శ్రీ శివ మహా పురాణము - 218


🌹.   శ్రీ శివ మహా పురాణము - 218   🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴

48. అధ్యాయము - 3

🌻. కామశాపానుగ్రహములు - 3 🌻

నిసర్గసుందరీ సంధ్యా తాన్‌ భావాన్‌ మానసోద్భవాన్‌ |కుర్వంత్యతిరాం రేజే స్వర్నదీప తనూర్మి భిః || 25
అథ భావయుతాం సంధ్యాం వీక్ష్యాకార్షం ప్రజాపతిః | ధర్మాభిపూరిత తను రభిలాషమహం మునే || 26
తతస్తే మునయస్సర్వే మరీచ్యత్రిముఖా ఆపి | దక్షాద్యాశ్చ ద్విజశ్రేష్ఠ ప్రాపుర్వై కారికేంద్రియమ్‌ || 27
దృష్ట్వా తథావిధా దక్షమరీచిప్రముఖాశ్చ మామ్‌ | సంధ్యాం చ కర్మణి నిజే శ్రద్దధే మదనస్తదా || 28

సహజ సుందరి యగు సంధ్య , మనస్సులో పుట్టే కామభావములను ప్రకటించుచున్నదై, చిన్న తరంగములతో కూడిన మందాకిని నదివలె మిక్కిలి ప్రకాశించెను (25).

ఓ మహర్షీ! ప్రజాపతియగు నేను కామభావముతో కూడిన సంధ్యను చూచి, కామభావముతో నిండిన శరీరము గలవాడనై ఆమెను అభిలషించితిని (26).

అపుడా మరీచి , అత్రి మొదలగు మునులు, దక్షుడు మొదలగు ప్రజాపతులు కూడా ఇంద్రియ వికారములను పొందిరి (27).

ఓ విప్రశ్రేష్ఠా! దక్షుడు, మరీచి మొదలగు వారు, మరియు నేను అట్లు అగుటను చూచి, మరియు సంధ్యను చూచి, మన్మథునకు తన సామర్ధ్యము పై విశ్వాసము కలిగెను (28).

యదిదం బ్రహ్మణా కర్మ మమోద్దిష్టం మయాపి తత్‌ | కర్తుం శక్యమితి హ్యద్ధా భావితం స్వభువా తదా || 29
ఇత్థం పాపగతిం వీక్ష్య భ్రాతౄణాం చ పి తుస్తథా | ధర్మ స్సస్మార శంభుం వై తదా ధర్మావనం ప్రభుమ్‌ || 30
సంస్మరన్మనసా ధర్మశ్శంకరం ధర్మపాలకమ్‌ | తుష్టావ వివిధైర్వాక్యైర్దీనో భూత్వాజసంభవః || 31

'బ్రహ్మ నాకు అప్పజెప్పిన ఈ కర్మను నేను చేయగలను ' అనే విశ్వాసము మన్మథునకు దృఢముగా కలిగెను (29).

అపుడు ధర్ముడు పాపభావనతో కూడిన సోదరులను, తండ్రిని చూచి, ధర్మ రక్షక ప్రభువగు శంభువును స్మరించెను (30).

బ్రహ్మ పుత్రుడగు ధర్మడు దీనుడై, ధర్మ పాలకుడగు శంకరుని మనస్సులో స్మరించుచూ అనేక వాక్యములతో ఇట్లు స్తుతించెను (31).

ధర్మ ఉవాచ |

దేవ దేవ మహాదేవ ధర్మపాల నమోsస్తుతే | సృష్టి స్థితి వినాశానాం కర్తా శంభో త్వమేవ హి || 32
సృష్టౌ బ్రహ్మా స్థితౌ విష్ణుః ప్రలయే హరరూపధృక్‌ | రజస్సత్త్వ తమోభిశ్చ త్రిగుణౖరగుణః ప్రభో || 33
నిసై#్రగుణ్యశ్శివస్సాక్షాత్తుర్యశ్చ ప్రకృతేః పరః | నిర్గుణో నిర్వికారీ త్వం నానాలీలా విశారదః || 34
రక్ష రక్ష మహాదేవ పాపాన్మాం దుస్తరాదితః | మత్పితాయం తథా చేమే భ్రాతరః పాపబుద్ధయః || 35

ధర్ముడు ఇట్లు పలికెను -

దేవ దేవా! మహాదేవా! ధర్మరక్షకా! నీకు నమస్కారము. శంభో! సృష్టిస్థితిలయకర్తవు నీవే గదా!(32).

ప్రభో! గుణరహితుడవగు నీవు రజస్సు, సత్త్వము, తమస్సు అను గుణములను స్వీకరించి, సృష్టియందు బ్రహ్మ రూపమును, స్థితియందు విష్ణురూపమును, ప్రళయమునందు రుద్రరూపమును ధరించెదవు (33).

శివుడు త్రిగుణా తీతుడు. త్రిమూర్తుల కతీతమైన తురీయతత్త్వమే శివుడు. ఆయన ప్రకృతి కంటె ఉత్కృష్టుడు. అట్టి నీవు నిర్గుణుడవు. నిర్వికారుడవు. అయిననూ, అనేక లీలలను ప్రకటించుటలో సమర్థుడవు (34).

మహాదేవా! నన్ను తరింప శక్యము గాని ఈ పాపము నుండి రక్షింపుము. రక్షింపుము. ఈ నా తండ్రి, మరియు ఈ నా సోదరులు పాప బుద్ధిని కలిగియున్నారు (35).

బ్రహ్మోవాచ |

ఇతి స్తుతో మహేశానో ధర్మేణౖవ పరః ప్రభుః | తత్రా జగామ శీఘ్రం వై రక్షితుం ధర్మమాత్మభూః || 36
జాతో వియద్గతశ్శంభుర్విధిం దృష్ట్వా తథావిధమ్‌ | మాం దక్షాద్యాంశ్య మనసా జహా సోపజహాస చ || 37
స సాధువాదం తాన్‌ సర్వాన్‌ విహస్య చ పునః పునః | ఉవాచేదం మునిశ్రేష్ఠ లజ్జయన్‌ వృషభధ్వజః || 38

బ్రహ్మ ఇట్లు పలికెను -

పరమ ప్రభువు, స్వయంభువునగు మహేశ్వరుడు ధర్మునిచే ఈ విధముగా స్తుతింపబడినవాడై, వెంటనే అచటకు ధర్మ రక్షణ కొరకై విచ్చేసెను (36).

బ్రహ్మను (నన్ను) , దక్షుడు మొదలగు వారిని ఆ విధముగా చూసిన శంభుడు ఆకాశమునందే ఉండి ఎంతయూ నవ్వుకొనెను (37).

వృషభవాహనుడగు ఆ శివుడు వారందరితో 'సాధు సాధు' అని పిలికెను. ఓ మహర్షీ! ఆయన మరల మరల నవ్వి, వారికి సిగ్గు కలుగు విధముగా ఇట్లు పలికెను (38).

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము

08.Sep.2020

No comments:

Post a Comment