శ్రీ శివ మహా పురాణము - 447


🌹 . శ్రీ శివ మహా పురాణము - 447🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 30

🌻. పార్వతి గృహమునకు మరలి వచ్చుట - 1 🌻


నారదిట్లు పలికెను -

ఓ విధీ! తండ్రీ! మహాత్మా! పరమసత్యమును దర్శించు నీవు ధన్యుడవు. నీ అనుగ్రహముచే నేనీ అద్భుతగాథను వింటిని (1). శివుడు తన పర్వతమునకు వెళ్లిన పిదప సర్వమంగళయగు పార్వతి ఏమి చేసెను? ఎచటకు వెళ్లెను? ఓ మహా బుద్ధీ! నాకు ఆ గాథను చెప్పుము (2).

బ్రహ్మ ఇట్లు పలికెను-

వత్సా! ప్రీతితో వినుము. నేను శివుని స్మరించి, శివుడు తన ధామమునకు వెళ్లిన తరువాత జరిగిన వృత్తాంతమును చెప్పెదను (3). తన రూపమును సార్థకము చేసుకున్న పార్వతి కూడా సఖురాండ్రతో గూడి మహాదేవనామమును జపిస్తూ తన తండ్రిగారి గృహమునకు వెళ్లెను (4). మేనా హిమవంతులు పార్వతి రాకును గురించి విని హర్షమును పట్టజాలక దివ్యమగు రథమును నధిష్టించి ఎదురేగిరి (5). పురోహితులు, పౌరులు, పెద్ద సంఖ్యలో సఖురాండ్రు, బంధువులు మరియు ఇతరులు అందరు విచ్చేసిరి (6).

అపుడు మైనాకు మొదలగు సోదరులందరు మహానందముతో నిండిన వారై జయధ్వానమును చేస్తూ విచ్చేసిరి (7). ప్రకాశించే రాజ మార్గమునందు మంగళఘటమును స్థాపించిరి. రాజమార్గము చందనము, అగరు, కస్తూరి, ఫలములు మరియు శాఖలతో ప్రకాశించెను (8).

పురోహితులగు బ్రాహ్మణులతో, బ్రహ్మవేత్తలగు ఋషులతో, నాట్యముచేయు స్త్రీలతో, మరియు పర్వతముల వంటి గొప్ప ఏనుగులతో రాజమార్గము శోభిల్లెను (9). రెండు వైపులా అరటి స్తంభములచే అలంకిరంపబడిన ఆ రాజమార్గములో భర్త, పిల్లలు గల ముత్తైదువలు దీపములను చేతబట్టి గుంపులుగా నిలబడిరి (10).

అచట బ్రాహ్మణ బృందములు మంగళ ధ్వనిని చేయుచుండిరి. శంఖము మొదలగు అనేక వాద్యములు మ్రోయింప బడుచుండెను (11). ఇంతలో దుర్గ తన నగరమునకు సమీపించెను. ఆమె నగరములో ప్రవేశిస్తూనే, ఆనందము పట్టజాలని తల్లిదండ్రులను చూచెను (12). మిక్కిలి ప్రసన్నులై వేగముగా వచ్చిన వారిని చూచి కాళి మిక్కిలి సంతసించి, తన సఖురాండ్రతో సహా వారికి నమస్కరించెను (13). వారు పూర్ణమగు ఆశ్వీరచనములను పలికి 'ఓ అమ్మాయీ!' అని అక్కున చేర్చుకుని ప్రేమను పట్టజాలక ఆనందబాష్పములను రాల్చిరి (14).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


02 Sep 2021

No comments:

Post a Comment