🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. నారద మహర్షి - 10 🌻
76. సంసార మార్గంలో ప్రవేశించి, దానిని తరించి, దాంట్లోంచి బ్రహ్మజ్ఞానివైతే మంచిది. అంటే ప్రవృత్తిలోంచి నివృత్తిమార్గంలోకి వెళ్ళవచ్చు. నివృత్తిలో ఉన్నవాడు ప్రవృత్తిలో పడితే అది పతనం. నిత్యకర్మానుష్టానము, వైదిక కర్మానుష్టానము జాగ్రత్తగా నడిపించుకుంటూ గృహస్థధర్మాన్ని సరిగా పాలించుకుంటూ ఉంటే, దానిని ధర్మమార్గం అంటారు. పతనానికి హేతువు అందులో లేదు.
77. ధర్మమందు నిష్ఠకలిగినవాడికి పతనముండదు కాబటి, అది క్షేమకరమైన మార్గంగా చెబుతున్నారు. వైరాగ్యం కంటే గొప్పదని కాదుకాని, వైరాగ్యమందు ప్రమాదం సంభవిచవచ్చు. పతనం ఏర్పడవచ్చు. ధర్మానుష్ఠానము, కర్మానుష్ఠానమునందు ధర్మమార్గంలో గృహస్తుడవయితే, అక్కడినుంచీ పైమెట్టుకి వెళ్ళడమే. కాబట్టి సంసారమనేది క్షేమకరమైన మార్గమే!.
78. నారదుడు బ్రహ్మను, “నువ్వు దేవతలందరికీ జ్యేష్ఠుడివి. నీ నుంచి దేవతలందరూ పుట్టారు, మునులు పుట్టారు. ఈ జగత్సృష్టికి అనుసంధాయివి నీవు కదా! కాబట్టి ఈ జగత్తంతా ఏమిటి? ఈ సృష్టి ఎలా చేస్తావు? సృష్టియొక్క లక్షణాలు, గుణదోషాలు ఏవి? దాంట్లో ఉన్న అవలక్షణాలు ఏమిటి? ఎందుకు బాధిస్తుంది? కొందరిని ఎందుకు బాధించలేకపోతున్నది?” అని అడిగాడు.
79. బ్రహ్మ నారదునితో, “కర్మ నశింపచేసేటటువంటిది కాలం. కర్మ దేనివలన నశిస్తుంది? అనుభవం అంటారు కాని, కాలం వలన నశిస్తుంది. ఆ కాలంలో జీవుడి స్థితి అనేది ఉండటంచేత నశిస్తుంది. కాలంలో ఏమీ ఉండదు. కాలంలో స్థితి ఉంటుంది, అందువల్ల కర్మనశిస్తుంది. కాలంలో వచ్చేటటువంటి స్థితికే బంధం అని పేరు” అన్నాడు.
80. అంటే కాలమందు స్థితిలో ఉన్నాము. అది బంధనము. కారాగారంలో ఉన్నాడు, శిక్షానుభవిస్తున్నాడూ అంటాము, అంటే ఏమిటి? ఏంచేస్తున్నాడు? శిక్ష ఏమిటి? ఏమీలేదు. అక్కడ ఉన్నాడు అంతే. అప్పుడప్పుడు బయటికి తీసుకొస్తారు. మళ్ళీ సాయంత్రం అందులో ప్రవేశపెడతారు. అందులో ఉంటాడు.
81. ఆ స్థితిని బంధనం అని ఎలా అంటారో, శిక్ష అని ఎలా అంటారో, కాలం అనేటటువంటి వస్తువులో ఏవిధంగా మనుష్యులు ఉనికిని కలిగి ఉంటారో, ఆ విధంగా కర్మక్షయ హేతువైనటువంటిదే కాలము. కర్మక్షయం అయ్యేవరకూ జీవుడు కాలంలో ఉంటాడు. బ్రహ్మ చెప్పిన మాటలివి.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment