సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము
47. నిశ్చింతా, నిరహంకారా, నిర్మోహా, మోహనాశినీ |
నిర్మమా, మమతాహంత్రీ, నిష్పాపా, పాపనాశినీ ‖ 47 ‖
🌻165. 'మమతాహంత్రీ'🌻
నాది అనుభావమును నశింపజేసి అనుగ్రహించునది శ్రీదేవి అని భావము.
నేను అను భావమున్నప్పుడు నాది అను భావము తప్పదు. నేనెవరు? అను ప్రశ్న తాకిడి జీవులకు కలుగును. ఆ ప్రశ్న కలుగుటయే కాక, అది పరిప్రశ్నయై శోధన ప్రారంభమగుట అనుగ్రహ విశేషము. సంకల్పములకు మూలమైన శ్రీమాత, ఈ సంకల్ప మెవరి కందించునో, అట్టివాడు నేను, తాను అనగానేమో తెలియుటకు ప్రయత్నించును. అది అమ్మ అనుగ్రహము.
అమ్మ అనుగ్రహముననే మరల శోధన, సాధనగా మారి, సాధన సిద్ధించును. అపుడు మమకారము, అహంకారము లేని స్థితి జీవున కందును. అనుగ్రహము కలుగును. ఆరాధనే ఉపాయము. శోధనకు, సాధనకు, సిద్ధికి కూడ శ్రీమాత ఆరాధనే ప్రధానమని ఋషులు నిశ్చయించినారు. అమ్మ అనుగ్రహము లేనిదే, ఇహ పర లోకానుభూతి లేదు కదా! అందువలన మమకారముతో వ్యధ చెందు జీవులకు, “నిర్మమా మమతాహంత్రీ" అనునది నిత్యస్మరణ మంత్రమైనది.
మమకారము పోవలెనన్నచో సాధ్యమా? లేనిది ఉన్నట్లుగా భావించుటచేత మమకార వికారము కలదు. ఎదుటి వస్తువు కాని, జీవి కాని, నాది అనుకొనుట వలన కదా మమకారము! నిజమునకు అది తనదా? ఆ జీవి తనవాడా? అన్నియూ, అందరూ తన సరసన చేరినవారే గాని తనవారు కారు. తాను, ఇతరులు, ఇతరములు అన్నియూ దైవమునకు సంబంధించినవే. అందరూ దైవబంధువులే. ఆత్మ బంధువులే.
ఇతర బంధుత్వములు మోహము, ద్వేషము కలిగించుచుండును. కొందరిపై మోహము వలన మమకారము, కొందరిపై ద్వేషము. కొడుకు పై మమకారము చేత కోడలిపై ద్వేషము లోకసహజము కదా! అట్లే కూతురిపై మమకారము చేత అల్లుడిపై ద్వేషము. ఇటువంటి మాయను ఎవరు దాటగలరు? ఎంత తెలిసిన వారికైనను, ఇసుమంత మమకారముండక పోదు. మోహమను అగాధమున పడుటకు అది చాలును. ఇదియే అమ్మ మాయ.
అందుండి ఉద్ధరించునది కూడ ఆమెయే. మమకారము తీరుటకు అంతయూ, అందరూ దైవమే అని భావించుట, తనకు జరుగుచున్న కర్మానుభవము దైవసంకల్పమే అని సరిపెట్టుకొని తృప్తిపడుట కూడ ఒక ఉపాయము. అందరూ గోవిందునివారే అని భావించుచూ తనవంతు కర్తవ్యము నిర్వర్తించుట నిజమగు వైరాగ్యము. అటుపైన నేనెవరను ప్రశ్న శోధించుట మరియొక ఉపాయము. మమకారమునకు వైరాగ్యము విరుగుడు.
వైరాగ్యమునకు అమ్మ అనుగ్రహము ఆధారము. హరిశ్చంద్రుడు, నలుడు, ధర్మరాజు అమ్మ అనుగ్రహముననే పరిపూర్ణ వైరాగ్యముననుభవించిరి. ఇటీవల కాలమున శ్రీ రామకృష్ణ పరమహంస, అమ్మ అనుగ్రహ విశేషమున పరమహంసగా భౌగోళిక స్ఫూర్తినందించినారు. అమ్మ అనుగ్రహము పొందినవారికి అసాధ్యమగునది ఏమియూ లేదు. మమకారమును ఆమె త్రుటిలో తెంచివేయగలదు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 165 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 Mamatā-hantrī ममता-हन्त्री (165) 🌻
She destroys selfishness of Her devotees. Self interest causes ego, one of the impediments to realization.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
31 Dec 2020
No comments:
Post a Comment