ అంతులేదు.

కాలమును, దేశమును బట్టి ప్రకృతి ప్రేరణగ మునుపు లేనట్టి కోరికలు కూడ జన్మించ వచ్చును. దీనికి మూలము శ్రీదేవి మాయ. దీనికి అంత మెక్కడ? ఆమె సంకల్పించినచో అంతము చేయగలదు.

ఏ జీవియైనను బ్రహ్మత్వమునకు లేక శివసాయుజ్యమునకు అనుగ్రహింప బడవలెనన్నచో శ్రీదేవి ఆశీర్వచనము ముఖ్యము. ఆమె అనుగ్రహించినచో జన్మపరంపరల అరణ్యమును గొడ్డలితో నరకినట్లు నరకి వేయగలదు.

ఆమె అనుగ్రహమే లేనిచో త్రిమూర్తులతో సహా అందరూ సంసార బంధమున పడగలరు. సంసారమను అరణ్యమునకు కారణము ఆమెయే; పరిష్కారము కూడ ఆమెయే.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 114 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj


🌻 Bhavāraṇya-kuṭhārikā भवारण्य-कुठारिका (114) 🌻

She axes the forest of saṃsāra. Saṃsāra refers to transmigratory existence, which arises because of indulgence in worldly activities such as desire, attachment, love and affection causing bondage.

Saṃsāra is compared to forest. Forest consists of many trees. If one wants to clean a forest he needs to axe each and every tree in the forest. It is not just enough to axe the trees.

He has to remove the roots too; as otherwise, trees will grow from the roots again. Unless every aspect of saṃsāra is removed at the root level, the bondage is bound to rear its ugly head again causing transmigration.

But She does not axe saṃsāra for all. She does it for those who address Her as Bhavānī and for those who follow the Bhāvana Upaniṣhad. It is to be understood that those who mentally worship Her in terms of Bhāvanā Upaniṣhad, alone, address Her as Bhavānī and reap the benefits.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹


27 Nov 2020

No comments:

Post a Comment