కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 148


🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 148 🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. ఆత్మను తెలుసుకొను విధము - 78 🌻


కాబట్టి ధ్యానం అంటే నిద్ర పోయేదో, విశ్రాంతి తీసుకునేదో, ఉపరమించేదో .. అలాంటి శరీర స్థానం నుంచి మనసనేటటువంటి స్థానం మధ్యలో జరిగేటటువంటి ప్రక్రియ కాదు. ఇది నీ లోపల ఙాత అనే సాక్షి, బ్రహ్మాండ సాక్షియైన కూటస్థ స్థితిని పొందే విధానం ఏదైతే ఉందో దానికే ధ్యానం అని, తారకం అనీ పేరు. దానికే తరణమని పేరు. కాబట్టి మధనం చేయాలి. ఎవరైతే ఈ మధనాన్ని చేస్తారో, ఆ మధనం ఆ మానసిక ఆశ్రయం ద్వారా సద్గురు కృపను పొందుతారో వారు మాత్రమే ఈ జ్ఞాత, కూటస్థుడు అభేదము, పరమాత్మ, ప్రత్యగాత్మలు అభిన్నులు అనేటటువంటి సాక్షాత్కార ఙానాన్ని పొందుతారు.

ప్రాణ రూప హిరణ్యగర్భుడున్ను, అగ్ని రూప విరాట్టున్ను పరబ్రహ్మమేయని చెప్పగా, నచికేతుడు, ఓ యమధర్మరాజా! హిరణ్యగర్భ రూపము చేతను, విరాడ్రూపము చేతను ఆ పరబ్రహ్మమును ఏల ఉపదేశించెదవు? సాక్షాత్ పరబ్రహ్మమునే నాకు ఉపదేశింపుమనెను.

అందుకని నచికేతుడు ఏమని అడుగుచున్నాడు, యమధర్మరాజుని?- క్రింది స్థితి, పై స్థితి రెండెందుకు చెప్తున్నావు నాకు? నాకా విరాడ్రూప స్థితి అవసరం లేదు. అంటే అర్ధం ఏమిటి?- నచికేతుడు బ్రహ్మనిష్ఠుడై ఉన్నప్పటికి, సరాసరి పరమాత్మ సాక్షాత్కార ఙానాన్ని అడుగుతున్నాడు. సరాసరి పరమాత్మ స్థితిని తెలిసికోగోరుచున్నాడు, సరాసరి పరబ్రహ్మ సాక్షాత్కార జ్ఞానాన్ని అడుగుచున్నాడు.

ఎందుకనిట? తనకు సాధ్యం అయిపోయిన దాన్ని మరల చెప్పటం ఎందుకు. బ్రహ్మగారు ఏం చేసారట? విరాడ్రూపాన్ని ప్రతిపాదిస్తూ, ఆ విరాడ్రూపానికి లక్ష్యంగా పరమాత్మ స్థితిని, పరబ్రహ్మ స్థితిని చెప్పారు. కాబట్టి నాకా విరాడ్రూప స్థితి అవసరం లేదు.ఎందుకని నేను అయ్యే వచ్చాను.

ఎందుకని నేను తురీయనిష్ఠలో ఊండబట్టే యమధర్మరాజును దర్శించ గలిగేటటువంటి సమర్థనీయుడనై వచ్చాను. కాబట్టి మనకున్నటువంటి మహా కారణ స్థితిని , మహర్షిత్వ స్థితి ఏదైతే ఉందో అది బ్రహ్మఙాన స్థితి. ఆ బ్రహ్మజ్ఞాన స్థితి గురించి తనకు కరతలామలకంగా తెలుసు కాబట్టి, పొందవలసినటువంటి లక్ష్యార్ధం గురించే ప్రశ్నిస్తున్నాడు ఇక్కడ.

వాచ్యార్ధంగా నాకు ఇదంతా తెలుసు. ఏమిటి విశ్వ, తైజస, ప్రాజ్ఞ, ప్రత్యగాత్మలు; విరాట్, హిరణ్యగర్భ, అవ్యాకృత, పరమాత్మలు. అందులో ఈ విరాడ్రూప విశేషమంతా కూడ నాకు తెలిసిందే. కాబట్టి నేను తెలుసుకో గోరుతున్నది ఏమిటంటే పరబ్రహ్మ సాక్షాత్కారమైనట్టి , పరమాత్మ స్థితిని గురించి నాకు ఉపదేశించండి అని వినయంతో యమధర్మరాజును అడుగుతూ ఉన్నాడు.

అంతట యమధర్మరాజు, ఓ నచికేతా! ఆ పరబ్రహ్మము మనోవాక్కులకు అతీతముగా ఉన్నది. రూపము, గుణము గల వానినే శబ్దము బోధించగలుగుచున్నది. రూపరహితమైనటువంటి, గుణ రహితమైనటువంటి పరబ్రహ్మను బోధించుటకు శబ్దము సమర్ధము కాదు. అందుచే విశేషములతో కూడిన హిరణ్యగర్భ, విరాడ్రాది రూపముల ద్వారా, నిర్గుణ పరబ్రహ్మము యొక్క వాస్తవ రూపమును నీవు తెలుసుకొనుమనెను.

ఇట్లా బాబు నచికేతా! నీవు తెలుసుకోవాలి అనుకోంటే మనోవాగతీతమైనటువంటి పరమాత్మను, పరబ్రహ్మమును మనసు ద్వారా వాక్కు ద్వారా తెలుసుకోవటం సాధ్యమయ్యే పనికాదు. కారణం ఏమిటంటే ఈ మనస్సు, వాక్కు శబ్దాన్ని మాత్రమే గ్రహిస్తాయి. శబ్దాతీతమైనటువంటి దాన్ని గ్రహించగలిగే శక్తి వీటికి లేదు. కాబట్టి శబ్దాతీతమైనటువంటి పరబ్రహ్మము, పరమాత్మ “నిశ్శబ్దో బ్రహ్మ ఉచ్యతే“ అనే పద్ధతిగా ఉన్నాయి.

ఎవరైతే “వాంగ్మే మనః ప్రతిష్టతః” - వాక్కును తీసికెళ్ళి, మనఃసంయమనమందు, వాక్కు మనసు సంయమింప చేసినవాడై, అలాగే మనసును తీసికెళ్ళి బుద్ధి యందు, బుద్ధిని మహత్తత్త్వము నందు, మహత్తత్త్వమును అవ్యక్తము నందు, అవ్యక్తమును ప్రత్యగాత్మ యందు సంయమింపచేసేటటువంటి లక్షణం ఎవరికైతే ఉందో,

ఆ రకమైనటువంటి సాధనా క్రమం సాధించేటటువంటి వారెవరైతే ఉన్నారో, ఆ సంయమన విద్య చేత, ఆ అధియజ్ఞం చేత, ఆ ఆంతరిక యజ్ఞం చేత, జ్ఞానయజ్ఞం చేత ఆ రకమైన నిర్ణయానుభూతిని పొందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు మౌనమనేటటువంటి ఆశ్రయం ద్వారా, శబ్దాతీతమైనటువంటి పద్ధతి ద్వారా ఈ పరబ్రహ్మాన్ని తెలుసుకునేటటువంటి అవకాశం ఉన్నది.

బోధించాలి అంటే మరి ఒక మెట్టు దిగి వచ్చి వాగ్రూపంగా, శబ్దాన్ని ఆశ్రయించి బోధించాలి, వ్యాఖ్యానించాలి. అట్లా వ్యాఖ్యానించినపుడు ఒక మెట్టు పరమాత్మ స్థితి నుండి క్రిందకి దిగి పోయి విరాడ్రూపంగా, హిరణ్యగర్భ స్థితినుండే బోధించవలసినటువంటి అగత్యం వస్తుంది. హిరణ్యగర్భ స్థితి దాటిన తరువాత బోధించటానికి అవకాశం ఉండదు.

అవ్యాకృత పరమాత్మలుగా బోధించేటటువంటి అవకాశం లేదు. ఎవరన్నా బోధిస్తున్నారు అన్నా కూడ అది వాచ్యార్ధం తెలియచెప్పటమే కాని, లక్ష్యార్ధం తెలియజెప్పటం కాదు. లక్ష్యార్ధమును మౌనవ్యాఖ్య ద్వారానే అందుకోవలసినటువంటి అవసరం ఉన్నది అనేటటువంటి స్పష్టతను ఇక్కడ అందిస్తున్నారు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


31 Dec 2020

No comments:

Post a Comment