కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 48


🌹.   కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 48   🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఆత్మ విచారణ పద్ధతి - 12 🌻

యముడు నచికేతుని మరల ఇట్లు ప్రశంసించు చున్నాడు. నచికేతా! నీవు బుద్ధిమంతుడవు, ధైర్యశాలివి, కనుకనే కామ భోగ ప్రాప్తిని త్యజించితివి, జగత్తు యొక్క స్థితిని గ్రహించితివి.

క్రతువుల వలన కలిగెడి ఫలమెంతటి విశాలమైనదైననూ, ఇహమందు రాజ్యాధి పత్యమును, పరమందు హిరణ్యగర్భ పదవిని కల్గించునదైనను ఇవి అశాశ్వతమని ఎరిగి త్రోసిపుచ్చితివి. స్తుతింప దగిన సర్వమాన్యతను, కీర్తిని కోరవైతివి. ఇవి అన్నియు సంసార భోగమునకు సంబంధించినవే కానీ, పరతత్త్వమునకు సంబంధించినవి కావని వదలితివి. నీ వంటి ఉత్తమ గుణములు కలవాడు దొరకుట దుర్లభము.

ఇక్కడ యమధర్మరాజు గారు నచికేతుని యొక్క ఉత్తమగుణాలని, అధికారిత్వాన్ని గురించి మాట్లాడుతున్నారు. మనం కూడా ఇటువంటి అధికారిత్వాన్ని సంపాదించాలి. ఆత్మజ్ఞానం సంపాదించాలనుకున్న ప్రతీ ఒక్కరూ కూడా ఇటువంటి అధికారిత్వాన్ని సంపాదించ వలసినటువంటి అవసరం వుందన్నమాట!

ఏమిటి ఆ అధికారిత్వం? అనేది ఒక్కసారి మనం విచారణగా గ్రహిస్తే ‘బుద్ధిమంతుడువు’. సాధారణంగా ‘బుద్ధిమంతుడు’ అంటే అర్థం ఏమిటి? ఈ మాట ప్రతి మానవుడు అనిపించుకోవాలన్నమాట!

వ్యవహారంలో బుద్ధిని మాత్రమే ఆశ్రయించే సత్వగుణ ఆశ్రయంతోటి, సత్వగుణ వ్యవహారం తోటి, సాత్వికమైన జీవనం తోటి... బుద్ధి యొక్క అధిష్ఠానంతో, ఇతర ఇంద్రియములను శాసించగలిగేటటువంటి సమర్థత, విజ్ఞత కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే వున్నారో, వాళ్ళని బుద్ధిమంతుడు అంటారు.

మానవులు ఎవరైనా సరే, పెద్దలు ఎవరైనా సరే, శిష్యుడిగా స్వీకరించాలి అనంటే మొదటి అధికారం నువ్వు బుద్ధిమంతుడివై వుండాలి.

అంటే అర్థం ఏమిటంటే, ఇంద్రియార్థముల యందు నీకు ఆసక్తి లేకుండా, బుద్ధి యొక్క బలం చేత, వాటిని స్వాధీనపరచుకున్నవాడివై, నీవు వాటిని వినియోగించడంలో విజ్ఞత కలిగినవాడివై వుండాలి అంటే ‘ప్రాప్త కాలజ్ఞత’ అంటారు.

అంటే ఏ సమయానికి ఏ ఇంద్రియాలను ఎలా వాడాలి?

ఏ సమయానికి ఏ ఇంద్రియంతో వ్యవహరించాలి?

ఎలా వ్యవహరించాలి?

ఎంతవరకూ వ్యవహరించాలి?

ఎలా అవి అహం లేకుండా వ్యవహరించాలి?

ఎలా వినయంతో వ్యవహరించాలి?

ఎలా సాధికారంగా వ్యవహరించాలి?

ఎలా సమర్థంగా వ్యవహరించాలి?

ఈ లక్షణాలనన్నింటినీ ఒకేసారి అమలుపరచగలిగేటటువంటి శక్తి బుద్ధిలో వుంటుంది.

కాబట్టి బుద్ధికి వున్న బలం అటువంటిదన్నమాట! వీటన్నిటిని సక్రమముగా, సవ్యముగా, ఆ క్షణము నుండి ఏ క్షణంలో కావాలంటే ఆ క్షణంలో ఉపయోగించగలిగేటటువంటి సమర్థుడైనటువంటి వాడిని ‘బుద్ధిమంతుడు’ అని అంటారు. - విద్యా సాగర్ స్వామి

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #కఠోపనిషత్ #చలాచలబోధ

08.Sep.2020

No comments:

Post a Comment