రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴
అధ్యాయము - 19
🌻. కామదహనము - 1 🌻
నారదుడిట్లు పలికెను-
ఓ బ్రహ్మా! విధీ! మహాత్మా! తరువాత ఏమైనది? నీవు అనుగ్రహించి పాపములను నశింపజేయు ఆ గాథను చెప్పుము (1).
బ్రహ్మ ఇట్లు పలికెను-
ఆ తరువాత జరిగిన గాథను వినుము. వత్సా! ఆనందమును గొల్పు శివలీలను నీయందలి ప్రేమచే చెప్పగలను (2). మహాయోగియగు మహేశ్వరుడు తాను ధైర్యమును గోల్పోవుటను గాంచి మిక్కిలి చకితుడై, తరువాత మనస్సులో ఇట్లు తలపోసెను (3).
ఉత్తమమగు తపస్సును చేయుచున్న నాకు విఘ్నములు కలుగుటకు కారణమేమి? ఈ సమయములో నా మనస్సులో వికారమును కలిగించిన దుష్టుడెవరు? (4) నేను పరస్త్రీని ఉద్దేశించి చెడు వర్ణనను చేసితిని. ఇపుడు ధర్మమునకు విరుద్దముగా జరిగినది. వేదమర్యాద ఉల్లంఘింపబడినది (5).
బ్రహ్మ ఇట్లు పలికెను -
సత్పురుషులకు ఆశ్రయము, మహాయోగి అగు పరమేశ్వరుడు ఇట్లు తలపోసి, శంకను పొందినవాడై చుట్టూ దిక్కులనన్నింటినీ పరికించెను (6) . గర్విష్ఠి, మూర్ఖుడు, బాణమును ధనస్సునందు ఎక్కుపెట్టి ప్రయోగించుటకు సిద్దముగా నున్నవాడు అగు మన్మథుని ఆయన తన ఎడమవైపున ఉండగా గాంచెను (7). ఓ నారదా! పరమాత్ముడగు శివునకు ఆ స్థితిలో నున్న కాముని చూడగానే వెనువెంటనే తీవ్రమగు క్రోధము కలిగెను (8). ఓ మహర్షీ! బాణము ఎక్కుపెట్టియున్న ధనస్సును చేతబట్టి అన్తరిక్షమునందు నిలబడియున్న మన్మథుడు నివారింప శక్యము కానిది, వ్యర్థము కానిది అగు అస్త్రమును శంకరునిపై ప్రయోగించెను (9).
అమోఘమగు ఆ అస్త్రము పరమాత్ముని యందు మొక్క వోయెను. గొప్ప కోపము గల పరమేశ్వరుని పొంది ఆ అస్త్రము శాంతించెను (10). తన అస్త్రము శివుని యందు వ్యర్థము కాగానే మన్మథుడు భయమును పొందెను. ఆతడు తన ఎదుట నున్న మృత్యుంజయుడగు శివ ప్రభుని గాంచి వణికిపోయెను (11). ఓ మహర్షీ! ఆ మన్మథుడు తన ప్రయత్నము వ్యర్థము కాగానే భయభీతుడై ఇంద్రాది దేవతలనందరినీ స్మరించెను (12). ఓ మునిశ్రేష్ఠా! కామునిచే స్మరింపబడిన వారై ఇంద్రాది దేవతలందరు అచటకు విచ్చేసి శివునకు ప్రణమిల్లి స్తుతించిరి (13).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
10 May 2021
No comments:
Post a Comment