🌹 . శ్రీ శివ మహా పురాణము - 467 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴
అధ్యాయము - 33
🌻. సప్తర్షుల ఉపదేశము - 4 🌻
ఆమె మరియొక కల్పములో దక్షుని భార్య యొక్క గర్భము నుండి పుట్టి సతియను పేరును గాంచి శివుని వివాహమాడెను. దక్షుడు ఆమెను ఆయనకిచ్చి వివాహము చేసెను (44). ఆమె భర్తను నిందించుటను విని, యోగ మహిమచే దేహమును త్యజించెను. ఆమెయే నీ వలన మేనా గర్భము నందు జన్మించి పార్వతీ రూపములో నున్నది (45).
ఓ పర్వతరాజా ! ఈశివాదేవి జన్మజన్మల యందు, సర్వకాలములయందు శివుని అర్ధాంగి. ఈ తల్లి సర్వోత్కృష్టురాలు. జ్ఞానులయందు ఈమె బుద్ధి రూపమున నుండును (46). సదా సిద్ధిని ఇచ్చునది, సిద్ధి స్వరూపురాలు, స్వయంసిద్ధ అగు ఈ దేవి ఇచట జన్మించి యున్నది. శివుడు సతీదేవి యొక్క అస్థికలను, చితాభస్మను భక్తితో స్వయముగా ధరించును (47). కావున నీవు మంగళ స్వరూపురాలగు నీకన్యను సంతోషముతో శివునకు ఇమ్ము. లేనిచో నీవు ఈయనిచో, ఆమెయే తన భర్త ఉండు స్థానమునకు స్వయముగా వెళ్లగలదు (48).
నీ కుమార్తె యొక్క తీవ్రమగు తపస్సులోని క్లేశములను చూచి, దేవతలకు ప్రతిజ్ఞనుచేసి, దేవదేవుడగు శివుడు బ్రాహ్మణ వేషములో నీకుమార్తె తపస్సు చేయు స్థలమునకు వచ్చినాడు (49). ఓ పర్వతరాజా ! ఆ శంభుడు ఆమెను ఓదార్చి, వరము నిచ్చి, తన నివాసమునకు వెళ్లి, ఆమె కోర్కె మేరకు నిన్ను పార్వతిని ఇమ్మని యాచించినాడు (50).
శివభక్తి యందభిరుచితో గూడిన మనస్సుగల మీరిద్దరు అంగీకరించి యున్నారు. ఓ పర్వతరాజా! కాని మీకు ఇప్పుడు తద్విరుద్ధమగు మనస్సుకలుగుటకు కారణమేమి? చెప్పుము (51). అపుడు దేవతలు శివుని వద్దకు వెళ్లి ప్రార్థించగా, ఆయన సప్తర్షులగు మమ్ములను, అరుంధతిని వెనువెంటనే నీ వద్దకు పంపించినాడు (52).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
29 Oct 2021
No comments:
Post a Comment