గీతోపనిషత్తు -195
🌹. గీతోపనిషత్తు -195 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚
శ్లోకము 36
🍀 35. స్థిరత్వము - స్థిరచిత్తము లేనివారికి బ్రహ్మముతో యోగము చెందుట అశక్యము. స్వాధీనమైన మనస్సు కలిగి దైవముతో యోగించుటకు ప్రయత్నించు వానికి సాధ్యమగును. దర్శనము అనుభూతి కలుగవలె నన్నచో స్థిర చిత్తము పునాదిరాయి. ప్రతినిత్యము ఒక పనిని అదే సమయమున నిర్వర్తించుట, అంతే శ్రద్ధతో నిర్వర్తించుట, ఆసక్తితో రుచి కలిగి నిర్వర్తించుట వలన అస్థిరత్వము నుండి చిత్తమునకు స్థిరత్వ మేర్పడును. నిరంతరత్వము, దీర్ఘకాలము అను రెండంశము ఆధారముగ నేర్వవలసిన విషయమును నేర్చుట సిద్ధించును. మరియొక మార్గము లేదు. 🍀
అసంయతాత్మనా యోగో దు ప ఇతి మే మతిః |
వశ్యాత్మనా తు యతతా శక్యో వాప్తు ముపాయతః || 36
స్థిరచిత్తము లేనివారికి బ్రహ్మముతో యోగము చెందుట అశక్యము. స్వాధీనమైన మనస్సు కలిగి దైవముతో యోగించుటకు ప్రయత్నించు వానికి నే తెలిపిన ఉపాయము చేత సాధ్యమగును. ఇది నా అభిప్రాయము.
చంచలమైన మనస్సు ఐహిక జీవనమునకు గూడ వినియోగ పడదు. అట్టి మనస్సునకు సామర్థ్యముండదు. ఒక కార్యము పై ఎక్కువ సేపు నిలచి పనిచేయుట కూడ యుండదు. దీక్షతో ఏకాగ్ర మైన మనస్సుతో కార్యములను నిర్వర్తించినపుడు కార్యసిద్ధి కవకాశము మెండుగ నుండును. చిందులు వేయు మనస్సునకు ఎట్టి అవకాశము ఉండదు. చిందులు వేయు మనసును అనాదిగ మర్కటముతో పోల్చుదురు.
మర్కట మనగ కోతి. కోతి ఒక చెట్టుపై నిలకడగ ఉండదు. ఒక కొమ్మపై అసలుండదు. ఏ పండును పూర్తిగ భుజించదు. తోటలో సమృద్ధిగ పండ్లున్నపుడు అన్ని పండ్లను ఎంగిలి చేయుటయేగాని, సమగ్రముగ భుజింపదు. ఒక పండు తినుచు మరొక పండును చూచును. అపుడున్న పండును విసర్జించి మరియొక పండునకై గెంతును.
ఇట్లే సామాన్య మానవులు కూడ గమ్యమున నడవక ప్రక్కదారులను పట్టి పోవుచుందురు. అట్టి వారు కార్యములను చక్కబెట్టలేరు. బాధ్యతలను సమగ్రముగ నిర్వర్తించలేరు. ఒక పాఠ్యాంశమును కూడ పరిపూర్ణముగ పఠించ లేరు. ఒక పని చేయుచున్నపుడు మరియొక పని గుర్తు వచ్చు చుండును.
ఉదాహరణకు భోజనము చేయునపుడు వృత్తిపరమైన భావములు స్ఫురించుట, తత్కారణముగ భోజనమును అనుభూతి చెందలేరు. అట్లే వృత్తి యందున్నపుడు మరియొక అంశము పైకి మనస్సు గెంతును. అందువలన వృత్తి నిర్వహణము జరుగును. నిదురించుచున్నపుడు తాను చేయవలసిన పనులు, మరచిన పనులు జ్ఞప్తికి వచ్చి నిదుర పట్టదు. ఏ పనియందైనను ఏకాగ్రత ఉండకుండుట వలన పని చెడి, ఎక్కువ పని ఏర్పడును. పనులు జరుగుట మానును.
దానితో అసహనత, కోపము పెరుగును. ఇట్లు మనస్సు పెట్టు తిప్పలు, త్రిప్పటల వలన అలసిపోవుటయే యుండును. జీవచైతన్యము ఒక ప్రవాహముగ సాగదు. ఇట్లు ఎంతైనను సామాన్య మానవుని మనస్సు గూర్చి విశ్లేషించవచ్చును. ఆరాట పడుటయే గాని, తగు విధమగు ఆచరణముండక పోవుటచే, స్థిరము లేక సూత్రము తెగిన గాలిపటమువలె జీవితము గాలి వాటున సాగుచుండును. ఇట్లు వృత్తములలో గిరగిర తిరుగు చిత్తమును నిగ్రహించుట గాలిపటమునకు సూత్రము కట్టుట వంటిది. ఎద్దు ముక్కునకు త్రాడు వేయుట వంటిది. గుఱ్ఱమునకు కళ్ళెము కట్టుట వంటిది. అపుడే ప్రయాణము సాగును.
జీవన ప్రయోజనము నెరవేరును. ఇది నిస్సంశయము. కళ్ళెము లేని గుజ్జముపై ప్రయాణము గమ్యమునకు చేర్చదు. ముక్కుకు త్రాడు వేయని ఎద్దుతో పొలము దున్నలేము. అట్లు మనస్సును అంతరంగమునుండి పట్టనిచో అది పలు విధముల పరుగెట్టు చుండును. అంతరంగమందు సుందర తేజోరూపమునో, జ్యోతినో లేక స్పందనాత్మక చర్యనో పట్టుట వలన క్రమముగ స్థిరమగు మనసు ఏర్పడును.
అట్టి స్థిరమనస్సు అంతర్ముఖముగ అంతరంగమున దర్శించినచో ఆసక్తికరము, రుచికరము అగు బుద్ధి ఆవరణము గోచరించును. అందు ప్రవేశించిన వానికి బుద్ధియను వెలుగునకు మూలమగు దానియందు ఆసక్తి కలుగును. ఇట్లు అంతరంగమును శోధించుచు తన మూలమును చేరుట వలన యోగము పరిపూర్ణ మగును. పరమాత్మ, జీవాత్మ, బుద్ధి, స్థిరచిత్తము ఒకే సూత్రముగ, తేజోమయముగ గోచరించును.
పై విధమగు దర్శనము అనుభూతి కలుగవలె నన్నచో స్థిర చిత్తము పునాదిరాయి. స్థిరచిత్త మేర్పడుటకే అనేకమగు ప్రాథమిక దీక్ష లున్నవి. ప్రతినిత్యము ఒక పనిని అదే సమయమున నిర్వర్తించుట, అంతే శ్రద్ధతో నిర్వర్తించుట, ఆసక్తితో రుచి కలిగి నిర్వర్తించుట వలన అస్థిరత్వము నుండి చిత్తమునకు స్థిరత్వ మేర్పడును. అట్లేర్పడుటకు చాలకాలమట్లే నిర్వర్తించవలెను. నిరంతరత్వము, దీర్ఘకాలము అను రెండంశము ఆధారముగ నేర్వవలసిన విషయమును నేర్చుట సిద్ధించును. మరియొక మార్గము లేదు.
భగవంతుడు శ్రీ కృష్ణుడు ఈ శ్లోకమున "స్థిరచిత్తము లేనిచో యోగము లేదు. ఇది నా మతము" అని పలికినాడు. కేవలము ఇది తన అభిప్రాయమని తెలిపినను మరియొక మార్గము లేదని తెలియవలెను. అభ్యాసము చేతను, వైరాగ్యము చేతను స్థిరచిత్త మేర్పరచుకొన వచ్చును. అపుడే యోగమున కర్హత కలుగును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
10 May 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment