కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 58


🌹.  కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 58  🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. ఆత్మ విచారణ పద్ధతి - 22 🌻

ఈ మనుష్యులు ఆత్మతత్వమును, ఆచార్యుని ఉపదేశమును శ్రద్ధగా విని, శ్రవణ, మనన, నిధి, ధ్యాసల ద్వారా ఈ ఆత్మతత్వమును, ఆత్మనిష్ఠగా ఆత్మవిచారణను ఆత్మనిష్ఠగా, ఆత్మానుభూతిగా మరల్చుకోవాలి అంటే, ఒక ఉపాయమున్నది.

ఏమిటంటే, సదా ఆచార్యుడు చెప్పినటువంటి ఉపదేశమును శ్రవణ, మనన, నిధి, ధ్యాసలు అనేటటువంటి నాలుగు సాధనలని ఆశ్రయించి, నిరంతరాయముగా, అవస్థాత్రయములో నేను ఆత్మస్వరూపుడను, అనే నిశ్చయమును, నిర్ణయమును కలిగివుండి, నీ శరీరయానమును పూర్తిచేయాలి. శరీరయానము ఇది ఒక ప్రయాణం లాంటిది.

మనం ఒక వాహనంలో ఎక్కామే అనుకోండి? ఆ వాహనాన్ని మనం నడుపుతున్నాం అనుకోండి, ఒక చోటునుంచీ మరొక చోటుకి ప్రయాణం చేస్తున్నామనుకోండి, అయినంత మాత్రమున... ఆ వాహనము నీవు కాదు కదా! రధము నీవు కాదు. రధికుడవు.

కాబట్టి అట్లా ఆత్మతత్వమును అతిసూక్ష్మముగా వున్నటువంటి దానిని, ఈ శరీరాదికము నుంచీ వేరు పరిచి, నేను రధమును కాదు, నేను రధికుడను, నేను దేహమును కాదు, నేను దేహిని. నేను శరీరమును కాదు, నేను శరీరిని. నేను క్షేత్రమును కాదు, నేను క్షేత్రజ్ఞుడను.

నేను క్షర పురుషుడను కాదు, అక్షరపురుషుడను. అనేటటువంటి పద్ధతిగా... వేరుపరుచుకోగలగడం రావాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి పరిణామం. అలా వేరుపరుచుకోగలిగే సమర్థతను సంపాదించడమే ‘ఆత్మసాక్షాత్కార జ్ఞానం’ అంటే!

‘ఆత్మసాక్షాత్కార జ్ఞానం’ అంటే ఆకాశం నుంచీ ఏమీ మెరుపులు, పిడుగులు పడవు. నీ నెత్తి మీద అంతకంటే అమృతవృష్ఠి ఏమీ కురవదు. నీవేమీ పైనుంచీ కిందకేమీ పడిపోవు. లేదు కిందనుంచీ పైకి ఉత్థాన పతనాన్ని చెందవు. భౌతికమైన మార్పులేమీ రావు. నీలో ఒక విజ్ఞానపరమైనటువంటి పరిణామం చేత లభిస్తుంది. అదేమిటంటే ‘సర్వసాక్షిత్వము’.

అటువంటి సర్వ సాక్షిత్వ స్థితికి నువ్వు ఎదుగుతావు. అట్లా ఎదిగినటువంటి వాళ్ళు ఎవరైతే వున్నారో, వారు శరీరాదికము నుంచీ వేరుపడినటువంటి వారు.

అంటే ఎలా అంటే, ఎంత కష్టపడినప్పటికీ, పాము తన శరీరము నుంచీ వేరుపడేటటువంటి కుబుసమును ఎట్లా వదిలి పెడుతున్నది? ఆ ముళ్ళ చెట్లలోకి, ఆ ముళ్ళ తీగల్లోకి వెళ్ళి శరీరమంతా రక్తధారలు ప్రవహిస్తున్నప్పటికీ, కుబుసము నుంచీ వేరు చేసుకుంటుంది.

అట్లా, పాము కుబుసము వదిలినట్లుగా నీవు నీ శరీర తాదాత్మ్యత భావమును విడువవలెను. అట్లా ఎవరైతే విడుస్తారో, అట్లా ఆత్మను పొందినవారు ఎవరైతే వుంటారో, సర్వదుఃఖముల నుండి విముక్తుడై, బ్రహ్మానందమును అనుభవించును.

ఏమిటండీ దీని వల్ల ఉపయోగం అనంటే, ‘బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం’ - అనేటటువంటి ప్రార్థన శ్లోకం ఏదైతే చెప్పుకుంటున్నామో, అది యథాతథముగా అనుభూతమై వుంటుంది. అట్లాంటి అనుభవస్థితిలో వుండి, ప్రయాణం చేస్తూ వుంటారు. శరీరం ఎప్పుడు పడిపోయినా సిద్ధముగా వుంటారు.

అటువంటి సిద్ధత్వాన్ని, బుద్ధత్వాన్ని పొందుతారు. కాబట్టి ఇలాంటిదానికి అధికారిత్వాన్ని పొందినటువంటి నచికేతుడుకి మోక్షద్వారము తెరువబడి వుండడంలో విశేషమేముంది? కాబట్టి, నచికేతుడికి మోక్షము సులభముగా లభిస్తుందనేటటువంటి సత్యాన్ని యమధర్మరాజు చెప్తున్నాడు. ఎందువల్ల అంటే అతడు అధికారి కాబట్టి.

యమధర్మరాజు ఇంతవరకూ చెప్పిన విషయములు విని నచికేతుడు తనలోతాను ఇట్లు అనుకొనెను. అశాశ్వతమైన సాధన ద్వారా శాశ్వత పదవిని పొందజాలమని చెప్పుచునే నాచికేతాగ్ని చయనము చేత తాను ఈ నిత్య పదవిని పొందితినని చెప్పుచున్నాడు.

మరల ఈ ఆత్మ అతి సూక్ష్మమైనదని, సులభముగా పొందదగినది కాదని, ఇంద్రియ నిగ్రహము ద్వారా యోగము అభ్యసించిన వారు తెలిసికొన గలరని చెప్పుచున్నాడు. నీ వంటి వారే దీనికి అర్హులని మధ్యలో నన్ను ప్రశంసించుచున్నాడు. అసలు విషయము చెప్పకుండా దాటవేయునేమోయని సంశయించి నచికేతుడు యమధర్మరాజు నిట్లడుగుచున్నాడు. - విద్యా సాగర్ స్వామి

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #కఠోపనిషత్ #చలాచలబోధ

21 Sep 2020

No comments:

Post a Comment