✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 66 📚
ప్రజ్ఞ బుద్ధియందు స్థిరపడుటయే బుద్ధియోగము. అట్లు బుద్ధియందు నిలబడవలెనన్నచో మనస్సు నిర్మలము కావలయును. మనస్సు నిర్మలము కావలెనన్నచో ఇంద్రియములు ఇంద్రియార్థముల యందు తగులుకొని యుండరాదు.
నాస్తి బుద్ధి రయుక్తస్య న చాయుక్తస్య భావనా |
న చాభావయతః శాంతి రశాంతస్య కుతః సుఖమ్ || 66
తగులు కొనక యుండుటకు సాధకుడు ద్వంద్వ భావముల నుండి బయల్పడు వలెను. సృష్టి యందలి ద్వంద్వములు జీవుని బంధించునని తెలుసుకొని ద్వంద్వముల యందు ఉదాసీనుడుగా నుండుట, కర్తవ్యము నందు ఉన్ముఖుడై యుండుట నిరంతరము సాధన సాగవలెను. ఇది యొక్కటియే ఇంద్రియముల యందు చిత్తము తగులు కొనక శుద్ధిగ ఉండుటకు ఉపాయము. మరియొక మార్గము లేదు.
ద్వంద్వములు మనసున ఉన్నంతకాలము అవి రాగద్వేషములుగ పని చేయుచునే యుండును. అది కారణముగ మనస్సు నందలి ప్రజ్ఞ బుద్ధి లోనికి ఊర్థ్వగతి చెందకపోగా జీవించు వానిని ద్వంద్వము ఇంద్రియములలోనికి అధోగతి చెందగలదు. కావుననే కర్మకు కర్తవ్యమే ప్రధానముగాని కామము కాదు.
కామ ప్రేరితుడుగాక కర్తవ్య ప్రేరితుడై జీవించుట భగవంతుడందించు చున్న ఉపాయము. అట్లు జీవించు వానిని ద్వందములంటవు. మనస్సు నిర్మలమగును. అట్టి మనస్సు బుద్ధి యందు స్థిరపడు అర్హతను పొందును.
ఇట్లు రాగద్వేష విముక్తుడు కాని వానికి సుఖశాంతులు ఉండజాలవు. కామము ప్రధానము కాగా ఇంద్రియ ద్వారమున మనస్సు పరిపరి విధముల పరిగెత్తుచు అలసిపోవుటయే గాని సుఖశాంతులెట్లు దొరుక గలవు?
నిజమునకు సుఖశాంతులను కోరుట కూడ కామమే. కోరినంత మాత్రమున సుఖశాంతులు జీవునకు కలుగవు. వాటికై యత్నించుట కూడ నిష్ప్రయోజనము. వానిని పొందుటకు కోరికను తీవ్రము, తీవ్రతరము చేయుట ఉపాయము కాదు.
వానిని పొందవలెనన్నచో జీవుడు నిరంతరము తనను కర్తన్య నిర్వహణ నుందు నియమించుకొను చుండవలెను. కర్తవ్య నిర్వహణము చేయువానికి పుట్టలు పుట్టలుగ భావములు జనింపవు. కామ ప్రవృత్తి కర్తవ్య ప్రవృత్తిగ మారును.
అట్టి కర్తవ్యోన్మోఖునకు కామము లేకుండుట వలన కర్మఫలములపై కూడ ఆసక్తి యుండదు. దీర్ఘ కాలము కర్తవ్యమునే ఆచరించు చుండుటవలన చిత్తశుద్ధి ఏర్పడి సుఖశాంతులు ఆవరించగలవు. మరియొక మార్గము లేదు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
21 Sep 2020
No comments:
Post a Comment