శ్రీ శివ మహా పురాణము - 248

🌹 . శ్రీ శివ మహా పురాణము - 248 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
56. అధ్యాయము - 11

🌻. దుర్గాస్తుతి - 3 🌻

శివ పరబ్రహ్మ నిర్గుణుడు, నిర్వికారుడు,నేను ఆయనకు సర్వదా దాసిని. నేను అన్ని వేళలా ఆయన యొక్క ఆజ్ఞను పాలించుదానను (36).

ఆ శివుడే పూర్ణాంశతో రుద్రుడను పేర భక్తులనుద్ధరించుట కొరకై అవతరించెను. ఆయన స్వతంత్రుడైన పరమేశ్వరుడు గదా! (37). 

హరికి బ్రహ్మకు ప్రభువగు ఆ రుద్రుడు ఏ విధముగా చూచినా శివుని కంటె తక్కువ గాడు. మాయాతీతుడు, మాయకు ప్రభువు, సర్వము కంటె శ్రేష్ఠుడు అగు ఆయనకు యోగమునందు ప్రేమ అధికము (38). 

అట్టి రుద్రుని సామాన్య దేవతలలో ఒకడి గను,తన పుత్రునిగను తలంచి, అజ్ఞానముచే పూర్తిగా మోహితుడైన ఈ బ్రహ్మ ఆయనను మోహపెట్టవలెనని గోరుచున్నాడు (39). 

ఈతనికి వరము నీయనిచో, వేద ధర్మము పాడగును. నేనేమి చేయవలెను? నా ప్రభువగు మహేశ్వరునకు నాపై కోపమురాని విధముగా చేయవలెను (40).

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఇట్లు తలచి ఆ ఉమాదేవి మనస్సులో ఆ మహేశ్వరుని స్మరించెను. అపుడు ఆ దుర్గాదేవి శివుని అనుజ్ఞను పొంది నాతో ఇట్లనెను (41).

దుర్గాదేవి ఇట్లనెను -

బ్రహ్మన్‌! నీవు చెప్పినదంతయూ వాస్తవమే. నేను తక్క మరియొకరు శంకరుని మోహింపజేయలేరు (42). శివుడు భార్యను స్వీకరించనిదే ఈ సనాతనమగు సృష్టి పూర్ణము కాబోదని నీవు చేసిన ప్రతి పాదన వాస్తవము (43). 

ఆ మహాప్రభూవును మోహపెట్టగలననే విశ్వాసము నాకు కూడ లేకుండెను. కాని నా విశ్వాసము నీ మాటలను వినుటచే రెట్టింపు అయ్యెను. ఇపుడు నేను దృఢముగా యత్నించెదను (44). 

హే బ్రహ్మన్‌! శివుడు విమోహితుడై స్వయముగా భార్యను స్వీకరించునట్లు నేను ప్రయత్నించెదను (45).

నేను సతీదేవి రూపమును ధరించి, మహాపతివ్రతయగు లక్ష్మి విష్ణునకు ప్రియురాలు అయిన తీరున, ఆయనకు వశవర్తిని కాగలను (46). హే బ్రహ్మన్‌! ఆయన అనుగ్రహమును పొంది, ఆయన నాకు సర్వదా అధీనుడై యుండునట్లు కూడ ప్రయత్నించెదను (47). 

హే పితామహా! నేను దక్షుని భార్య యందు సతీదేవి రూపముతో జన్మించి నా లీలతో శంకరుని సంతోషపెట్టెదను (48). ఇతర మానవులు స్త్రీకి వశవర్తులై ఉన్న తీరుగనే, ఆ హరుడు నా భక్తికి మెచ్చి నాకు వశవర్తియై ఉండగలడు (49).

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ వత్సా! జగన్మాతయగు ఆ ఉమాదేవి నాతో నిట్లు పలికి, తరువాత నేను చూచుచుండగనే అచటనే అంతర్ధానమయ్యెను (50). 

లోకములకు పితామహుడనగు నేను ఆమె అంతర్ధానము కాగానే, నా కుమారులు ఉన్నచోటకు వెళ్లి, జరిగిన వృత్తాంతమునంతనూ వర్ణించితిని (51).

శ్రీ శివ మహాపురాణములో రెండవది యగు రుద్ర సంహితయందు సతీఖండములో దుర్గాస్తుతి - బ్రహ్మవరప్రాప్తి అనే పదకొండవ అధ్యాయము ముగిసినది (11).

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment