గీతోపనిషత్తు -268
🌹. గీతోపనిషత్తు -268 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚
శ్లోకము 9-1
🍀 9. సాక్షీభూతుడు -1 - జీవుల కర్మలన్నియు వారి యందలి గుణ సముదాయముచే నిర్వర్తింపబడి, సుఖదుఃఖముల నిచ్చును. సుఖమువలన, దుఃఖమువలన కూడ జీవులు బంధింపబడు చున్నారు. అట్టి కర్మములకు, బంధములకు అతీతుడైన ఈశ్వరుడు తటస్థుడై సర్వమును చూచుచు నుండును. అందే కర్మ యందును అతని కాసక్తి లేదు. అట్టి ఈశ్వరుడు సాక్షీ భూతుడు. మన యందు కూడ ఈశ్వరుడున్నాడు. మన ప్రకృతి ననుసరించి మన కర్మ లుండును. మన కర్మను బట్టి మనకు బంధ మోక్షము లుండును. కర్మలు నిర్వర్తించు తీరు తెలియనపుడు బంధనముండును. తెలిసినపుడు బంధముండదు. 🍀
నచ మాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ |
ఉదాసీనవ దాసీన మసక్తం తేషు కర్మసు II 9
తాత్పర్యము : ప్రకృతి కారణముగ జీవులాచరించు కర్మల యందు నేను తగులుకొనను. తటస్థునివలె యుందును. జీవుల కర్మలు నన్ను బంధింపవు, బంధింపలేవు.
వివరణము : ఈశ్వరుడు ప్రకృతికతీతుడు. తన నుండి ఏర్పడిన ప్రకృతి నుండి మూడు గుణము లేర్పడుచున్నవి. అవియే సత్వ రజస్తమస్సులు. ఆ గుణములనుండి జీవులేర్పడుచున్నారు. జీవుల కర్మలన్నియు వారి యందలి గుణ సముదాయముచే నిర్వర్తింపబడి, సుఖదుఃఖముల నిచ్చును. సుఖమువలన, దుఃఖమువలన కూడ జీవులు బంధింపబడు చున్నారు. అట్టి కర్మములకు, బంధములకు అతీతుడైన ఈశ్వరుడు తటస్థుడై సర్వమును చూచుచు నుండును. అందే కర్మ యందును అతని కాసక్తి లేదు. అట్టి ఈశ్వరుడు సాక్షీ భూతుడు.
మన యందు కూడ ఈశ్వరుడున్నాడు. అతడాధారముగ ప్రకృతి యున్నది. మన గుణ సమ్మేళనమునుబట్టి, ప్రకృతి మన ప్రకృతివలె తయారగును. మన ప్రకృతి ననుసరించి మన కర్మ లుండును. మన కర్మను బట్టి మనకు బంధ మోక్షము లుండును. కర్మలు నిర్వర్తించు తీరు తెలియనపుడు బంధనముండును. తెలిసినపుడు బంధముండదు. బంధములు ద్వంద్వములుగ నుండును. సుఖ బంధము, దుఃఖ బంధము. మన యందలి ఈశ్వరుడు మనలను, మన ప్రకృతిని, మన కర్మల నిర్వహణ మందలి జానాథానములను తటస్థుడై చూచుచుండును. అందే కర్మముతోను అతడు తగులుకొనడు. తగులుకొను ఆసక్తి కూడ లేదు. ప్రతి జీవుడు మూలముగ ఈశ్వరుడున్నాడు. అతడు తటస్థుడు. జీవకర్మల యందు అనాసక్తుడు. అతడిని ఏ కర్మలు బంధింపవు.
సూర్యోదయము వేళలో జీవులు క్రమశః మేల్కాంచి, అనేకానేకమగు కార్యములు దినమంతయు నిర్వర్తించుచు నుందురు. పశుపక్ష్యాదులు, మానవులు మేల్కాంచి వైవిధ్యమగు కార్యములలో నిమగ్న మగుదురు. మధ్యాహ్నము వేళకు పనులు వేడెక్కును. వేగము పెరుగును. సూర్యాస్తమయ సమయమునకు పనుల వేగము తగ్గును. రాత్రి మొదటి జాము గడచిన తరువాత జీవులు నిద్రలోనికి జారుదురు. ఇవియన్నియు సూర్యుడు ఆధారముగ జరుగుచున్నవి. జరుగుచున్న పనులకు కర్తలు జీవులేగాని సూర్యుడు కాదు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
31 Oct 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment