గీతోపనిషత్తు -248
🌹. గీతోపనిషత్తు -248 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 8వ అధ్యాయము - అక్షర పరబ్రహ్మ యోగము 📚
శ్లోకము 26
🍀 25. నిశ్వాస - ఉచ్ఛ్వాస 🍀
శుక్ల కృషే గతీ హ్యేతే జగతః శాశ్వతే మతే |
ఏకయా యా త్యనావృత్తి మన్యయా 2 వర్తతే పునః || 26
తాత్పర్యము : శుక్ల కృష్ణ మార్గములు రెండునూ జగత్తున శాశ్వతముగ నుండునని తెలుపబడు చున్నవి. వాని వలన జన్మరాహిత్యము, పునర్జన్మము అను రెండు విధానములు శాశ్వతముగ తెరువబడి యున్నవి.
వివరణము : ఒక గృహము నందుగాని, గ్రామమునందు గాని, పట్టణము నందుగాని ప్రవేశించుటకు నిష్క్రమించుటకు మార్గము లుండవలెనుగదా! “లోపల, వెలుపల" మార్గములు
లేని నిర్మాణము నిరుపయోగము. సృష్టియంతయు అద్భుతమగు నిర్మాణము. దేవతలు, ఋషులు దైవ సహకారమున ఈ సృష్టి నిర్మాణము గావించి, ఇందు ప్రాణికోట్లను ప్రవేశపెట్టుట జరిగినది. ప్రవేశించువారికి నిష్క్రమణ మార్గము కూడ తెలుపబడినది. కనుకనే సృష్టి పరిపూర్ణము.
ఒక క్రీడారంగమున ప్రవేశించుట యే గాని నిష్క్రమించుట లేనిచో, అది కారాగారమే యగును గాని క్రీడారంగము కానేరదు. గుహలో ప్రవేశించిన వానికి సహితము వెలుపలకు చను మార్గము తెలిసి యుండవలెను. లోపలకు, వెలుపలకు గల మార్గములు తెలియుట జ్ఞానము. సృష్టి ఒక పద్మవ్యూహము వంటిది. అందు ప్రవేశించుటయే తెలిసి, నిష్క్రమించుట తెలియనపుడు నశించుట తథ్యమని అభిమన్యుని కథ అందించు చున్నది.
భగవద్గీత యందు వెలుపలకు చను మార్గము చెప్పుటకే ఈ అక్షర పరబ్రహ్మ యోగము తెలుపుట జరిగినది. 12, 13 శ్లోకముల యందు దేహమునుండి వెలువడు విధానము జీవులకు బోధించుట జరిగినది. సృష్టి లోపలకు, వెలుపలకు చరించు నారదాది మునీంద్రులు జీవులందరికిని ఆదర్శము. యథేచ్ఛగ సృష్టియను క్రీడారంగమున ప్రవేశించుచు, దివ్య సంకల్పములు నిర్వర్తించుచు, అపుడపుడు సృష్టికి ఆవల ప్రకాశించుచుండు తత్త్వము దర్శించుచు జీవించువారు నారదాది మహర్షులు, సనక సనందనాది కుమారులు మొదలగు వారు.
నారాయణ లోకము నుండి అధోలోకము వరకు అవరోహణము, ఆరోహణము చేయు మార్గములు తెలిసినవారే నిజమగు మార్గదర్శకులు. వారు కాలమును బట్టి, కర్తవ్యమును బట్టి కృష్ణ శుక్ల గతులను మన్నింతురు. భగవంతుని నిశ్వాసగ సృష్టిలోనికి దారి ఏర్పడగ, ఉచ్ఛ్వాసగ సృష్టినుండి భగవంతునికి దారు లేర్పడినవి. స్పందనాత్మకుడగు జీవునకు శ్వాస ఎట్లో, సృష్టియందు కూడ రాకపోకల మార్గమునకు వాని ఆవశ్యకతను తెలిసి వర్తించుట జ్ఞానము. ఒకదాని కన్న ఒకటి గొప్పదని భావించుట యోగ విరుద్ధము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
02 Sep 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment