భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 115



🌹.   భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 115   🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. మతంగ మహర్షి - 3 🌻

18. “నువ్వు కేవలం సామాన్య బ్రాహ్మణుడివిగానే ఉన్నావు. కేవలం ఆదిలోనే ఉన్నావు ప్రస్తుతం. అంతంలో లభించేఫలం కావాలని కోరుకుంటున్నావు. నీలో ఉన్న బ్రాహ్మణత్వంవలన ఏమీ ప్రయోజనంలేదు. బ్రాహ్మణుడిగా పుట్టి జాతిలో ఉండే ధర్మాన్ని నిలబెట్టుకోవటము చాలాకష్టము.

19. అనేక జన్మలకొక పర్యాయం బ్రాహ్మణజన్మ పొందినా; ధనవాంఛ, విషయలోలత్వం, అహంకారము నూటికి తొంభైతొమ్మిదికిపైగా ఉంది. సదాచారము వదలి బ్రాహ్మణత్వమును మంటగలిపి వంశానికి అపఖ్యాతి తెచ్చినవాళ్ళు చాలామందిఉన్నారు. కాబట్టి నీ ఆశలు అడిఆశలేకాని అన్యములుకావు. ఇకనైనా నీ తపస్సు మానుకుని ఏదయినా వరం కోరుకో!” అన్నాడు ఇంద్రుడు.

20. కులస్వభావం అంటే గుణమే. ఎవరైనా ఎప్పుడైనా కూడా బ్రాహ్మణుడు, శూద్రౌడు, చండాలుడు, లేఛ్ఛుడు అంటే అది గుణాన్ని గురించే. శరీరానికి కులం ఉంటుందా? లేదు. ఆత్మకూ కులంలేదు. మరి దేనికి కులం అంటే, గుణానికి.

21. రూఢీగా మహాత్ములు, జ్ఞానులు అందరూ వేలసార్లు మరీమరీ ఈ సత్యాన్ని పురాణాలలో, ఇతిహాసాలలో, బ్రాహమణాలలో, వేదవాఙ్మయంలో చెపుతూవచ్చారు.

22. బ్రహమపురాణంలో:

కర్మభిః శుచిభిః దేవి శుద్ధాత్మా విజితేంద్రియః|
శూద్రోపి ద్విజవత్ సేవ్యః ఇతి బ్రహ్మా బ్రవీత్ స్వయమ్||

23. అంటే, ఉత్తముడైన శూద్రుడు బ్రాహ్మణునివలెనే సేవించదగినవాడు. గుణమంటే ప్రవృత్తి అనే అర్థం. నీవు బ్రాహ్మణుడివేకాని నీ ప్రవృత్తి రాక్షసవృత్తి, రాక్షసుడివై పుట్టు అని శపిస్తూఉంటారు పురాణాలలో మన ఋషులు. మదించి ఉన్నావు, ఏనుగైపుట్టు; బుద్ధిలేకుండా గడ్డితింటున్నావు, గడ్డితినే పశువువైపుట్టు అని శపించడం మనం చూస్తూ ఉంటాం.

24. అంటే మనిషే గడ్డితినే పశువై పుడితే, బాగా స్వేఛ్ఛగా తినవచ్చు కదా! అంటే, వాడి గుణానికి తగిన శరీరాన్ని ప్రసాదించి, ఆ ప్రవృత్తిని క్షయంచేయడం అన్నమాట. కొంచెం ఆలోచిస్తే అది అవసరమే అవుతుంది. అంటే యథోచితమైన జన్మను తీసుకోమని చెప్పటం. ‘నీ గుణానికి తగిన జన్మ నీకిస్తాను’ అని చెప్పటమే.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద

21 Sep 2020

No comments:

Post a Comment