✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. ఆత్మను తెలుసుకొను విధము -44 🌻
ఈ రకంగా అనేక రకాలైనటువంటి మానసిక బలహీనతలు కానీ, ఇంద్రియాల స్థాయిలో బలహీనతలు కానీ, గోళకాల స్థాయిలో బలహీనతలు కానీ, అభ్యాసవశము చేత, స్వభావ వశము చేత, వాసనా బలము చేత, సంస్కార బలము చేత, గుణబలము చేత, సూక్ష్మశరీరములో బలహీనతలుగా ఏర్పడిపోతున్నాయి. ఇవన్నీ ఎక్కడ ప్రిసర్వ్ చేయబడుతున్నాయి అంటే? నీ స్థూల శరీరంలో ఎక్కడా ఏమీ ప్రిసర్వ్ చేయబడవు. నీ సూక్ష్మశరీరము ఏదైతే ఉందో దాంట్లో ఈ మాలిన్యమంతా చేరిపోతుంది.
చైతన్యము మీద ఆచ్ఛాదితమైనటువంటి ఈ ముద్రలన్నీ కూడాను ప్రతీ జ్ఞాపకం ఒక ముద్రగా పడుతుంది. ప్రతి స్మృతి బలము కూడా చైతన్యం మీద ఒక ముద్రగా పడుతుంది. నేల మీద నాగలితో గీస్తే, ఎట్లా అయితే గీతలు పడుతాయో, అట్లానే నీ మెదడులో కూడా ప్రతి జ్ఞాపకము కూడా ఒక చిన్న గీత వలె ఏర్పడుతుంది.
దీనికొక ఉదాహరణ: కంప్యూటర్ హార్డ్ డిస్క్ ఉన్నదనుకోండి, ఆ హార్డ్ డిస్కమీద కూడా బైట్స్‌గా [bytes] దాని మెమొరీ [memory] అంతా కూడా రికార్డు అవుతుంది. చిన్నచిన్న గీతలన్నమాట! ఎంత చిన్నగీతలంటే కంటితో చూడడానికి వీలులేనంత. అంత సూక్ష్మమైనటువంటి గీతలుగా ఏర్పడుతుంటాయి. ఏర్పడి అవన్నీ కూడా మనం ఏదైనా అవసరమైనప్పుడు ఆ స్మృతి బలమంతా సమీకరించుకొని, ఆ మెమొరీ అంతా సమీకరించుకొని స్క్రీన్‌మీద ప్రత్యక్షమై కూర్చుంటుంది.
ఏదైనా ఒక విషయం మనకి ఆసక్తమైతే చాలు, ఆ విషయసంబంధ స్మృతులన్నీ కూడా ఒకేసారి మన కంప్యూటర్ బ్రెయిన్ [brain] అనే కంపూటర్ [computer] లో నిక్షిప్తమై ఉన్నటువంటివన్నీ సమీకరించబడి, అవి వెంటనే మనోఫలకం మీదకి వచ్చేస్తుంది. ఆ మనోఫలకము నుంచి ఇంద్రియాలకి, ఇంద్రియాలనుంచి గోళకాలకి, గోళకాల నుంచి బయటకి వచ్చేసి, బాహ్య విషయ సంగత్వ దోషము ఏర్పడిపోతుంది.
ఎవరైనా ఏదైనా సినిమాల గురించి చర్చ ప్రారంభించారనుకోండి, అది ఒక్కటి చాలు. ఇంకా ఎవరికి తోచిన సినిమాలు, ఎవరు చూసిన సినిమాలు, ఎవరు అద్భుతం అనుకొన్నవి, వాటిలో ఉన్న విశేషాలు, వాటిలో ఉన్నటువంటి సంగతులు ఇంకా ఆ చర్చ అలా అలా అలా కొనసాగుతూనే ఉంటుంది.
ఏమైనా దాని వలన ప్రయోజనం ఉందా? అని చర్చ అంతా అయిపోయాక, విశదీకరించి చూస్తే, ఎవరి విషయపరిజ్ఞానాన్ని వారు మరొకరి వద్ద అభిమానయుతంగా, ఔత్సాహికంగా ఉద్గరింపచేసుకొంటూ, ఎక్కువగా చేసుకుంటూ, తానే పరిజ్ఞానశీలియని నిరుపించుకొనే ప్రయత్నం చేసేటటువంటి పనులు ఈ వాక్ సంయమనం లేనప్పుడు జరుగుతుంటుంది.
అదే నిజమైనటువంటి సాధకుడికి తన సినిమా తనలోపలే జరుగుతూ ఉంటుంది. తన సినిమా తన లోపలే రికార్డు అవుతూ ఉంటుంది. ఎప్పటికైనా తన జీవిత లక్ష్యం ఏమిటంటే, ఆ సినిమాని చెరిపేయడమే! ఆ ముద్రలన్నీ చెరిపేయడమే! ఆ స్మృతి బలాన్నంతా చెరిపేయడమే! ఆ జ్ఞాపకాలనన్నింటినీ చెరిపేయడమే!
ఈ పనిలో ఉన్నవాడికి, ఇంకా బయటి సినిమాతో ఏం పని? బయటి వ్యాపకాలతో ఏం పని? బయటి విషయాలతో ఏం పని? బయటి సుఖదుఃఖాలతో ఏం పని? తాను తానుగా ఉండడానికి ఎవరైతే సిద్ధ పడినటువంటి సాధకుడు ఉంటాడో, శిష్యుడు ఉంటాడో, జ్ఞాని ఉంటాడో, వాడికి అతి పెద్ద పని ఏమింటి అంటే, ఈ యోగమే! ఈ జ్ఞాపకాలని చెరిపేయటమనే పని ఏదైతే ఉందో, అది పెద్ద యోగసూత్రము.
మనిషి నిరంతరాయంగా చేయవలసిన పని ఏమిటి? అంటే, ఏ ఏ జ్ఞాపకాలైతే గోళకములు, ఇంద్రియములు శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాత్మకమైనటువంటి తన్మాత్రలు అన్ని ఒకదానితో మనస్సు వలన సంబంధపడి, బుద్ధితో నిశ్చయించబడి, స్మృతి రూపక జ్ఞానముగా, స్మృతి రూపక అభ్యాస బల విశేషముగా, ఏవైతే ఏర్పరచుకున్నాయో, వాటన్నింటినీ తప్పక చెరిపివేసుకోవలసినటువంటి అవసరం ఉన్నది.
కారణం ఏమిటంటే, శరీర త్యాగ సమయములో చైతన్యము చైతన్యమునందు కలిసి పోవలసినటు వంటి, సంయమించ వలసినటువంటి, అవసరము ఉన్నది. ఎవరైతే అట్లా సంయమించగలిగినటువంటి సమర్థతను శరీరములో ఉండగానే సంపాదిస్తారో, వారే జీవన్ముక్తులు. వారే ఆత్మనిష్ఠులు. ఇది ఆత్మనిష్ఠ అంటే. చైతన్యమును చైతన్యమునందే సంయమింప చేయగల సమర్థత కలిగియుండుట.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
27 Nov 2020
No comments:
Post a Comment